Tollywood Star Daughters: కొడుకులే కాదు.. తండ్రుల లెగసీని మోస్తున్న టాలీవుడ్ వారసురాళ్లు..!

Tollywood Star Daughters

Tollywood Star Daughters

Tollywood Star Daughters: టాలీవుడ్ సినీ పరిశ్రమలో ‘వారసత్వం’ అనగానే అందరి దృష్టి ముందుగా కొడుకుల వైపే పడుతుంది. ఎందుకంటే.. తనయులే కదా తండ్రుల లెగసీని ముందుకు తీసుకెళ్తారనే భావన సాధారణంగా ఉంటుంది. అయితే ఇప్పుడు టాలీవుడ్‌లో ఆ లెక్కలన్నీ తారుమారయ్యేలా ఉన్నాయి. వారసులకు ఏమాత్రం తీసిపోకుండా వారసురాళ్లు కూడా తమ ప్రతిభతో రాణించడానికి ముందడుగు వేస్తున్నారు. కొందరు వెండితెరపై హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తూ మెప్పిస్తుంటే.. మరికొందరు తెరవెనుక ఉండి తండ్రుల కెరీర్‌లను మలుపు తిప్పుతూ వారి విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి ఆ వివరాలేంటో చూసేద్దామా..

టాలీవుడ్‌లో కొందరు వారసురాళ్లు కెమెరా ముందుకు రాకపోయినా.. తెరవెనుక ఉంటూ తండ్రులకు కొండంత అండగా నిలుస్తున్నారు. నందమూరి బాలకృష్ణ కెరీర్‌ను ‘అఖండ’ చిత్రం తర్వాత సరికొత్త కోణంలో ఆవిష్కరించి, ఆయనను ‘NBK 2.0’గా తీర్చిదిద్దడంలో ఆయన చిన్న కుమార్తె తేజస్విని కీలక పాత్ర పోషించారు. అఖండ తర్వాతి నుంచి బాలయ్య ఎంచుకుంటున్న కథలు, లైనప్, ఆయన సరికొత్త మేకోవర్ వెనుక తేజస్విని ఆలోచనలు, నిర్ణయాలు స్పష్టంగా కనిపిస్తాయి. కొన్నిరోజుల క్రితం తేజస్వి కూడా సినీ రంగప్రవేశం చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. చూడాలి మరి ఆఫీసియల్ గా ఎప్పుడు నిర్ధారిస్తారో..

మరోవైపు టాలీవుడ్‌లోకి మరో స్టార్ కిడ్ గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. సీనియర్ నటుడు శ్రీకాంత్, ఊహ దంపతుల గారాల కూతురు “మేధా” మేక కథానాయికగా వెండితెరకు పరిచయం కానున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో రూపొందుతున్న సరికొత్త లవ్ స్టోరీతో ఆమె సినీ రంగ ప్రవేశం ఖరారైంది. ఈ చిత్రంలో మేధతో పాటు “జై జాస్తి” హీరోగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే శ్రీకాంత్ కుటుంబం నుంచి ఆయన కుమారుడు రోషన్ హీరోగా పరిచయమై, త్వరలోనే ‘ఏమో ఏమో ఇది’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పుడు ఆయన సోదరి మేధ కూడా హీరోయిన్‌గా అడుగుపెడుతుండటం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అలాగే తండ్రుల విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న కుమార్తెల ప్రస్తావన వచ్చినప్పుడు మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిరంజీవి రీ-ఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ నుంచి ఆమె నాన్నకు నిరంతరం అండగా నిలబడుతున్నారు. ఆయన చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేయడమే కాకుండా.. నిర్మాతగానూ ఎదుగుతూ ప్రతి విషయంలో తండ్రికి వెన్నుదన్నుగా ఉంటున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజా రవితేజ కూతురు మోక్షద కూడా తండ్రి కెరీర్ బాధ్యతలను భుజాన వేసుకుంటున్నారు. ఇటీవల శబరిమల ఇరుముడి యాత్ర నుంచి కొత్త చిత్రం ‘తులాభారం’ పూజా కార్యక్రమాల వరకు ఆమె తండ్రితోనే ఉంటూ సందడి చేశారు. కేవలం ఈవెంట్లలో తోడుగా ఉండటమే కాకుండా.. రవితేజ ఎంచుకునే సినిమాల కథల ఎంపిక విషయంలోనూ మోక్షద దగ్గరుండి చూసుకుంటున్నారని సమాచారం. మొత్తానికి టాలీవుడ్ స్టార్ డాటర్స్ అందరూ తమ తండ్రులతో కలిసి అడుగులు వేస్తూ, తెరవెనుక నిర్ణయాలతో వారిని సక్సెస్ ట్రాక్‌పై నడిపించడంలో కీలక పాత్రలను పోషిస్తున్నారు.