NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్ న్యూస్

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

ఏపీ రాజధానిగా అమరావతే.. ఆర్థిక రాజధానిగా విశాఖ..!
అమరావతి మన రాష్ట్ర రాజధాని, విశాఖను ఆర్ధిక రాజధానిగా అభివృద్ధి చేద్దాం అని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రజా వేదికలా విధ్వంస రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మక రాజకీయాలు చేయాలి.. విశాఖ అభివృద్ధి మాత్రం మేం మర్చిపోం.. విశాఖ న్యాయ రాజధాని అంటూ చేసిన మోసాన్ని ప్రజలు గ్రహించారు.. కర్నూలు అభివృద్ధికి మనం కట్టుబడి ఉన్నాం.. సీఎం కూడా మామూలు మనిషే.. సీఎం వస్తున్నాడు అంటే ఇక పరదాలు కట్టటం, దుకాణాలు బంద్ చేయటం, ట్రాఫిక్ నిలిపి వేయటం, చెట్లు నరకటం లాంటివి ఇకపై ఉండదు అని ఆయన చెప్పుకొచ్చారు. నా కాన్వాయ్ ఒక నిమిషం ఆలస్యమైనా పర్లేదు కానీ ట్రాఫిక్ నిబంధనలు పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు అని చంద్రబాబు వెల్లడించారు. ఎన్డీయే శాసన సభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు చంద్రబాబు నాయుడు.. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారు.. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అత్యున్నత ఆశయాల కోసం 3 పార్టీలు ఏకమయ్యాయని ఆయన తెలిపారు. ప్రజలు గెలిచారు, ఇక రాష్ట్రం నిలబెట్టాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉంది.. 3 పార్టీలు నూటికి నూరు శాతం పరస్పరం సహకరించుకోవటం వల్లే ఈ విజయం సాధ్యమైంది.. 93 శాతం గెలుపు సాధించటం దేశ చరిత్రలో అరుదైన ఘట్టం.. 57 శాతం ప్రజలు మనకు ఓట్లు వేసినందున మరింత బాధ్యతగా వ్యవహరించాలి అని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు అనుభవం, నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరం..
ఎన్డీయే కూటమికి శాసన సభాపక్ష నేతగా ఎన్నికైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.. కూటమి అద్భుత విజయం సాధించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన విజయం అని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని 2021లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం, తగ్గాము, నిలబడ్డామన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నప్పుడు సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు కావాలి.. చంద్రబాబు అనుభవం, నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరం.. ఎన్డీయే కూటమి శాసనసభ పక్షానేతగా చంద్రబాబు పేరు ప్రతిపాదించి బలపరిచినట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. సమిష్టిగా పోరాటం చేసి అద్భుతమైన మెజార్టీతో ఈరోజు ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎన్డీయే కూటమి విజయం దేశవ్యాప్తంగా అందరికి స్పూర్తిని ఇచ్చిందన్నారు. ఏపీ ప్రజలు మనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజల నమ్మకాన్ని పెంచాం.. అందుకే, కక్ష సాధింపులకు ఇది సమయం కాదు.. అలాగే, చంద్రబాబు నాలుగు దశాబ్దాల అనుభవం కలిగిన నాయకుడు అంటూ పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

భోగాపురం ఎయిర్పోర్టును జెట్ స్పీడ్లో పూర్తి చేస్తా..
పౌర విమానయాన శాఖ నాకు ఏరి కోరి ప్రధాని మోడీ అప్పగించారు అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో భారత దేశ కీర్తి ప్రతిష్టలను పెంపొందించడంలో ఈ శాఖ పాత్ర చాలా ఉంది.. యువకుడివి, విదేశాలు తిరిగావు, ఇంజనీరింగ్ విద్యాభ్యాసం ఉంది.. కాబట్టి ఈ శాఖను నీకు ఇస్తున్నాను అంటూ ప్రధాని చెప్పారు.. ఈ శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్లో విమానయాన మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, కొత్త అవకాశాలను వెతకడం సాధ్యపడుతుంది అని ఆయన చెప్పారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రికార్డు సమయంలో పూర్తి చేస్తాం.. విమానయాన శాఖలో ఉన్న ఉద్యోగ అవకాశాలపై దృష్టి సారిస్తాం.. విమానయాన శాఖ మంత్రిగా పని చేసిన జ్యోతిరాధిత్య సింధియాను కలిసి ఆయన అనుభవాలను తెలుసుకుంటాను.. మంత్రిని బట్టి శాఖ పని తీరు ఉంటుందని అనేక మంది చెబుతున్నారు.. అందుకు తగ్గట్టే పౌర విమానయాన శాఖను డ్రైవ్ చేస్తాను అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

