NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

చిలకలూరుపేట బస్సు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
పల్నాడు జిల్లాలోని చిలకలూరుపేట సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఆరుగురు మరణించిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని చెప్పుకొచ్చారు. బాధిత కుటుంబాలకు సహాయంగా నిలుస్తామన్నారు.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చిలకలూరిపేట సమీపంలోని పసుమర్రులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఓటు హక్కును వినియోగించుకుని హైదరాబాద్ కి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తిరిగి వెళ్తున్న సమయంలో టిప్పర్ ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది.

ఏపీలో మరోసారి వైసీపీదే అధికారం.. చంద్రబాబు ప్రస్టేషన్ అర్థమైతుంది..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుంది అని మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. ఇది పేదలకు పెత్తందారులకు మద్య జరిగిన యుద్ధం.. ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతున్నారు.. జూన్ నాలుగోవ తేదీన వైసీపీ సునామీ రాబోతుంది.. చంద్రబాబు ప్రస్టేషన్ లోకి వెళ్ళాడు.. పల్నాడు జిల్లాలో వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారు.. సమస్యాత్మక ప్రాంతాల్లో సెక్యూరిటీ పెంచాలని కోరినా కూడా ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదు అని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై చంద్రబాబు ఎన్నికలలో అక్రమాలకు పాల్పడ్డారు.. పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారు.. అధికారంలోకి రాగానే ఎన్నికల్లో అక్రమాలకు వంతపాడిన పోలీసు అధికారులపై విచారణ జరిపిస్తాం అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.

జమ్మలమడుగులో టెన్షన్ టెన్షన్.. కవ్వింపు చర్యలపై ఎస్పీ సీరియస్
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవగుడి ఆది నారాయణ రెడ్డి, కడప పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎర్రగుంట్ల మండలం నీటి చూపి గ్రామంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటి దగ్గర భారీ పోలీస్ బలగాల మొహరించారు. జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలో ఆది నారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి ఇంటి దగ్గర పోలీస్ పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాగా, జమ్మలమడుగులోని వైసీపీ, బీజేపీ, టీడీపీ కార్యాలయాల దగ్గర సైతం పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. దీంతో పాటు జమ్మలమడుగు నియోజకవర్గ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ప్రస్తుతానికి జమ్మలమడుగులో పరిస్థితి ప్రశాంతంగా ఉంది. అయితే, జమ్మలమడుగులో కవ్వింపు చర్యలపై జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సీరియస్ అయ్యారు. ఉదయం 4 గంటల వరకు జమ్మలమడుగులో మఖం వేసిన ఎస్పీ.. పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

రైతులకు అందుబాటులో పత్తి విత్తనాలు… అధికారులను మంత్రి ఆదేశం..
ఖరీఫ్ 2024లో రాష్ట్రంలో దాదాపు 60.53 లక్షలలో ప్రత్తి సాగు కాగలదని వ్యవసాయశాఖ అంచనా వేయగా, దానికి సరిపడా BGII పత్తి విత్తనాలను మే చివరి నాటికి రైతులకు అందుబాటులో ఉంచే ఏర్పాటు చేసుకోవల్సిందిగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. 2021లో 60.53 లక్షలు ఉన్న ప్రత్తి విస్తీర్ణము క్రమముగా తగ్గుతూ 2023లో 45.17 లక్షలకు వచ్చిందనీ, ఐనప్పటికీ ప్రపంచ మార్కెట్లో ప్రత్తికి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఈసారి విస్తీర్ణము పెరిగే అవకాశముందని దానికి తగ్గట్లు BGII విత్తనాలను అందుబాటులో ఉంచాల్సిందిగా ఆదేశించారు. గతేడాది 90 లక్షల ప్యాకెట్లు అమ్ముడుపోగా, ఈసారి 120 లక్షల ప్యాకెట్లను మార్కెట్లో అందుబాటులో ఉంచడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే రెండు దఫాలు సంబంధిత అధికారులు, విత్తన కంపెనీలతో సమావేశం జరిపి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. కేంద్రప్రభుత్వం ఈసారి BGII [ bollguard II] ప్రత్తి విత్తన ప్యాకెట్ గరిష్ట ధరను రూ. 864.00 గా నిర్ణయించిదని, ఏ ఒక్క డీలరైనా, అంతకంటే ఎక్కువధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా విత్తన సరఫరాలో ఇబ్బందులు సృష్టిస్తే ఏ కంపెనీని ఉపేక్షించబోమని, రైతుల ప్రయోజనాలకు భంగం కల్గించే ఏ చర్యను ఈ ప్రభుత్వం సహించబోదని, విధులపట్ల అలసత్వం వహించినా అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ధాన్యం కొనుగోలు చేయాలంటూ రోడ్డెక్కిన రైతన్న…
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతన్నలు కన్నెర్న చేశారు. రెండు నెలలు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు చేసేవారు లేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల ధర్నా చేపట్టారు. కల్లాల్లో ధాన్యం పోసి 2 నెలలు గడుస్తున్నా ఇంతవరకు కొనుగోలు ప్రక్రియ ప్రారంభించలేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే కలెక్టర్ ఆఫీస్ ను ముట్టడిస్తామని రైతుల హెచ్చరించారు. రైతుల ధర్నాతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ నెలకొంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చాలా సమయం గడిచిందని ధాన్యం కొలుగోలుకు ఎవరు ముందుకు రావడం లేదని మండిపడుతున్నారు. ఇలా, అయితే మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలని, రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలకు పంటలు తడిస్తున్నాయని, తడిసిన పంటలను కూడా కొనే దిక్కులేదని మండిపడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తానని చెబుతున్నా అధికారులు ఎవరూ స్పందించడం లేదని వాపోతున్నారు. కల్లాల్లో ధాన్యం రెండు నెలల నుంచి వుందని, పట్టించుకునే నాధుడే కరువయ్యాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు చెప్పిన ఎవరు స్పందించడం లేదని, ప్రభుత్వం నుంచి సమాచారం లేదంటూ తప్పించుకుంటున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు. అప్పులు చేసి పంటలు పండించామని వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పంచాలని కోరుతున్నారు. రైతులపై ప్రభుత్వం ఎలా ఉండబోతుందున్నది ప్రశ్నార్థకంగా మారింది.

