NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @1pm

Top Headlines @1pm

హర్యానాలో స్కూల్ బస్సు బోల్తా.. 40 మంది పిల్లలకు గాయాలు

హర్యానాలోని పంచకులలో స్కూల్ బస్సు బోల్తా పడటంతో పెను ప్రమాదం జరిగింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. హైస్పీడ్ స్కూల్ బస్సు రోడ్డుపై బోల్తా పడింది. అందులో సుమారు 40 మంది పిల్లలు ప్రయాణిస్తున్నారు. వీరిలో చాలా మంది చిన్నారులకు గాయాలయ్యాయి. పంచకులలోని పింజోర్ సమీపంలోని నౌలత గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. విచారణ అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హర్యానా రోడ్‌వేస్‌కు చెందిన బస్సు అతి వేగంతో వెళ్లినట్లు తెలిపారు. దీంతో స్కూల్ బస్సు డ్రైవర్ అదుపు తప్పి బస్సు బోల్తా పడింది. దీంతో పాటు రోడ్డు అధ్వానంగా ఉండడం, ఓవర్‌లోడింగ్‌ కూడా ప్రమాదానికి కారణమైంది. క్షతగాత్రులను పింజోర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఒక మహిళను చికిత్స కోసం చండీగఢ్‌కు తరలించారు.

వైఎస్సార్ బ‌తికి ఉంటే ఏపీ ప‌రిస్థితి మ‌రోలా ఉండేది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఇడుపులపాయలో వైఎస్సార్‌ కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. అయితే.. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్‌కు కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ నివాళులు అర్పించారు. రాహుల్ గాంధీ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ప్ర‌త్యేకంగా ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ బ‌తికి ఉంటే ఏపీ ప‌రిస్థితి మ‌రోలా ఉండేద‌న్నారు. ఆయ‌న‌ను కోల్పోవ‌డం రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తీర‌ని లోట‌ని చెప్పారు. వైఎస్ రాజ‌కీయ వార‌స‌త్వాన్ని ష‌ర్మిల కొన‌సాగిస్తార‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. తాను ప్రారంభించిన భార‌త్ జోడో యాత్ర‌కు ఒక ర‌కంగా వైఎస్సార్ పాద‌యాత్ర స్ఫూర్తి అని అన్నారు. ప్రజానీకానికి నిజమైన నాయకుడని పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్, భారతదేశ ప్రజల అభ్యున్నతి, సాధికారత పట్ల ఆయ‌న అంకితభావం, నిబద్ధత చాలా మందికి మార్గదర్శకమ‌న్నారు. వ్యక్తిగతంగా ఆయన నుంచి చాలా నేర్చుకున్నాన‌ని తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజా జీవితానికే ప్రాధాన్య‌త‌నిచ్చిన మ‌హా నాయ‌కుడ‌ని రాహుల్ కొనియాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సంద‌ర్భంగా ఆయ‌న సేవ‌ల‌ను స్మ‌రించుకుంటున్న‌ట్లు తెలిపారు.

ఉపాధ్యాయులు లేక విద్యార్థులు చదుకు ఆటంకం

పార్వతీపుతం మన్యం జిల్లాలో గిరిజన ప్రాంతాలలో ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులు లేక విద్యార్థులు చదుకు ఆటంకం కలుగుతోంది. స్కూళ్లు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్న తరగతులు జరగకా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని పాచిపెంట మండలం గరిసిగుడ్డి పంచాయతీ తాడివలస గిరిజన గ్రామంలో గిరిజన విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి గిరిజన‌ సంఘాలు ఆందోళన చేపట్టారు. జిపిఎస్ స్కూల్ వెంటనే తెరవాలని ఉపాధ్యాయులను వెంటనే నియమించాలని ఆదివాసి గిరిజన సంఘం సిఐటియు నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

ఐటీడీఏ పీవో చొరవ తీసుకొని వెంటనే ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ జరిపాలని కోరుతున్నారు. ఇప్పటికే మండలంలో కుంభీవలస, గుమ్మడిగుడ్డి వలస, మెట్టవలస, పర్తాపురం, అలాగే సాలూరు మక్కువ సీతంపేట భామిని కురుపాం బొమ్మలేశ్వరం ఏరియాల్లో ఉన్న స్కూళ్లలో కూడా ఇదే పరిస్థితి నొలకొందని… వెంటనే అధికారులు చొరవ తీసుకొని తరగతులు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. పాఠశాలలు ప్రారంభించి రెండు నెలలు దాటిన నేటికి స్కూలు తెరవకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

రాహూల్ గాంధీ ప్రధాని కావాలన్నదే వైఎస్ఆర్‌ కోరిక..