సర్కారు ఆఫీసుల్లో బయోమెట్రిక్..? సెక్రటేరియట్ నుంచే శ్రీకారం..!
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరును అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ముందుగా సచివాలయం నుంచే దీక్షకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. సచివాలయంలోకి వెళ్లేటప్పుడు, బయటకు వెళ్లేటప్పుడు సీఎం, మంత్రులు, సీఎస్, కార్యదర్శుల నుంచి కింది స్థాయి అటెండర్ల నుంచి పంచ్ తీయడం తప్పనిసరి చేయాలనే ఆలోచనలో ఉన్నారని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఉద్యోగుల్లో క్రమశిక్షణ, జవాబుదారీతనం పెంచేందుకు బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేయాలని సీఎం యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చిన విమర్శలను సీఎం సీరియస్‌గా తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ముందుగా సచివాలయంలో బయోమెట్రిక్ హాజరు అమలు చేయాలని సీఎస్ శాంతికుమారికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రతి ఒక్కరికీ బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి చేయాలని యోచిస్తున్నామన్నారు. ఫలితంగా మంత్రులు, ఐఏఎస్‌లు, సచివాలయ ఉద్యోగులకు కూడా పంచ్‌లు వేయాల్సి ఉంటుందని సీఎం తన సన్నిహితులతో అన్నట్లు సమాచారం. సీఎం, సీఎస్‌, మంత్రులందరూ బయోమెట్రిక్‌ హాజరును పాటిస్తున్నందున కిందిస్థాయి ఉద్యోగుల విమర్శలకు ఆస్కారం ఉండదని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేయాలని సీఎం కోరుతున్న సంగతి తెలిసిందే. కార్యాలయానికి వచ్చినప్పుడు, ఇంటికి వెళ్లేటప్పుడు కూడా పంచ్‌లు వేస్తే ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజల్లో ఉన్న ప్రతికూల అభిప్రాయం తొలగిపోతుందని సీఎం అభిప్రాయపడినట్లు సమాచారం.

ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్.. నిందితుడి అరెస్ట్
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఫోన్ కాల్స్ తో బెదిరిస్తున్న వ్యక్తిని ఎట్టకేలకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసారు. రాజాసింగ్ ను కాల్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి మహమ్మద్ వసీంగా గుర్తించారు. మహమ్మద్ వసీం గత పదేళ్లుగా దుబాయిలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. ఈరోజు ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వస్తున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సమాచారం రావడంతో కాపుకాచి మహమ్మద్ వసీంను అదుపులో తీసుకున్నారు. అతనిపై లుక్ ఔట్ నోటీసు ఉండడంతో హైదరాబాద్ తిరిగి వచ్చిన వసీంను పోలీసులు ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. వసీం హైదరాబాద్ పాతబస్తీ బార్కస్ కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇతరు రాజా సింగ్ కు ఫోన్ కాల్స్ ద్వారా బెదిరిస్తున్నట్లు గుర్తించారు. అయితే ఇతనితో ఎవరైనా కాల్ చేయించారా? లేక రాజాసింగ్ పై ద్వేషంతో ఇలా చేశాడా? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

గాంధీ కుటుంబం కొత్త ‘ప్రయోగం’.. నేడు రాయ్‌బరేలీపై రాహుల్‌ తుది నిర్ణయం
ఉత్తరప్రదేశ్‌లో గాంధీ కుటుంబానికి కంచుకోటగా భావించే రాయ్‌బరేలీలో తన పట్టును కొనసాగిస్తూనే, అమేథీ స్థానాన్ని బీజేపీ నుంచి కాంగ్రెస్ కైవసం చేసుకుంది. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కిషోరి లాల్ శర్మ అమేథీ నుంచి గెలుపొందగా, రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్‌తో పాటు రాయ్‌బరేలీ స్థానం నుంచి ఎన్నికయ్యారు. రాయ్‌బరేలీలో వాయనాడ్‌ నుంచి రాహుల్‌ గాంధీ భారీ విజయం సాధించారు. రాహుల్ గాంధీ మంగళవారం తన తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీతో కలిసి రాయ్‌బరేలీకి చేరుకుని అక్కడ ఓటర్లు, కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పనున్నారు. గాంధీ కుటుంబం సమక్షంలో రాయ్ బరేలీ సీటు విషయంలో నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్‌లో 15 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. 2014లో రెండు సీట్లు, 2019లో ఒక సీటుకు దిగజారిన కాంగ్రెస్ ఈసారి ఆరు లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించింది. అమేథీ స్థానంలో బీజేపీకి చెందిన స్మృతి ఇరానీని ఓడించి కాంగ్రెస్ స్కోరును సరిదిద్దుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో తొలిసారిగా కాంగ్రెస్‌, గాంధీ కుటుంబం ఈ ప్రాంత ఓటర్లకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపే రాజకీయ ప్రయోగం చేస్తుంది. గాంధీ కుటుంబానికి దశాబ్దాలుగా అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలతో అనుబంధం ఉంది. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన వారం తర్వాత తొలిసారిగా కృతజ్ఞతా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ గాంధీ ఎంపీగా కొనసాగేందుకు ఇది సంకేతంగా కూడా భావిస్తున్నారు.

