Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!

Tollywood Most Eligible Bachelors

Tollywood Most Eligible Bachelors

Tollywood Most Eligible Bachelors: సినీ పరిశ్రమలో సమకాలీన హీరోలంతా వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌ను, కెరీర్‌ను సమాంతరంగా నడిపిస్తూ బిజీగా ఉంటే.. మరికొందరు హీరోలు మాత్రం ఇంకా పెళ్లి పీటలు ఎక్కడానికి ఆసక్తి చూపడం లేదు. వయసు ముదురుతున్న బ్యాచిలర్ ముద్రను చెరిపేసే ఆలోచనలో వీరు కనిపించడం లేదు. కెరీర్‌పై ఉన్న శ్రద్ధ వల్లే పెళ్లిని పక్కన పెట్టారా లేక అసలు వివాహ బంధంపై ఆసక్తి లేదా అన్నది అభిమానుల్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటోంది. టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌ లిస్ట్ ఏంటో చుసేద్దమా..

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్

ఈ జాబితాలో మొదటి స్థానం ఎప్పటికీ రెబల్ స్టార్ ప్రభాస్‌దే. 46 ఏళ్ల వయసుకు చేరుకున్న ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే ప్రశ్న దశాబ్ద కాలంగా టాలీవుడ్‌లో నానుతూనే ఉంది. పెళ్లిపై అటు ఔనని చెప్పకుండా, ఇటు చేసుకోనని తేల్చకుండా అభిమానుల్లో ఆశలను అలానే సజీవంగా ఉంచుతున్నారు. ప్రస్తుతం చేతినిండా వరుస పాన్-ఇండియా సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్న ప్రభాస్, ఇక పూర్తిగా సినీ ప్రాజెక్టులకే అంకితమైపోయారా అనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.

సైలెంట్‌గా అడవి శేష్

మిల్కీ బాయ్‌లా కనిపించే గ్లామర్ హీరో అడవి శేష్ వయసు కూడా 40 ఏళ్లకు చేరింది. అయితే ఆయన వ్యక్తిగత జీవితం, పెళ్లి విషయాల గురించి ఎక్కడా స్పందించడం లేదు. నిదానంగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్న శేష్, డేటింగ్ రూమర్లకు కూడా తావివ్వకుండా చాలా ప్రైవేట్‌గా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన తన హిట్ ఫ్రాంచైజ్ ‘గూఢచారి’ సీక్వెల్ పనులతో బిజీగా ఉన్నారు.

సాయిధరమ్ తేజ్

ఇక ఈ లిస్ట్ లో మరో హీరో 39 ఏళ్ల సాయిధరమ్ తేజ్. రెండేళ్లుగా ఇదిగో ముహూర్తం, అదిగో పెళ్లి అంటూ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉన్నారు. వచ్చే ఏడాది తప్పకుండా ఒక ఇంటివాడిని అవుతానని గతంలో ప్రకటించడంతో ఆయన పెళ్లిపై మెగా అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా షూటింగ్‌లో బిజీగా గడుపుతున్నారు. ఈ ఏడాదైనా ఆయన పెళ్లి బాజా మోగుతుందో లేదో చూడాలి.

డేటింగ్‌పై సీక్రెసీతో రామ్ పోతినేని

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి కూడా 37 ఏళ్లు వచ్చాయి. ఒకవైపు లవ్ స్టోరీలకు స్వస్తి చెప్పి మాస్ యాక్షన్ జానర్లలో నటిస్తూ అభిమానులను అలరిస్తున్న రామ్, తన పర్సనల్ లైఫ్‌ను మాత్రం అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. నటి భాగ్యశ్రీ బోర్సేతో లవ్ రూమర్స్ వచ్చినప్పటికీ వాటిపై ఎటువంటి అధికారిక స్పష్టత రాలేదు. ప్రస్తుతం రామ్ తన 23వ సినిమా షూటింగ్‌పైనే పూర్తి దృష్టి సారించారు.

సినిమాలే ప్రపంచంగా సందీప్ కిషన్

తెలుగు, తమిళ భాషల్లో వరుసగా చిత్రాలు చేస్తూ 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న హీరో సందీప్ కిషన్ వయసు ప్రస్తుతం 38 ఏళ్లు. మధ్యలో కొన్ని డేటింగ్ రూమర్స్ వినిపించినా అవి పెళ్లి వరకు చేరలేదు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో.. వరుస ప్రాజెక్టులతోనే కాలం గడిపేస్తూ పెళ్లి ముచ్చట్లను మాత్రం పక్కన పెట్టేశారు. మరి ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఈ సంవత్సరమైనా పెళ్లి ప్రకటన చేసి అభిమానులను సర్ ప్రైజ్ చేస్తారో లేదో వేచి చూడాలి.