Site icon NTV Telugu

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

పారా మౌంట్ కాలనీలో కార్డన్ సెర్చ్.. అక్రమంగా ఉంటున్న నైజీరియన్ల గుర్తింపు

హైదరాబాద్ నగరంలోని పారా మౌంట్ కాలనీలో తెల్లవారుజామున పెద్దఎత్తున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది. అక్రమ చట్టవ్యతిరేక కార్యకలాపాలు, విదేశీయుల అక్రమ నివాసాలపై ఆధారంగా పోలీసులు ఈ ఆపరేషన్‌ చేపట్టారు. సుమారు 150 మంది పోలీసులు తెల్లవారుజాము 3 గంటల సమయంలో ఈ కాలనీని చుట్టుముట్టి సోదాలు ప్రారంభించారు. లా అండ్ ఆర్డర్‌, టాస్క్ ఫోర్స్‌, హెచ్‌ఎన్‌యూ, ఏఆర్ విభాగాలకు చెందిన పోలీసులు ఈ తనిఖీలలో పాల్గొన్నారు.

కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..

బంగారం ధరలు భారీగా పడిపోయాయి. నేడు తులం గోల్డ్ ధర రూ. 600 తగ్గింది. తగ్గిన ధరలు కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,048, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,210 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 550 తగ్గింది. దీంతో రూ. 92,100 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 600 తగ్గింది. దీంతో రూ. 1,00,480 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 550 తగ్గింది. దీంతో రూ. 92,250 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 580 తగ్గింది. దీంతో రూ. 1,00,630 వద్ద ట్రేడ్ అవుతోంది. నేడు కిలో సిల్వర్ పై రూ. 2000 తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,20,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,10,000 వద్ద ట్రేడ్ అవుతోంది.

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణ దాడి.. మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున మంటలు

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య వరుసగా దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్.. ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులు చేస్తోంది. గురువారం ఇజ్రాయెల్‌లోని పెద్దాస్పత్రి ధ్వంసం అయింది. తాజాగా బీర్షెబాలో మైక్రోసాఫ్ట్ ఆఫీసు సమీపంలో ఇరాన్ క్షిపణి ఢీకొట్టింది. దీంతో ఆ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తాజా దాడులతో ఇరు దేశాల మధ్య పరిస్థితులు మరింత ఉధృతంగా మారాయి. దీంతో చాలా మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఇజ్రాయెల్‌లోని రెండు నగరాల ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని బేషరతుగా లొంగిపోవాలని ట్రంప్ కోరారు. అందుకు ససేమిరా అన్నారు. ఇక అమెరికా యుద్ధంలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న తరుణంలో రష్యా హెచ్చరించింది. దాడులకు దిగొద్దని కోరింది. దీంతో రెండు వారాల పాటు ట్రంప్ నిర్ణయాన్ని వాయిదా వేశారు.

విశాఖ నగరానికి వీవీఐపీల తాకిడి.. ఫుల్ లిస్ట్ ఇదే!

జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ సాగరతీరం ముస్తాబయింది. యోగాంధ్ర 2025 కోసం ఆర్కే బీచ్‌ నుంచి భీమిలి వరకు 26 కిమీ మేర వేదికలు సిద్ధం చేశారు. అన్ని వేదికలలో మ్యాట్‌లు, విద్యుద్దీపాలు, ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. రికార్డు స్థాయిలో ఒకేచోట 5 లక్షల మంది యోగాసనాలు వేసేలా ఏర్పాట్లు చేశారు. ఒకవేళ వర్షం పడితే.. కార్యక్రమాన్ని కొనసాగించేందుకు ఆంధ్ర వర్సిటీలో ప్రత్యామ్నాయ వేదిక కూడా సిద్ధంగా ఉంది.

జూన్ 21న ఉదయం 6.25 గంటలకు యోగాంధ్ర 2025 కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఉదయం 6.30 నుంచి 7 గంటల వరకు అతిథులు ప్రసంగించనున్నారు. 6.30 నుంచి 6.45కు కేంద్ర ఆయుష్‌ శాఖ మంత్రి, ఏపీ ముఖ్యమంత్రి, ఏపీ ఉపముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. అనంతరం ప్రధాని 15 నిమిషాలు ప్రసంగించనున్నారు. ఇక 7 గంటలకు ఆసనాలు ప్రారంభించి.. 7.45 వరకు నిర్వహిస్తారు. దాంతో యోగాంధ్ర 2025 ముగుస్తుంది. యోగాంధ్ర 2025 నేపథ్యంలో నేడు విశాఖ నగరానికి వీవీఐపీల తాకిడి ఉంటుంది.