గెలిచే మ్యాచ్‌లో ఓటమి.. టీ20 ప్రపంచకప్‌ 2024లో వివాదం!
టీ20 ప్రపంచకప్‌ 2024లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఓ డీఆర్‌ఎస్‌ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ‘డెడ్ బాల్ రూల్’ కారణంగా బంగ్లా ఓ బౌండరీని కోల్పోగా.. ఆ నాలుగు పరుగుల తేడాతోనే దక్షిణాఫ్రికాకు విజయం దక్కింది. దాంతో డెడ్ బాల్ రూల్ దక్షిణాఫ్రికాకు వరంగా మారగా.. బంగ్లాకు శాపంగా మారింది. ఇంతకీ అసలేం జరిగిందంటే… ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 113 పరుగులే చేసింది. అనంతరం ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌.. ఒక దశలో చేదించేలా కనిపించింది. చివరి నాలుగు ఓవర్లలో బంగ్లాకు 27 పరుగులు అవసరమయ్యాయి. 17వ ఓవర్‌లో ప్రొటీస్ పేసర్ బార్ట్‌మన్‌ వేసిన రెండో బంతి బంగ్లా ఆటగాడు మహ్మదుల్లా ప్యాడ్లను తాకి.. స్టంప్స్‌ వెనుక నుంచి బౌండరీ వెళ్లింది. వెంటనే దక్షిణాఫ్రికా జట్టు ఎల్బీకి అప్పీల్‌ చేయగా.. ఫీల్డ్ అంపైర్‌ ఔట్‌ ఇచ్చాడు. మహ్మదుల్లా ఎల్బీపై బంగ్లాదేశ్ డీఆర్‌ఎస్‌ కోరింది. రిప్లైలో మహ్మదుల్లా నాటౌట్‌ అని తేలింది. అంపైర్‌ తన నిర్ణయాన్ని మార్చుకున్నప్పటికీ.. అప్పటికే ఆ బంతిని డెడ్‌బాల్‌గా పరిగణించడడింది. ఐసీసీ నిబంధనల ప్రకారం.. బంగ్లా స్కోరుకు ఆ బౌండరీ జత కాకుండా పోయింది. సరిగ్గా ఇదే నాలుగు పరుగుల తేడాతో బంగ్లా ఓడిపోవడంతో.. ఇప్పుడు ఈ డీఆర్‌ఎస్‌ నిర్ణయం నెట్టింట చర్చనీయాంశమైంది. తర్వాతి ఓవర్లో (రబాడ బౌలింగ్‌‌లో) తౌహిద్, మహ్మదుల్లా ఔటవ్వడం బంగ్లా కొంపముంచింది. మొత్తంగా బంగ్లా దురుదృష్టవశాత్తు మ్యాచ్‌ను కోల్పోయింది.

హత్య కేసు.. ప్రముఖ కన్నడ నటుడు అరెస్ట్!
ఓ యువకుడి హత్య కేసులో ప్రముఖ కన్నడ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్‌ తూగుదీపను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం మైసూరులో దర్శన్‌తో పాటు మరో పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసులో విచారణ నిమిత్తం వారిని బెంగళూరుకు తరలించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చిత్రదుర్గలోని లక్ష్మీ వెంకటేశ్వర బరంగయ్‌లో నివాసం ఉంటున్న రేణుకా స్వామి జూన్ 1న ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. జూన్‌ 8న ఆ యువకుడు హత్యకు గురయ్యాడు. జూన్ 9వ కామాక్షిపాళ్యం సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్ పక్కన ఉన్న కాలువలో మృతదేహం కనిపించింది. కుక్కలు శవాన్ని పీక్కుతింటుండగా.. అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ గార్డు పోలీసులకు సమాచారం అందించాడు. మృతుడు రేణుకా స్వామిగ పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నటుడు దర్శన్‌పై ఆరోపణలు వచ్చాయి. విచారణలో భాగంగా ఇద్దరు నిందితులు దర్శన్‌ పేరు వెల్లడించారు. దాంతో మంగళవారం ఉదయం మైసూర్‌లోని ఒక ప్రైవేట్ హోటల్‌లో దర్శన్‌ను అదుపులోకి తీసుకుని బెంగళూరుకు తీసుకువచ్చారు. చిత్రదుర్గ దర్శన్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడుగా రేణుకా స్వామి ఉన్నాడు. దర్శన్ భార్యకు రేణుకా స్వామి అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది.

మగువలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు!
మగువలకు షాకింగ్ న్యూస్. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ధరలు.. నేడు భారీగా పెరిగాయి. మంగళవారం (జూన్ 11) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.150 పెరగ్గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.170 పెరిగింది. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.65,850 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.71,840గా ఉంది. ఈరోజు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,000గా ఉండగా… 24 క్యారెట్ల ధర రూ.71,990గా కొనసాగుతోంది. ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.65,850 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.71,840గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.66,450గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,490గా ఉంది. బెంగళూరు, కేరళ, పూణే, కోల్‌కతా నగరాల్లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 65,850 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.71,840 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,850గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.71,840గా ఉంది.