Site icon NTV Telugu

Top Headlines @1PM : టాప్ న్యూస్

Top Headlines @1pm

Top Headlines @1pm

నేడు ఎగ్జిట్‌ పోల్స్‌.. 19 రోజులుగా అభ్యర్థుల్లో టెన్షన్‌

పార్లమెంటు ఎన్నికల అభ్యర్థులకు, ఆయా రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్రచారం సుదీర్ఘ కాలం అయితే.. ఫలితాల కోసం 19 రోజుల పాటు ఎదురుచూడడం మరో ఆందోళన. ఈవీఎంలలో తీర్పు నమోదవడంతో ప్రజలు ఎటువైపు ఓటేశారోనని అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ టెన్షన్ నుంచి కొంత మందికి నేడు కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. చివరి రౌండ్ పోలింగ్ ముగిసే వరకు ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించకూడదని కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన విధించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మే 13తో రాష్ట్రంలో పోలింగ్ ముగిసినా.. సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించడం లేదు. రాజకీయ పార్టీలు, సర్వే సంస్థలు ఇవాల్టి (జూన్ 1) కోసం ఎదురు చూస్తున్నాయి.

రాష్ట్రానికి రెండు లక్షల కొర్రమీనులు.. ఎందుకంటే..

హైదరాబాద్‌కు చెందిన బత్తిన కుటుంబం ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజున చేప ప్రసాదం పంపిణీ చేస్తుంది. ఈసారి కూడా చేప ప్రసాదం ఇవ్వనున్నారు. జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ చేస్తామని బత్తిని కుటుంబీకులు తెలిపారు.జూన్ 8న హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేపమందు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీలోని నల్గొండ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి కొర్రమి చేప పిల్లలను తెప్పిస్తున్నట్లు మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఒక్కో ముక్క ధర రూ. 40 ఉంటాయని.. సుమారు రెండు లక్షల కొర్ర చేపలు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు.

ఢిల్లీలోని కశ్మీర్ గేట్ పోలీస్ స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం..

ఢిల్లీలోని కశ్మీర్ గేట్ మెట్రో పోలీస్ స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం గురించి ఢిల్లీ అగ్నిమాపక శాఖకు అర్ధరాత్రి 12:45 గంటలకు పోలీసులు సమాచారం అందించారు. కాగా.. మంటలను అదుపు చేసేందుకు కనీసం 12 అగ్నిమాపక దళ వాహనాలను ఘటనాస్థలికి తరలించారు. అయితే.. మంటలు వేగంగా పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టాయి.

ఈ క్రమంలో రికార్డ్ రూమ్ నుండి అల్మారాలు, బ్యారక్‌లు మరియు ఫైళ్ల వరకు ప్రతిదీ దగ్ధమైంది. ఇదిలా ఉంటే.. కశ్మీర్ గేట్ మెట్రో పోలీస్ స్టేషన్‌లో మెట్రో డిప్యూటీ కమిషనర్ కార్యాలయం కూడా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం, గాయపడినట్లు నివేదికలు లేవన్నారు. అయితే అగ్నిప్రమాద ఘటనలో స్టేషన్‌లో నిల్వ చేసిన అనేక పత్రాలు, ఇతర కీలకమైన వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని.. సమగ్ర విచారణ అనంతరం తేలుస్తామని పోలీసులు తెలిపారు.

గమనిక.. నేడు హైదరాబాద్ లో పవర్ కట్..

హైదరాబాద్ లో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. మరమ్మతుల కారణంగా గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏడీఈ బానోతు చరణ్‌సింగ్‌ తెలిపారు. ఉదయం 10.30 నుంచి 12 గంటల వరకు 11 కేవీ విద్యుత్ టవర్స్, స్వరాజ్ నగర్ ఫీడర్లు, మధ్యాహ్నం 12 నుంచి 1 వరకు 11 కేవీ గ్రేహౌండ్స్, శ్రీరామ్ నగర్ ఫీడర్లు, మధ్యాహ్నం 2 నుంచి 3.30 వరకు 11 కేవీ హిందూ, సీతారామయ్య టవర్స్ ఫీడర్లలో విద్యుత్ సరఫరా ఉండదని ఏడీఈ తెలిపారు. 11 కెవి సోమాజిగూడ మరియు శంకర్‌లాల్ నగర్ ఫీడర్ల పరిధిలోని అనేక ప్రాంతాలు మధ్యాహ్నం 3.30 నుండి 4.30 గంటల వరకు. బంజారాహిల్స్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏడీఈ శ్రీనివాస్‌ తెలిపారు.

మలైకా,అర్జున్ బ్రేక్ అప్..క్లారిటీ ఇచ్చిన మలైకా మేనేజర్..