ఎరుపెక్కిన వెలిశాల.. మావోయిస్టు నేత గాజర్ల రవి అంత్యక్రియలతో ఉద్రిక్తత

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని వెలిశాల గ్రామం ఈరోజు తీవ్ర ఉద్వేగానికి లోనైంది. మావోయిస్టు కీలక నేత గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ గణేష్ మృతి పట్ల గ్రామవాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్థరాత్రి తరువాత గాజర్ల రవికి సంబంధించిన మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈరోజు మధ్యాహ్నం వెలిశాలలో అతని అంత్యక్రియలు జరగనున్నాయి.

గాజర్ల రవి మృతదేహం గ్రామానికి చేరుకోగానే ఆయన అభిమానులు, మావోయిస్టు సానుభూతిపరులు, ప్రజా సంఘాల నేతలు, కవులు, కళాకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గాజర్ల కుటుంబానికి ఇది మరో విషాద క్షణం. ఇప్పటికే ఈ కుటుంబం నుంచి ఆరుగురు ఉద్యమంలో అమరులయ్యారు. గాజర్ల సోదరుడు, మావోయిస్టు మిలిటరీ చీఫ్ గా ఉన్న గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ 2008లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. మరోవైపు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు అనారోగ్య కారణాలతో లొంగిపోయిన సంగతి తెలిసిందే.

ఆపరేషన్ సిందూర్‌పై పాక్ ఉప ప్రధాని సంచలన వ్యాఖ్యలు

ఆపరేషన్ సిందూర్‌పై దాయాది దేశాధినేతలు ఒక్కొక్కరు నోరు విప్పితున్నారు. తాజాగా పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లోని కీలకమైన వైమానిక స్థావరాలను భారతదేశం ధ్వంసం చేసిందని ఇషాక్ దార్ అంగీకరించారు. రావల్సిండిలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్, షోరో‌కోట్ ఎయిర్‌బేస్ రెండు ధ్వంసం అయినట్లుగా ఉప ప్రధాని ఒప్పుకున్నారు. భారత్ జరిపిన దాడులతో భారీ నష్టం జరిగినట్లుగా ఒప్పుకున్నారు. పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు భారీ నష్టం జరిగినట్లు ఒప్పుకున్నారు. భారత్ మెరుపు దాడులు చేసిందని.. దీంతో రెండు ఎయిర్‌బేస్‌లు పూర్తిగా ధ్వంసమైనట్లు చెప్పారు. ఆపరేషన్ సిందూర్ ప్రారంభం కాగానే.. సౌదీ యువరాజు ఫైసల్ బిన్ సల్మాన్ వ్యక్తిగతంగా తనతో మాట్లాడారని.. భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో మాట్లాడాలని యువరాజు సూచించినట్లు చెప్పారు. రెండు దేశాల మధ్య సమస్యలను తగ్గించేందుకు రియాద్‌ ముఖ్యమైన పాత్ర పోషించిందని.. అలాగే అమెరికా సైతం భారత్‌ను నిలువరించే ప్రయత్నం చేసిందని చెప్పుకొచ్చారు. ఇక భారత్ దాడులను పాక్ ప్రధాని షరీఫ్ కూడా అంగీకరించారు.

మావోయిస్టు అగ్రనేత అరుణ అంత్యక్రియలు పూర్తి!

ఏవోబీ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టు అగ్రనేత అరుణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. స్వస్థలం పెందుర్తి మండలం కరకవానీ పాలెంలో బంధు మిత్రులు, ప్రజాసంఘాలు అంతిమ వీడ్కోలు పలికాయి. అంతిమ యాత్రలో ‘కామ్రేడ్ అరుణ అమర్ ర హే’ నినాదాలు హోరెత్తాయి. కగార్ పేరుతో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ప్రజా సంఘాలు ఆరోపించాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మారేడుమిల్లి ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అరుణ మరణించిన విషయం తెలిసిందే.

