NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

పరుగులు పెడుతున్న పసిడి.. రూ. 490 పెరిగిన తులం గోల్డ్ ధర.. రూ. 2 వేలు పెరిగిన కిలో వెండి ధర

బంగారం ధరలు జెట్ స్పీడ్ తో పరుగెడుతున్నాయి. పెరుగుతున్న ధరలు గోల్డ్ లవర్స్ ను కంగారు పెట్టేస్తున్నాయి. శుభకార్యాల వేళ పుత్తడి ధరలు ఆకాశాన్ని తాకుతుండడంతో కొనుగోలు దారులు వెనకడుగు వేస్తున్నారు. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ ధరలు నేడు మళ్లీ పెరిగాయి. మళ్లీ అదే జోరు చూపిస్తున్నాయి. తులం బంగారంపై ఏకంగా రూ. 490 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ – ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 8,798, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 8,065 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 450 పెరగడంతో రూ. 80,650 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 490 పెరగడంతో రూ. 87,980 వద్దకు చేరింది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,800గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 88,130 వద్ద ట్రేడ్ అవుతోంది.

మూడో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు.. డైరెక్టర్ల నివాసాలపై దాడులు

శ్రీ చైతన్య విద్యా సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు మూడో రోజుకు తనిఖీలు కొనసాగిస్తున్నారు. విద్యా సంస్థల అధినేత బొప్పన సత్యనారాయణ రావు, ఆయన కుటుంబసభ్యుల నివాసాల్లో ఐటీ అధికారుల సోదాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఆయన కుమార్తెలైన బొప్పన సుష్మ, బొప్పన సీమ ఇళ్లలో కూడా ప్రత్యేక దర్యాప్తు జరుగుతోంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 32, రోడ్ నెంబర్ 10లో ఉన్న బొప్పన సుష్మ, బొప్పన సీమ నివాసాల్లో ఐటీ అధికారులు నిన్నటి నుంచి మరింత తీవ్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్రమ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కీలక ఆధారాలను సేకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

పోసాని కృష్ణమురళి బయటకు రావడం డౌటే?

సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి జైలు నుంచి బయటకు రావడంపై సందిగ్ధం నెలకొంది. కోర్ట్ బెయిల్‌ ఇచ్చినా.. బయటకు రావడం డౌటేనన్న అనుమానాలు నెలకొన్నాయి. పోసానిపై గుంటూరు సీఐడీ పోలీసులు పీటీ వారెంట్‌ వేశారు. ఆయన కోసం గుంటూరు సీఐడీ పోలీసులు కర్నూలు జిల్లా జైలుకు వెళ్లారు. పీటీ వారెంట్‌పై పోసానిని కోర్టు గుంటూరు కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. జైలు నుంచే వర్చువల్‌గా జడ్జి ఎదుట పోసానిని ప్రవేశపెట్టనున్నారు. పోసాని కృష్ణమురళిపై నమోదైన కేసుల్లో ఇప్పటికే బెయిల్‌ లభించింది. ఇప్పటికే పోసానికి ఆదోని కేసులో కర్నూలు కోర్టు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేసింది. పోసాని విడుదల అవుతారని భావించిన సమయంలో పీటీ వారెంట్‌తో గుంటూరు సీఐడీ పోలీసులు వచ్చారు. దీంతో పోసాని విడుదలపై సందిగ్ధత కొనసాగుతోంది. పోసానిని కర్నూలు నుంచి గుంటూరుకు తరలించే అవకాశం ఉందంటున్నారు. పోసానిని వారం రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పల్నాడు జిల్లా నరసరావుపేట 2 టౌన్‌ పోలీసులు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు కోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది.

ఏడాది గడిచింది.. మరో 3, 4 ఏళ్లే ఇగ!