రాహూల్ గాంధీ ప్రధాని కావాలి అన్నది వైఎస్ఆర్‌ కోరిక అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు గాంధీ భవన్ కి చేరుకున్నారు. వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వైఎస్ అమలు చేసిన సంక్షేమం.. తెలంగాణ ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. వైఎస్ పేరు వినిపిస్తే.. సంక్షేమం పేరు వినిపిస్తుందన్నారు. వైయస్సార్ ముద్ర ప్రజలకు గుండెల్లో ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చన్నారు. తెలంగాణ ప్రజలకు గ్యారెంటీ ఇచ్చిన స్ఫూర్తి ఆనాటి వైయస్సార్ 2004లో అమలు చేసిన సంక్షేమం అన్నారు. వైఎస్ 2009లో రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారు మాట్లాడిన అంశం నాకు ఇంకా స్పష్టంగా గుర్తుందని తెలిపారు. రాహూల్ గాంధీ ప్రధాని కావాలన్నది వైఎస్ కోరిక అన్నారు. వైఎస్ఆర్ పాదయాత్ర నే రాహూల్ గాంధీ పాదయాత్ర స్ఫూర్తి అన్నారు.

నాన్నా మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత మహానేత వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైంది. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో జయంతి వేడుకలతో పాటు, పలు సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే ఇడుపుల­పాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ భారతి, వైఎస్‌ అవినాష్‌ రెడ్డి నివాళులు అర్పిం­చి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ట్విట్టర్‌ వేదికగా ‘నాన్నా మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైయస్సార్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం.జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్యసాహసాలు మాకు మార్గం. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా… చివరివరకూ మా కృషి.’ అని పోస్ట్‌ చేశారు వైఎస్ జగన్.

ఎన్టీఆర్ జిల్లాలో ఫ్లెక్సీల వార్‌

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో గందరగోళ వాతావరణం నెలకొంది. ఒకే రోజు అటు టీడీపీ, ఇటు వైసీపీ కార్యక్రమాలు ఉండటంతో టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది. పవిత్ర సంగమం వద్ద జల హారతి కార్యక్రమానికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హాజరవనున్న నేపద్యంలో స్వాగతం పలకడానికి రింగ్ సెంటర్ వద్ద ఏర్పాట్లు చేశారు టీడీపీ కార్యకర్తలు. వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సంధర్భంగా మాజీ మంత్రి జోగి రమేష్ నివాళులర్పించేందుకు రింగ్ సెంటర్ లోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఏర్పాట్లు చేశారు వైసీపీ కార్యకర్తలు. ఇంచుమించు ఒకే సమయానికి ఇరుపార్టీల కార్యక్రమాలు జరగనుండడంతో, పోటా పోటీగా ఇరు పార్టీల కార్యకర్తలు హాజరవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వైఎస్సార్ జయంతి వేడుకలకు కొంత సమయం ఆగాల్సిందిగా వైసీపీ కార్యకర్తలకు పోలీసుల సూచించారు. వైసీపీ కార్యకర్తలు వైఎస్సార్ జయంతి వేడుకలు ఏర్పాటు చేసిన ప్రాంతానికి చేరుకుని జై టీడీపీ అంటూ నినాదాలు చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. పరిస్దితి గందరగోళంగా మారనుండడంతో వైసీపీ ఫ్లెక్సీల తొలగించారు.

విధి నిర్వహణలో ప్రాణాలొదిలిన మేజర్ ముస్తఫా తల్లిదండ్రులకు రాష్ట్రపతి సన్మానం

‘సైనికులు చనిపోరు, ప్రజల హృదయాల్లో సజీవంగా ఉంటారు’…అని ఓ అమరవీరుడి తల్లి ఫాతిమా బోహ్రా చెప్పింది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఆమె కొడుకు మేజర్ ముస్తఫా బోహ్రా. దేశం కోసం చేసిన త్యాగానికి మరణానంతరం శౌర్య చక్ర అవార్డు పొందిన మేజర్ ముస్తఫా బోహ్రా స్థానంలో అతని తల్లి ఫాతిమా, తండ్రి ఈ సన్మానాన్ని స్వీకరించారు. జూలై 6 శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన డిఫెన్స్ ఇన్వెస్టిచర్ వేడుకలో విధి నిర్వహణలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఆర్మీ, పారామిలిటరీ దళాల సిబ్బందిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సత్కరించారు. ఈ సమయంలో మేజర్ ముస్తఫా బోహ్రాకు కూడా శౌర్య చక్ర లభించింది. ఈ సమయంలో అతని తల్లి, కుటుంబ సభ్యులు చాలా ఎమోషనల్‌గా కనిపించారు.

ముంబైలో భారీ వర్షాలు.. స్కూల్స్, కాలేజీలకు సెలవులు..!

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ (సోమవారం) తెల్లవారు జామున ఒంటి గంట నుంచి ఉదయం 7 గంటల వరకు ఎడతెరపిలేకుండ వాన పడుతుంది. ముంబైలోని పలు ప్రాంతాల్లో 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. ముంబై, థానే, పాల్ఘర్, కొంకణ్ బెల్ట్ లకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముంబైలోని పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. భారీ వర్షాల కారణంగా ముంబైలోని విద్యా సంస్థలకు అధికారులు హాలీడేస్ ప్రకటించారు. థానేలో నీట మునిగి రిసార్ట్ నుంచి 49 మందిని సురక్షితంగా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ రక్షించాయి. పాల్ఘర్ లో వరదలో చిక్కుకున్న 26 మందిని గ్రామస్థులు సేవ్ చేశారు.