Site icon NTV Telugu

Today Business Headlines 14-03-23: బ్యాంకులకు, వ్యాపారులకు సూచన.. చైనా కరెన్సీ వాడొద్దు!. మరిన్ని వార్తలు

Today Business Headlines 14 03 23

Today Business Headlines 14 03 23

Today Business Headlines 14-03-23:

సీఎండీగా అదనపు బాధ్యతలు

నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌.. ఎన్‌ఎండీసీ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా అమితవ ముఖర్జీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈయన ఇప్పుడు ఇదే సంస్థలో ఫైనాన్స్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. 1995 బ్యాచ్‌ ఇండియన్‌ రైల్వే అకౌంట్స్‌ సర్వీస్‌ ఆఫీసర్‌ అయిన అమితవ ముఖర్జీ.. ఎన్‌ఎండీసీలో చేరకముందు రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌లో ఫైనాన్స్‌ విభాగానికి జనరల్‌ మేనేజర్‌గా చేశారు. ఎన్‌ఎండీసీలో చేరాక.. డిజిటలైజేషన్‌, స్టాక్స్‌ ఎక్స్ఛేంజ్‌లో నమోదు, ఆస్ట్రేలియాలో మైనింగ్‌ ఆపరేషన్స్‌ పర్యవేక్షణ తదితర బాధ్యతలను నిర్వర్తించారు.

హైదరాబాద్‌కి అలైన్ టెక్నాలజీస్

అమెరికా సంస్థ అలైన్‌ టెక్నాలజీస్‌ తన ఇన్నోవేషన్‌ సెంటర్‌ని హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీకి దగ్గరలో ఉన్న సాలార్‌పురియా సత్వ నాలెడ్జ్‌ పార్క్‌లో లాంఛ్‌ చేసింది. అమెరికా స్టాక్‌ మార్కెట్‌లో నమోదైన ఈ సంస్థ.. మెడికల్‌ డివైజ్‌ల డిజైన్‌, ప్రొడక్షన్‌ మరియు సేల్స్‌ వంటి కార్యకలాపాలు సాగిస్తోంది. కంపెనీ సర్వీసులను కస్టమర్లకు చేరువ చేసేందుకు హైదరాబాద్‌లో ఈ ఇన్నోవేషన్‌ సెంటర్‌ని ఏర్పాటుచేసినట్లు అలైన్‌ టెక్నాలజీస్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ప్రెసిడెంట్‌ మరియు చీఫ్‌ డిజిటల్‌ ఆఫీసర్‌ కొల్లి శ్రీలక్ష్మి తెలిపారు.

డిఫెన్స్, ఇండస్ట్రియల్ రోబో

రోజురోజుకీ అధునాతన రోబోల అభివృద్ధి జరుగుతోంది. హైదరాబాద్‌లోని స్వయ రోబోటిక్స్‌ సంస్థ డిఫెన్స్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రోబోని తయారుచేసింది. దీన్ని.. క్వాడ్రప్‌డ్‌ రోబో అంటారు. ఇది మనుషులు చేరుకోలేని ప్రదేశాలకు సైతం వెళ్లగలదు. దూర ప్రాంతాలకు నడిచి వెళ్లే క్రమంలో సైనికులు అలిసిపోకుండా, భారీ బరువులు ఎత్తేటప్పుడు శ్రమపడకుండా ఉండేందుకు స్పెషల్‌గా ఎక్సో-స్కెలిటన్‌ను డెవలప్‌ చేసినట్లు స్వయ రోబోటిక్స్‌ కంపెనీ ఫౌండర్‌ అండ్‌ ఎండీ చెప్పారు. పరిశ్రమల్లో కార్మికులు చేయలేని కష్టమైన పనులను ఈ రోబోతో చేయించుకోవచ్చని తెలిపారు.

సంగం డెయిరీ ఫలితాలివే..

2022-23 ఆర్థిక సంవత్సరంలో సంగం డెయిరీ టర్నోవర్‌ 16 వందల కోట్ల రూపాయలకు చేరింది. దీనిపై 40 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది కాలంలో 21 కోట్ల 4 లక్షల లీటర్ల పాలు సేకరించింది. ఈ నేపథ్యంలో నికర ఆదాయంలో 60 శాతాన్ని రైతులకు బోనస్‌గా ఇవ్వాలని నిర్ణయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 27 కోట్ల లీటర్ల పాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాయలసీమలోని కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో పాల సేకరణ మరియు అమ్మకాలు కూడా ప్రారంభించనున్నట్లు చైర్మన్‌ నరేంద్ర తెలిపారు.

ఏపీ చాప్టర్‌కి కొత్త కార్యవర్గం

కాన్ఫెడరేషన్ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ.. CII ఆంధ్రప్రదేశ్‌ చాప్టర్‌ చైర్మన్‌గా ఎం.లక్ష్మీప్రసాద్‌ నియమితులయ్యారు. వైస్‌ చైర్మన్‌గా పి.మురళీకృష్ణ వ్యవహరిస్తారు. వీళ్లిద్దరు 2023-24 సంవత్సరానికి గాను ఈ పదవుల్లో కొనసాగుతారు. నిన్న సోమవారం విశాఖపట్నంలో జరిగిన CII ఏపీ చాప్టర్‌ వార్షిక సదస్సులో ఈ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. CII తెలంగాణ చాప్టర్‌కి కూడా ఇటీవలే కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ చాప్టర్‌ చైర్మన్‌గా సి.శేఖర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా డి.సాయిప్రసాద్‌ నియమితులయ్యారు.

చైనా కరెన్సీ వాడొద్దు!

చైనా కరెన్సీ యుఆన్‌ని వాడొద్దని కేంద్ర ప్రభుత్వం.. బ్యాంకులకు, వ్యాపారులకు సూచించింది. రష్యా నుంచి చేసుకునే దిగుమతులకు ఈ కరెన్సీ ఇవ్వొద్దని చెప్పినట్లు అధికార వర్గాలు తెలిపాయి. చైనా కరెన్సీకి బదులుగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కరెన్సీ దిర్హామ్‌ని వినియోగించాలని కోరింది. పక్క దేశమైన చైనాతో సుదీర్ఘకాలంగా రాజకీయ విభేదాలు నెలకొనటమే దీనికి కారణమని, ఆర్థిక అంశాలు కాదని ఆఫీసర్లు స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఏర్పడే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని పేర్కొన్నారు.

Exit mobile version