కన్నుమూసి తెరిచే లోపు ఏడాది గడిచిందని.. మరో మూడు, నాలుగేళ్లు గడిస్తే అధికారంలోకి వచ్చేది వైసీపీనే అని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ప్రజల కష్టాల నుంచి పుట్టిన పార్టీ వైసీపీ అని.. వైసీపీ ఆవిర్భవించి 15 ఏళ్లు అవుతుందన్నారు. వైసీపీ ఏదైనా చెప్పిందంటే.. తప్పకుండా చేస్తుందన్న నమ్మకం జనాల్లో ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవస్థలు మొత్తం నిర్వీర్యం అయ్యాయని మండిపడ్డారు. వైసీపీ ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుందని, ప్రజల గొంతుకగా పోరాడుతుంది అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండాను అధినేత వైఎస్ జగన్ ఆవిష్కరించారు.

నవ్వుకుంటున్నారు.. దేని మీద పోరాడుతున్నారో కనీసం క్లారిటీ ఉండాలి!

‘ఫీజు పోరు’ అని ముందుగా పేరు పెట్టి.. ఆ తర్వాత ‘యువత పోరు’ అని పేరు మార్చటంపై జనాలు నవ్వుకుంటున్నారని మంత్రి నారా లోకేష్ వైసీపీపై సెటైర్లు వేశారు. అసలు వైసీపీ వాళ్లకు దేని మీద పోరాడుతున్నారో కనీసం క్లారిటీ ఉండాలి కదా? అని ఎద్దేవా చేశారు. స్వల్పకాలిక ప్రశ్నోత్తరాల సమయంలో అన్ని విషయాలు మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై మాట్లాడేందుకు తాము సిద్ధం అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

ఏపీ శాసనమండలి సమావేశాలు ఈరోజు మొదలయ్యాయి. నిరుద్యోగ భృతి విడుదల, యువతకు ఉద్యోగాల కల్పన, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల అంశంపై చర్చించాలని వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం చేశారు. వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు. వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్వల్పకాలిక ప్రశ్నోత్తరాల సమయంలో అన్ని విషయాలు మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై మాట్లాడేందుకు సిద్ధం అని మంత్రి నారా లోకేష్ చెప్పారు.

చేనేత కార్మికులకు గుడ్‌ న్యూస్‌..

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఘనమైన సంస్కృతికి నిలయమని, అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజల కోసం గద్దర్, అంజయ్య వంటి మహానుభావులు అంకితభావంతో కృషి చేశారని గుర్తు చేశారు. “జననీ జయకేతనం” ను రాష్ట్ర గీతంగా స్వీకరించిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వం సామాజిక న్యాయం, అభివృద్ధి లక్ష్యంగా పాలన సాగిస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించామని తెలిపారు. ఈ బడ్జెట్ పూర్తిగా తెలంగాణ ప్రజల కలల సాకారానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకుని ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని గవర్నర్ తన ప్రసంగంలో స్పష్టం చేశారు.

గవర్నర్‌ ప్రసంగంలో అన్నీ అబద్ధాలే.. 20 శాతం కమీషన్‌ తప్ప.. విజన్‌ లేని ప్రభుత్వం ఇది

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో భాగంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అయితే, గవర్నర్‌ ప్రసంగం తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, గవర్నర్ ప్రసంగం పూర్తిగా ప్రాథమికంగా రాసిన ఒక ప్రెస్‌నోట్‌లా అనిపించిందని వ్యాఖ్యానించారు. ఆయన గవర్నర్ ప్రసంగాన్ని గాంధీభవన్ ప్రెస్‌మీట్ లా ఉందని ఎద్దేవా చేశారు. గత 15 నెలల కాలంలో ప్రభుత్వ పాలన పూర్తిగా విఫలమైందని, అసెంబ్లీ సమావేశాల్లో సుతారంగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

తెలంగాణ ఇంటర్ పరీక్షల్లో తప్పుల పరంపర.. విద్యార్థుల్లో ఆందోళన

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు కొనసాగుతుండగా, ప్రశ్నపత్రాల్లో తప్పుల పరంపర విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రతిరోజూ ఏదో ఒక ప్రశ్నపత్రంలో తప్పులు ఉండటంతో, విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పటికే ఇంగ్లీష్, బోటనీ, మ్యాథ్స్ వంటి ముఖ్యమైన పేపర్లలో ప్రశ్నలలో తప్పులు బయటపడటంతో, ఇంటర్ బోర్డు చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది.

