NTV Telugu Site icon

Cock Fighting: సైలెంట్‌గా నిలబడి.. 1.25 కోట్లు గెలిచిన కోడిపుంజు!

Bhimavaram Cock Fighting

Bhimavaram Cock Fighting

సంక్రాంతి పండగ వచ్చిందంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంబరాల్లో మునిగిపోతారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిండివంటలూ, రంగవల్లులతో పాటుగా కోడిపందేలతో తెగ ఎంజాయ్ చేస్తారు. ఈసారి కోస్తాంధ్ర మాత్రమే కాదు.. రాయలసీమలోనూ కోడిపుంజులు తొడకొట్టాయి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన కోటి రూపాయల కోడి పందెం గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. తాజాగా మరో కోడి పందెంకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఓ కోడిపుంజు సైలెంట్‌గా నిలబడి రూ.1.25 కోట్లు గెలిచింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఐదు కోళ్ల మధ్య పందెం పెట్టారు. పందెం దారులు గిరి గీసి ఐదు కోడి పుంజులను వదిలారు. నాలుగు కోళ్లు ఒకదానితో ఒకటి తలపడ్డాయి. ఢీ అంటే ఢీ అన్నట్లుగా నాలుగు పుంజులు తలపడ్డాయి. అయితే ఓ కోడిపుంజు మాత్రం సైలెంట్‌గా నిలబడింది. మిగతా కోడిపుంజులు కొట్టుకుంటున్నా.. తనకేమీ పట్టనట్టుగా ఉంది. ముందుగా రెండు కోడిపుంజులు కిందపడిపోగా.. ఆపై మరొకటి కింద పడింది. అప్పటివరకు బాగానే ఉన్న మరో పుంజు హఠాత్తుగా పడిపోయింది. నాలుగు కోళ్లు కొట్టుకొని చచ్చిపోగా.. చివరికి సైలెంట్‌గా నిలబడిన కోడి విజేతగా గెలిచింది. దాంతో ఆ కోడిపుంజు యజమాని ఎగిరి గంతులేశాడు.

ఏమీ చేయకుండానే పందెంలో గెలిచిన కోడిపుంజుకు ఏకంగా రూ.1.25 కోట్లు బహుమతిగా దక్కింది. దాంతో కోడిపుంజు యజమాని దానిని పట్టుకుని ఆ ప్రాంతమంతా పరిగెత్తాడు. ఇందుకు సంబంధించిన వీడియో వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ షాక్ అవుతున్నారు. ‘కాలు కదపకుండా ఐదు కోళ్ల పందెం గెలిచిన పుంజు’, ‘గొడవలు జరుగుతున్నప్పుడు సైలెంట్‌గా ఉండడం కన్నా మేలైన మార్గం ఇంకోటి ఉండదు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Show comments