జీతాలు చెల్లించండి.. ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల ఆందోళన
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరులోని ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ ఎదుట కార్మికుల ఆందోళన చేపట్టారు. గత ఏడాదిలో పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించాలని కార్మికుల డిమాండ్ చేశారు. రమేష్ బాబు అనే కార్మికుడు బాయిలర్ పై ఉన్న చిమ్ని ఎక్కి జీతాలు చెల్లించాలని తీవ్ర ఆందోళన చేశాడు. జీతాలు లేక కుటుంబ పోషణ భారంగా మారిందని కార్మికుడి ఆవేదన వ్యక్తం చేశారు. జీతం ఇవ్వకపోతే రమేష్ బాబు అనే కార్మికుడు ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. అయితే అక్కడే వున్న కార్మికులందరూ రమేష్ బాబుకు నచ్చబెబుతున్నా ససేమిరా అంటూ కిందకి దిగకుండా రమేష్ జీతాలు ఇవ్వకపోతే చావే శరణ్యమంటు భీష్మించుకుని కూర్చున్నాడు.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి ముందు బీజేపీ కార్యకర్తల ధర్నా
సీఎం నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌తో అనుచితంగా ప్రవర్తించిన కేసు మరింత ఊపందుకుంది. ఈ అంశంపై బీజేపీ నిరసనకు దిగింది. సీఎం కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ బీజేపీ రాష్ట్ర కమిటీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చాంద్‌గి రామ్‌ అఖారా సమీపంలోని సీఎం నివాసానికి వెళ్లే రహదారిపై మహిళా కార్మికులు ధర్నా చేస్తున్నారు. ఈ ప్రదర్శనను బీజేపీ మహిళా మోర్చా నిర్వహిస్తోంది. కేజ్రీవాల్ నివాసం ముందు ఈ ప్రదర్శన జరిగింది. మహిళలు ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దీంతో పాటు సీఎం కేజ్రీవాల్‌ రాజీనామా చేయాలని కూడా మహిళలు డిమాండ్‌ చేశారు. బీజేపీ మహిళా కార్యకర్తల చేతుల్లో అనేక రకాల పోస్టర్లు ఉన్నాయి. ‘కేజ్రీవాల్ రాజీనామా’, ‘మహిళలను ఎవరు అవమానించినా ప్రభుత్వం పనిచేయదు’ వంటి నినాదాలతో పాటు పలు నినాదాలు ఈ పోస్టర్లపై రాశారు.

రాష్ట్రంలో రెండు వారాలు ఆ థియేటర్స్ బంద్..
రాష్ట్రంలో మే 17వ తేదీ నుంచి ఆ థియేటర్స్ మూత పడనున్నాయి.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ను మూసివేయనున్నట్లు తెలంగాణ థియేటర్స్ యజమానులు ప్రకటించారు.ప్రస్తుతం వేసవి మొదలైంది..స్కూల్స్ కి హాలిడేస్ కూడా ఇవ్వడంతో పిల్లలు ,పెద్దలు సినిమాలు చూడటానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తారు.కానీ వేసవి సెలవుల్లో ఎలాంటి పెద్ద సినిమాలు థియేటర్స్ కు రాలేదు.దీనికి కారణం తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల ప్రభావం అని చెప్పొచ్చు.దీంతో కొత్త సినిమాల విడుదల తేదీలను మేకర్స్ వాయిదా వేసుకున్నారు. అంతే కాకుండా ఈ సారి చిన్న సినిమాలు కూడా అంతగా విడుదల కాకపోవడంతో సింగిల్ ధియేటర్లలో సినిమాలు అంతగా పడటం లేదు.పాత సినిమాలను రీ రిలీజ్ చేసుకుంటూ కొన్ని చిన్న సినిమాలను రిలీజ్ చేస్తూ ఎలాగోలా రన్ చేస్తున్నారు.కానీ రిలీజ్ అయిన చిన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ అంతగా లభించటం లేదు. దీనితో ధియేటర్ కరెంట్ ఛార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు కూడా రావడం లేదు..అలాగే మే నెలాఖరు వరకు కొత్త సినిమాలు విడుదల లేకపోవటంతో థియేటర్స్ మూసివేయాలని మేకర్స్ నిర్ణయించారు..ఈ శుక్రవారం నుంచి రెండు వారాల పాటు షోలు వేయొద్దని తెలంగాణ థియేటర్ అసోసియేషన్ నిర్ణయించింది.

