NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

యూపీలో వైద్యుడి నిర్లక్ష్యం.. ఆపరేషన్‌ చేసి కడుపులో దూది మర్చిపోయిన డాక్టర్

వైద్యులు శస్త్రచికిత్స చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది. కొంత మంది వైద్యులు ఆపరేషన్ చేసేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండి కడుపులో శస్త్రచికిత్స సమయంలో ఉపయోగించే పలు వస్తువులు మర్చిపోతుంటారు. తాజాగా యూపీలో ఇలాంటి ఉదాంతం వెలుగులోకి వచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ఓ వైద్యుడు చేసిన నిర్వాకం రోగి ప్రాణాల మీదకు తెచ్చింది. పిత్తాశయంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి లోహియానగర్‌లోని స్థానిక నర్సింగ్‌ హోంలో చేరారు. అతడికి నెల క్రితం వైద్యుడు ఆపరేషన్‌ కూడా చేశారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యి ఇంటికి వెళ్లినా.. ఎంతకీ ఆరోగ్యం కుదుటపడకపోగా మరింత క్షీణించడంతో అతడి కుటుంబం మరో ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించింది.

నేడు రౌస్ అవెన్యూ కోర్టులో కవిత ఛార్జిషీట్ పై విచారణ

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టై జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మంగళవారం రౌస్‌ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. మనీలాండరింగ్‌ కేసులో అరెస్టై ఇప్పటికే ఆమె తిహార్‌ జైల్లో ఉంటున్న విషయం విదితమే. కాగా, ఆమె జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగించాలా లేదా అనే అంశంపై మంగళవారం రౌజ్‌ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. ఢిల్లీ మద్యం పాలసీలో కవిత పాత్రను ప్రస్తావిస్తూ ఇటీవల ఈడీ చార్జిషీట్‌ దాఖలు చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకోవాలని ఈడీ తరఫు న్యాయవాది కోర్టును కోరే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఈడీ కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24న విచారణ చేపట్టనుంది.

ఆకాశ దొంగ.. తొలుత రైళ్లలో ఇప్పుడు విమానాల్లో..

దోపిడీకి సంబంధించిన ఒక వినూత్న విధానంలో, ఒక వ్యక్తి గత సంవత్సరం 200 విమానాలు ఎక్కాడు, దాదాపు 100 రోజుల పాటు దేశంలో వేల కిలోమీటర్లు ప్రయాణించి కేవలం విమానాల్లో దోపిడీలను అమలు చేశాడు. 2023లో పలువురు ప్రయాణికుల నుంచి విలువైన వస్తువులను దొంగిలించినట్లు సమాచారం. గత నెలలో హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఓ మహిళ తన హ్యాండ్‌బ్యాగ్‌లోని రూ.7 లక్షల విలువైన నగలు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు కేసును ఛేదించారు.

దశ్వమేధ ఘాట్‌లో గంగామాతకు ప్రధాని పూజలు.. బీహార్ సీఎం గైర్హాజరు

వారణాసి నుంచి లోక్‌సభ ఎన్నికలకు ప్రధాని మోడీ నేడు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ప్రధాని కాశీ నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. నామినేషన్ వేయడానికి ఒకరోజు ముందు ప్రధాని మోదీ వారణాసిలో భారీ రోడ్ షో కూడా నిర్వహించారు. ఈ స్థానానికి జూన్ 1న ఓటింగ్ జరగనుంది. 2024 లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఆయనతో పాటు భారతీయ జనతా పార్టీ, ఎన్‌డీఏ కూటమికి చెందిన పలువురు నేతలు హాజరుకానున్నారు.

పల్నాడు జిల్లాలో టెన్షన్.. టీడీపీ- వైసీపీ నేతల మధ్య మరోసారి వివాదం..!

పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత కొనసాగుతుంది. అచ్చంపేట మండలం వేల్పూర్ లో మరోసారి వివాదం చెలరేగుతుంది. నిన్న ( సోమవారం ) పోలింగ్ బూత్ దగ్గర గ్రామంలోని రెండు వర్గాల వారికి గొడవ జరిగింది. ఎన్నికల నేపథ్యంలో ఇరు వర్గాలను పోలీసులు శాంతింపజేశారు. అయితే, నేడు మరోసారి ఇరు వర్గాల వారు కవ్వింపు చర్యలకు దిగారు. ఓ వర్గం వారు ఉంటున్న ఏరియాకు బైక్ ర్యాలీతో వెళ్ళిన మరో వర్గం.. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగే పరిస్థితి ఉందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. అయితే, టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఘర్షణలు జరగడంతో ఈసీ తీవ్ర స్థాయిలో మండిపడింది.

ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు

హర్యానా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సిర్సా బస్టాండ్‌ నుంచి గురుగ్రామ్‌కు బయల్దేరిన రోడ్డుమార్గం బస్సు ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్‌ చేస్తుండగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 9వ నెంబరు జాతీయ రహదారి పక్కనే బస్సు బోల్తా పడి పొలాల్లో పడిపోవడంతో పాటు ట్రాక్టర్ కూడా పూర్తిగా దెబ్బతింది. బస్సు బోల్తా పడడంతో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఒక్కసారిగా కేకలు వేయడంతో ప్రజలు బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయి. బస్సులో దాదాపు 50 మంది ప్రయాణికులు ఉన్నారు.

వారణాసికి సంబంధించిన ఎమోషనల్‌ వీడియో షేర్‌ చేసిన ప్రధాని మోడీ

ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వారణాసి నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయనున్న విషయం తెలిసిందే. మూడో సారి అక్కడి నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్‌ వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు. అది ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ సందర్భంగా తన సిటింగ్ నియోజకవర్గంతో ఉన్న అనుబంధం విడదీయలేనిదని అభివర్ణించారు. ఈ ప్రాంతంలో తనకు ముడిపడి ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఓ వీడియోను షేర్ చేశారు.

వారణాసిలో నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని.. హాజరైన ప్రముఖులు

వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రధాని మోడీ నేడు నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రధాని కాశీ నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. నామినేషన్ వేయడానికి ఒకరోజు ముందు ప్రధాని మోడీ వారణాసిలో భారీ రోడ్ షో నిర్వహించిన విషయం విదితమే. మంగళవారం నామినేషన్‌ వేసే ముందు వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రార్థనలు చేశారు. అనంతరం వారణాసిలోని కాలభైరవుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నామినేషన్‌ దాఖలు చేసేందుకు కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లారు. అంతకు ముందే అతడి ప్రతిపాదకులు, ఎన్‌డీఏ ముఖ్యనేతలు నామినేషన్ వేదికకు చేరుకున్నారు. నామినేషన్ దాఖలు చేయడానికి ప్రధాని మోడీ వచ్చినప్పుడు, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు ప్రముఖులు ఆయన వెంట ఉన్నారు.