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ,హీరో అర్జున్ కపూర్ లవర్స్ అన్న విషయం తెలిసిందే.అయితే ఈ జంట బ్రేకప్ బాట పట్టినట్లు ఓ వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా వైరల్ అవుతుంది. అయితే 2017లో సల్మాన్ ఖాన్ సోదరుడు అయిన అర్బాజ్ ఖాన్‌ నుంచి మలైక విడాకులు తీసుకుంది. ఆ తర్వాత నుంచి ఈ భామ బాలీవుడ్ అగ్ర నిర్మాత అయిన బోని కపూర్ తనయుడు అర్జున్ కపూర్‌తో సహజీవనం సాగిస్తోంది.అయితే ఆమెకు అంతకు ముందే ఓ కొడుకు కూడా వున్నాడు.అతడి పేరు అర్హాన్ ఖాన్.

పాలేరుకు సీసీ రోడ్డు ఇచ్చే బాధ్యత నాదే..

పాలేరు నియోజకవర్గంలో ప్రతి ఇంటి ముందు ఎన్ని కోట్లు ఖర్చైనా సీసీ రోడ్డు ఇచ్చే బాధ్యత నాదే అని రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణం శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పాలేరు నియోజకవర్గంలో రెండు నెలల్లో హై టెన్షన్ వైర్లని తొలగిస్తానని తెలిపారు. కొత్త రేషన్ కార్డు కొత్త పెన్షన్ లేదు రాబోయే కొద్ది రోజుల్లో మీ పేదోడి ప్రభుత్వం కార్డుతో పాటు పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుద్దని మీకు తెలియజేస్తున్నా అన్నారు. ఆరోగ్య విషయంలో చదువుల విషయంలో ఎంత ఇబ్బంది వచ్చినా ఈ ప్రభుత్వం పెద్దపేట రెండిటికీ ఏసింది అని కూడా మీకు చెప్తున్నా అన్నారు. పేదోళ్లకు ఇళ్ల స్థలం యిచే బాధ్యత నాది అని తెలుపుతన్న అన్నారు.

మహిళపై హోంగార్డ్ లైంగికదాడి

రక్షించాల్సిన పోలీసులే.. భక్షకులుగా మారుతున్నారు. కన్ను మిన్ను కానకుండా స్త్రీలపై తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. బైక్‌పై వెళ్తున్న ఓ జంటను పోలీస్‌ వాహనంలో తన స్నేహితుడితో కలిసి వచ్చిన ఓ హోంగార్డ్‌ అడ్డగించి, బెదిరించి మహిళను తుప్పల్లోకి తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు దిశ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం నుంచి కుమిలి వెళ్లే రహదారిలో బైక్‌పై తన కుటుంబసభ్యుడితో కలిసి వెళ్తున్న సుమారు 45 ఏళ్ల వయసు కలిగిన మహిళను చూసిన హోంగార్డ్‌, అతని స్నేహితుడు పోలీస్‌ వాహనంపై వాని వెనుక వెళ్లి కుమిలి వెళ్లే రహదారిలో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతం వద్ద బైక్‌ను ఆపారు.

సోనియా తెలంగాణ పర్యటన రద్దు..?

రేపటి ఆవిర్భావ వేడుకలకు సోనియాగాంధీని సీఎం రేవంత్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికి సోనియాగాంధీ పర్యటన పై ఇంకా క్లారటీ రాలేదు. ఢిల్లీలో ఎండల కారణంగా సోనియా రాక అనుమానమే అంటూ పార్టీ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. సోనియాగాందీ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు హాజరు కావడం లేదని గాంధీభవన్ వర్గాలు స్పష్టం చేశాయి. అస్వస్థత, సూర్యరశ్మి కారణంగా, డాక్టర్ల సలహా మేరకు ఆమె తన పర్యటనను రద్దు చేసుకుందని తెలుస్తుంది. అయితే దీనిపై తెలంగాణ ప్రజలకు వీడియో సందేశాన్ని ప్రసారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

కలుషిత నీరు సరఫరా కారణంగానే ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది

విజయవాడలో డయేరియా మరణాలు ఆందోళనకరమన్నారు టీడీపీ చీఫ్‌ చంద్రబాబు నాయుడు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే సమస్యపై దృష్టి పెట్టాలన్నారు. కలుషిత నీరు సరఫరా కారణంగానే ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని, దీనిపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు చంద్రబాబు. విజయవాడలో డయేరియాతో వారం రోజుల వ్యవధిలో 9 మంది చనిపోవడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డయేరియాతో కాకుండా ఇతర అనారోగ్య కారణాలతో వీరంతా చనిపోయారని అధికారులు చెప్పడం సరికాదని అన్నారు. కలుషిత నీటిపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై అధికారులు వెంట‌నే స్పందించాలని తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సంద‌ర్భంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు.

 

Exit mobile version