ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి.. దాంతో పాటు జనాలకు వణుకు పుట్టించేలా కూరగాయల ధరలు భారీగా పెరుగుతున్నాయి..ఈ రోజు ధర రేపు ఉంటుందా అనేటంతగా ధరలు పెరుగుతున్నాయి. ధరల పెరుగుదలతో వినియోగదారులు ఏమి కొనేటట్లు లేదు.. రెక్కాడితే కానీ డొక్కాడని రోజూవారి కూలీలకు పెను భారంగా కూరగాయల ధరలు పెరుగుతున్నాయి.. ముఖ్యంగా దేశంలో ఇక్కడ అక్కడ అని లేకుండా టమాటా ధర పెట్రోల్ ధర కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో టమాటా ధర సెంచరీ దాటింది. మరికొన్ని చోట్ల రెండు వందలు దాటింది.
ఈ నేపథ్యంలో టమాటా కొనేందుకు జనం జంకుతున్నారు. టమాట ధర సెంచరీ దాటడంతో ఫుల్ డిమాండ్ ఏర్పడి కొన్ని చోట్ల చోరీ కేసులు నమోదవుతున్నాయి. దీంతో టమాటా రైతులు పొలాలను కాపలా కాస్తున్నారు. అయితే ఈ కేసులో 2 వేల కిలోలకు పైగా టమాటాలు ఉన్న బొలెరో వాహనాన్ని కొందరు చోరీ చేశారు.. మొన్నీమధ్య ఏకంగా టమోటా పొలంలోకి వెళ్లి 1000 కిలోల టమోటాలను చోరీ చేశారు.. అంతలోనే ఇలా జరగడం తో టమోటా వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.. ఇక బెంగళూరులోని యలహంక సమీపంలోని చిక్కజాల గ్రామ సమీపంలో ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం జూన్ 08వ తేదీ ఉదయం రైతు హిరియూరు నుంచి కోలార్‌కు టమాట రవాణా చేస్తున్నాడు. ఇది చూసిన ముగ్గురు వ్యక్తులు కారులో టమాటాలతో ఉన్న బొలెరో వాహనాన్ని అనుసరించారు.
ఆ తర్వాత ఆర్‌ఎంసీయార్డ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బొలెరో వాహనాన్ని అడ్డుకున్నారు. అనంతరం పీణ్య సమీపంలోని బొలెరో వాహనంతో కారును తాకినట్లు అరుస్తూ డ్రైవర్‌తో పాటు రైతుపై దాడి చేశారు. డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేశారు..డబ్బులు లేవని చెప్పడంతో మొబైల్ ఫోన్‌లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయమని చెప్పి డబ్బులు దోచుకున్నారు. అప్పుడు బొలోరోలో టొమాటోలను చూశారు. అనంతరం ఆ వాహనాన్ని చిక్కజాల వరకు తీసుకుని వెళ్లి రైతును వదిలి డ్రైవర్‌తో పాటు వాహనం నిండా ఉన్న టమాటాలతో పరారయ్యారు.. ఈ ఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేసిన రైతు వివరాల ప్రకారం కేసు నమోదు చేశారు..2000 కిలోల టమాటాలు దొంగతనం జరిగి నష్టపోవడంతో రైతు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు..