ఏవోబీ ఈస్ట్ డివిజన్ సెక్రటరీగా పని చేస్తున్న అరుణ 20 ఏళ్లకు పైగా అజ్ఞాతంలో గడిపారు. హరివెంకట చైతన్య అలియాస్ అరుణ కోసం ఏడేళ్లుగా పోలీసులు గాలిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు సివేరి సోమ, సర్వేశ్వరరావు హత్య కేసులు సహా పలు నేరాల్లో ఆమెపై కేసులు నమోదయ్యాయి. వామక్ష భావజాలం కలిగిన అరుణ కుటుంబం మొదటి నుంచి మావోయిస్టు పార్టీకి దగ్గరైంది. అరుణ, ఆమె తమ్ముడు అజాద్ ఇద్దరు ఉద్యమ బాట పట్టారు. పార్టీ కీలక నేత చలపతి భార్య అరుణ. 2016లో పాల సముద్రం దగ్గర జరిగిన ఎదురు కాల్పుల్లో అరుణ తమ్ముడు అజాద్ మరణించాడు.

ఎయిర్ ఇండియాలో ఏం జరుగుతోంది..? భారీగా అంతర్జాతీయ, దేశీయ విమానాలు రద్దు..!

అహ్మదాబాద్ ప్రమాద ఘటన తర్వాత నుండి ఎయిర్ ఇండియా కంపెనీలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిత్యం ఏదో ఒక సమస్యతో అనేక ఫ్లైట్స్ రద్దు అవుతున్నాయి. ఎయిర్ ఇండియా శుక్రవారం (జూన్ 20) భారీగా అంతర్జాతీయ, దేశీయ విమానాలను రద్దు చేసింది. అయితే, ఈ నిర్ణయం విమానాల మెరుగైన మైన్‌టెనెన్స్, తీవ్ర వర్షాలు, వాతావరణం కారణంగా తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది.

భారీగా దెబ్బతిన్న బ్లాక్ బాక్స్! డేటా సేకరించడం కష్టమే! జాతీయ మీడియా కథనాలు

జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదానికి గల కారణాలను రెండు దర్యాప్తు సంస్థలు అన్వేషిస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 279 మంది చనిపోయారు. ఇక ప్రమాదం జరిగిన 28 గంటల తర్వాత ప్రమాద స్థలి నుంచి బ్లాక్ బాక్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ బ్లాక్ బాక్స్ భారీగా ధ్వంసం అయినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. డేటా సేకరణ కోసం వాషింగ్టన్ డీసీకి పంపించాలని భావించారు. కానీ బ్లాక్ బాక్స్ భారీగా ధ్వంసం కావడంతో డేటా సేకరించడం కష్టమేనని దర్యా్ప్తు సంస్థలు భావిస్తున్నట్లు వర్గాల సమాచారం. ఇక బ్లాక్‌బాక్స్‌ను డీకోడ్‌ చేసేందుకు అమెరికాకు పంపించబోతున్నట్లు వస్తున్న వార్తలను కేంద్రం తోసిపుచ్చింది. టెక్నికల్‌, సెక్యూరిటీ అంశాలను పరిశీలించాకే బ్లాక్‌బాక్స్‌ను ఎక్కడికి పంపించాలనే విషయాన్ని ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో నిర్ణయిస్తుందని కేంద్రం స్పష్టత ఇచ్చింది. బ్లాక్ బాక్స్‌ను ఎక్కడి పంపించాలన్న నిర్ణయాన్ని దర్యాప్తు సంస్థలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో ఐదోసారి విచారణకు ప్రభాకర్ రావు

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర బిందువుగా మారిన తెలంగాణ ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారి ప్రభాకర్ రావు ఐదోసారి విచారణకు హాజరయ్యారు. బుధవారం (జూన్ 19) ఆయనను సిట్ అధికారులు సుమారు 9 గంటలపాటు విచారించారు. అయితే ఈ విచారణలో ప్రభాకర్ రావు పలు కీలక ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదని సమాచారం. దీంతో సిట్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో సిట్ సీరియస్‌గా ముందుకెళ్లాలని నిర్ణయించినట్టు తెలిసింది. ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉపశమనాన్ని (ఇంటరిమ్ రిలీఫ్) రద్దు చేయాలంటూ సిట్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. ఈ ఉపశమనానికి ప్రకారం, ఆగస్టు 5 వరకు ప్రభాకర్ రావును అరెస్ట్ చేయరాదని ఉన్న నేపథ్యంలో, దాన్ని తొలగించేందుకు చట్టపరమైన చర్యలు ప్రారంభించబోతోంది.

 

Exit mobile version