NTV Telugu Site icon

Tomoto Price Today: దిగొస్తున్న టమాటా ధరలు.. ఇక కొనేసుకోవచ్చు! రైతుబజార్లో కిలో ఎంతంటే?

Tomoto Today Rate

Tomoto Today Rate

Tomoto Price Falls in Hyderabad Rythu Bazaar: గత కొన్ని రోజులుగా సామాన్య ప్రజలను ‘టమాటా’ ధరలు బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. దేశంలోని అన్ని ప్రాంతాల్లో కిలో టమాటా రూ. 200పైనే ఉండడంతో కొంత మంది వాడడమే మానేశారు. అయితే గత మూడు రోజులుగా టమాటా ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. దిగుబడి పెరగడంతో టమాటా ధరలు దిగొస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌ రైతుబజారులో కిలో టమాటా రూ. 63లుగా ఉంది. బయట మార్కెట్లలో మాత్రం కిలో టమాటా రూ.120-140 పలుకుతోంది.

హైదరాబాద్‌ నగరానికి 10 రోజుల కిందట కేవలం 800 నుంచి 850 క్వింటాళ్ల టమాటా వచ్చేది. అయితే సోమవారం (ఆగస్టు 7) మాత్రం 2450 క్వింటాళ్ల టమాటా హోల్‌సేల్‌ మార్కెట్‌కు వచ్చింది. అనంతపురం, చిత్తూరు, కర్ణాటక నుంచి హైదరాబాద్‌కు ఎక్కువగా దిగుబడి వస్తోంది. మరోవైపు రంగారెడ్డి, వికారాబాద్‌, చేవెళ్ల, మెదక్‌ జిల్లాల నుంచి కూడా మార్కెట్‌కు టమాటా వస్తోంది. దాంతో టమాటా ధర తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.

టమాటా రాక పెరిగితే.. ధర మరింత తగ్గుతుందని వ్యాపారులు అంటున్నారు. ఆగష్టు చివరి వరకల్లా కిలో రూ. 40-50లోపు దొరికే అవకాశం ఉందని వ్యవసాయ మార్కెటింగ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. కిలో టమాటా రూ. 40 నుంచి రూ. 50 మధ్యలో ఉంటే.. వినియోగదారులు, రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండని చెబుతున్నారు. తగ్గుతున్న ఈ ధరలు చూస్తే.. మరికొన్ని రోజుల్లో టమాటా సామాన్య ప్రజలకు అందుబాటులోకి రానుంది.

Also Read: Viral Video Today: పొరపాటున ఫస్ట్ గేర్‌.. జలపాతంలో పడిపోయిన కారు! వీడియో వైరల్

టమాటా దిగుబడి, హోల్‌సేల్‌ మార్కెట్లో డిమాండ్‌ ఆధారంగా వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ అధికారులు ధరలు నిర్ణయిస్తారు. టమాటా నాణ్యతను బట్టి మొదటి, రెండో రకంగా విభజించి.. ధరలు నిర్ణయిస్తారు. ఆ ప్రకారమే రైతుబజార్లలో అమ్మాలని ఆదేశిస్తారు. అయితే వ్యాపారులు మాత్రం అన్ని రకాల టమాటాకు ఒకే ధర తీసుకుంటున్నారు. వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ కిలో మొదటి రకం టమాటా రూ. 63గా నిర్ధారించి బోర్డులు రైతుబజార్లలో పెట్టినా.. అక్కడి శాశ్వత దుకాణదారులు కిలో రూ. 100కు పైగా అమ్ముతున్నారు.

 

Show comments