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజునే ఇంగ్లీష్‌ ప్రశ్నపత్రంలో ఒక ప్రశ్నలో తప్పు ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఈ సమస్య ఇక్కడితో ఆగకుండా మరిన్ని సబ్జెక్టులకు విస్తరించింది. ఇవాళ బోటనీ పేపర్‌లో 5వ, 7వ ప్రశ్నల్లో తప్పులు బయటపడ్డాయి. మ్యాథ్స్ పేపర్‌లో 4వ ప్రశ్నలో పొరపాటు ఉంది. నిన్న జరిగిన పరీక్షల్లో కూడా మూడు పేపర్లలో తప్పులుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించాలనే లక్ష్యంతో కష్టపడి చదివినప్పటికీ, ప్రశ్నపత్రాల్లో తప్పుల కారణంగా తాము అనుకున్న విధంగా సమాధానాలు ఇవ్వలేకపోతున్నామని చెబుతున్నారు.

చిత్తూరు కాల్పుల ఘటన.. దోపిడీకి పన్నాగం పన్నిన ప్రముఖ వ్యాపారి!

చిత్తూరులో కాల్పుల ఘటనలో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. అప్పుల పాలైన ఓ ప్రముఖ వ్యాపారి.. మరో ప్రముఖ వ్యాపారి ఇంట్లో దోపిడీకి పన్నాగం పన్నాడు. దొంగతనం చేయడానికి స్థానికంగా చిత్తూరులో ఉంటున్న ఏడుగురుతో ఒప్పందం కుదుర్చుకుని.. ప్లాన్ అమలు చేశాడు. డమ్మీ గన్నుతో బెదిరించి.. డబ్బు దోచుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. చివరకు ప్లాన్ బెడసికొట్టి కటకటాల పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

చిత్తూరులో ఎస్‌ఎల్‌వీ ఫర్నిచర్ షోరూం యజమాని సుబ్రహ్మణ్యం అప్పుల పాలయ్యాడు. తనకు తెలిసిన వ్యక్తి, పుష్ప కిడ్స్‌ వరల్డ్‌ యజమాని చంద్రశేఖర్‌ ఇంటిలో దొంగతనానికి ప్లాన్ వేశాడు. దొంగతనం చేయడానికి స్థానికంగా చిత్తూరులో ఉంటున్న ఏడుగురుతో సుబ్రహ్మణ్యం ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈరోజు ఉదయం చంద్రశేఖర్ ఇంటికి వెళ్లిన సుబ్రహ్మణ్యం.. డమ్మీ గన్నుతో బెదిరించాడు. తెలిసిన వ్యక్తి కావడంతో చంద్రశేఖర్ వారిని నెట్టివేసి ఇంటిలో నుంచి బయటకు వచ్చి తాళం వేశాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

వర్రా రవీందర్‌ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌!

వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి వర్రా రవీందర్‌ రెడ్డికి జగ్గయ్యపేట కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. మెడ నొప్పి, నడుముల నెప్పి వల్లన కడప సెంట్రల్ జైలుకు పంపించాలని వర్రా కోరారు. అయితే జగ్గయ్యపేట సబ్ జైల్లో అవసరమైన ఏర్పాట్లు, చికిత్స అందించాలని పోలీసులకు మెజిస్ట్రేట్ తెలిపింది. మెజిస్ట్రేట్ ఆదేశాలకే జగ్గయ్యపేట సబ్ జైల్ అధికారులు ఓకే చెప్పారు. అనంతరం జగ్గయ్యపేట సబ్‌ జైలుకు వర్రా రవీందర్‌ రెడ్డిని తరలించారు. కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌ ఖైదీగా ఉన్న వర్రాని.. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట పోలీసులు పీటీ వారెంట్‌పై మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.