నకిలీ వార్తలను రాయడం మానుకోండి.. మీడియాపై మెహ్రీన్ ఫైర్!
తాను ఎగ్ ఫ్రీజింగ్ (అండాల శీతలీకరణ) చేయించుకున్నట్లు టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా ఇటీవల తెలిపారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేస్తూ ‘నా ఎగ్ ఫ్రీజింగ్ జర్నీ’ అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రపంచంలోని చాలా మంది మహిళలకు స్ఫూర్తిగా నిలవాలని, ఎగ్ ఫ్రీజింగ్‌పై అవగాహన కల్పించడానికే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే కొన్ని మీడియా సంస్థలు, వెబ్‌సైట్స్.. మెహ్రీన్‌పై నెగిటివ్ కామెంట్స్ రాసుకొచ్చాయి. పెళ్లి కాకుండానే మెహ్రీన్ తల్లి అయ్యారంటూ పలు కథనాలు రాశాయి. ఈ కథనాలపై ఆమె స్పందించారు. నకిలీ వార్తలను రాయడం మానుకోండని మీడియాపై ఫైర్ అయ్యారు. మెహ్రీన్ పిర్జాదా తన ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘ప్రియమైన మీడియా.. కొంతమంది రిపోర్టర్లు తమ ఉద్యోగాన్ని గౌరవించాల్సిన సమయం ఆసన్నమైంది. సమాజం పట్ల తాము ఎలాంటి బాధ్యతను కలిగి ఉన్నాయో అర్థం చేసుకోవాలి. నకిలీ, తప్పుడు సమాచారంతో వార్తలను విక్రయించడం అనైతికమే కాదు.. చట్టవిరుద్ధం కూడా. ఎగ్ ఫ్రీజింగ్ కోసం ఓ అమ్మాయి గర్భవతి కానవసరం లేదు. నేను చేసిన పోస్ట్.. నా లాంటి వ్యక్తులకు అవగాహన కల్పించడం కోసమే. సామాజిక అవగాహన కోసం నా వ్యక్తిగత విషయాన్ని పంచుకోవడానికి నేను చాలా ధైర్యం చేశాను’ అని మెహ్రీన్ పేర్కొన్నారు.

ఈ సీజన్‌లో మాకు అతిపెద్ద సమస్య అదే: కేఎల్ రాహుల్
పవర్‌ ప్లేలో కీలక వికెట్లను చేజార్చుకోవడమే ఈ సీజన్‌లో తమను దెబ్బ కొట్టిందని లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు. మంచి ఆరంభాలు ఇవ్వలేకపోవడమే పాయింట్ల పట్టికలో వెనకపడ్డానికి కారణం అని చెప్పాడు. చివరి మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంటాం అని రాహుల్ ధీమా వ్యక్తం చేశాడు. మంగళవారం ఢిల్లీ చేతిలో లక్నో ఓడిపోయింది. ఈ ఓటమితో ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మ్యాచ్ అనంతరం లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ… ’40 ఓవర్ల పాటు పిచ్‌లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీ ఓపెనర్ జేక్ ఫ్రేజర్‌ను త్వరగానే ఔట్ చేశాం. దాంతో పట్టు సాధించేందుకు ప్రయత్నించాం. కానీ షై హోప్‌, అభిషేక్ పోరెల్ దూకుడుగా ఆడి భారీ స్కోరు చేశారు. ఇక్కడ 200లకు పైగా లక్ష్యాన్ని ఛేదించవచ్చని మేం భావించాం. అయితే పవర్‌ ప్లేలో కీలక వికెట్లను చేజార్చుకోవడం దెబ్బ కొట్టింది. ఈ సీజన్‌లోనే మాకు అతిపెద్ద సమస్యగా మారింది. మార్కస్ స్టాయినిస్, నికోలస్ పూరన్‌లా చెలరేగి మంచి ఆరంభం ఇవ్వలేకపోతున్నాం. ఇదే మేం పాయింట్ల పట్టికలో వెనక బడడానికి కారణం. చివరి మ్యాచ్‌లోనూ గెలిచి ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంటాం’ అని అన్నాడు.