ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు.. అనే చందంగా మారింది ప్రస్తుత ధరలు చూస్తుంటే.. సామాన్యుడి బ్రతుకే ప్రశ్నార్థంగా మారింది. కూరగాయల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. టమాటా, పచ్చిమిర్చి ధర ఎన్నడూ లేనంత పెరిగాయి. ఇక, సామాన్యుడికి అందనంటున్నాయి. ప్రస్తుతం మెదక్ మార్కెట్‌లో టమాటా అందనంత ఎత్తులోకి చేరింది. పచ్చిమిర్చి ధర ఘాటెక్కిస్తుంది. వామ్మో ఇవేమి ధరలు అంటూ కొనేందుకు సామాన్య ప్రజలు జంకుతున్నారు. పది రోజుల వరకు కిలో రూ.80 నుంచి 100 ఉన్న టమాట.. ఇప్పుడు మెదక్ మార్కెట్‌లో రికార్డు స్థాయిలో కిలో డబుల్ సెంచరీ కొట్టింది. పచ్చిమిర్చి కిలో రూ.130కి చేరింది.
Read Also: PSLV C-56 Rocket: PSLV C-56 రాకెట్ ప్రయోగం సక్సెస్.. 7 ఉపగ్రహాల్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో
మెదక్ జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లో, పల్లెలో చూసినా ఇవే ధరలు పలుకుతున్నాయి. ఏ కూరగాయ కొందామన్న కిలో 80 నుంచి 100 రూపాయలకు తక్కువ లేదు. దాంతో కిలో కొనేవారు కూడా పావుకిలోతో సరిపెట్టుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కూరగాయ పంటలు పూర్తిగా పాడవడంతో పాటు కొన్నాళ్లు పాటు కాచిన భారీ ఎండలతో దిగుబడి పూర్తిగా తగ్గింది. ఇతర ప్రాంతాలను నుంచి దిగుమతి పడిపోవడంతో కూరగాయల కొరత ఏర్పడి ధరలు అకాశానికి అంటుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో కిలో టమాట రూ.20 ఉంది.
Read Also: Eye Twitching: కళ్లకలక ఎందుకు వస్తుందో తెలుసా..? ఈ ఇన్‌ఫెక్షన్ వస్తే పాటించాల్సినవి ఇవే..?
ప్రస్తుతం మెదక్ మార్కెట్‌లో హోల్‌సేల్ కిలో నాణ్యమైన టమాటా ధర రూ.130, రీటైల్ మార్కెట్‌లో కిలో రూ.200గా ఉంది. పది రోజుల క్రితం వరకు కిలో రూ.80 నుంచి 100 ఉన్న టమాట ధర ప్రసుత్తం రూ.200కు చేరింది. 25 కిలోల బాక్స్ ధర మార్కెట్‌లో రూ.3,800 నుంచి రూ.4 వేలు ధర పలుకుతోంది. పచ్చిమిర్చి ధర రూ.130కి చేరింది. బీరకాయ రూ.120, చిక్కుడుకాయ ధర రూ.100, అల్లం రూ.200, బీన్స్ రూ.120 పలుకుతోంది. ఆనిశ్చిత వాతావరణ పరిస్థితులు టమాటా సరఫరాపై ప్రభావం చూపడంతో ధరలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. పెరిగిన ధరలతో కూరగాయలు కొనలేకపోతున్నామని పేద, మధ్య తరగతి ప్రజలంటున్నారు.