Today (29-12-22) Business Headlines:
ఐఓసీ విస్తరణ ప్రణాళిక
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ 2 తెలుగు రాష్ట్రాల్లో అమలుచేస్తున్న మరియు అమలుచేయనున్న విస్తరణ ప్రణాళికలను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో ఏర్పాటుచేస్తున్న ఎల్‌పీజీ బాట్లింగ్ యూనిట్ మరో 3 నెలల్లో అందుబాటులోకి రానుంది. తెలంగాణలోని హైదరాబాద్‌కు దగ్గరలో మల్కాపూర్ వద్ద టెర్మినల్ నిర్మాణం 87 శాతం పూర్తయింది. ఇది 2023 చివరి నాటికి ప్రారంభమవుతుంది. దీంతో ఒడిశాలోని పారాదీప్ నుంచి నేరుగా ఇక్కడికి పైప్‌లైన్ ద్వారా పెట్రోల్, డీజిల్ సప్లై అవుతుంది. కొత్తగా 168 రిటైల్ ఔట్‌లెట్లు, 264 బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్లు కూడా ఓపెన్ చేయనుంది.
కమాన్.. కరోనా..
హైదరాబాద్‌లోని 2 ప్రముఖ బయోటెక్ సంస్థల వద్ద కొవిడ్ వ్యాక్సిన్లు భారీఎత్తున స్టాక్ ఉన్నాయని తెలుస్తోంది. బయొలాజికల్ ఇ లిమిటెడ్ మరియు భారత్ బయోటెక్ వద్ద కంబైన్డ్‌గా పాతిక కోట్ల వరకు డోసులు నిల్వ ఉన్నట్లు సమాచారం అందుతోంది. బయొలాజికల్ ఇ లిమిటెడ్ వద్ద 20 కోట్ల డోసుల కార్బెవ్యాక్స్ టీకా, భారత్ బయోటెక్ వద్ద 5 కోట్ల డోసుల కొవాగ్జిన్ వ్యాక్సిన్ ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. చైనాతోపాటు మరికొన్ని దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటం, అవి మన దేశానికి కూడా విస్తరించే ప్రమాదం ఉందన్న నేపథ్యంలో ఈ రెండు కంపెనీలు అదనపు టీకాల ఉత్పత్తికి అన్నీ సిద్ధం చేశాయి.
ఇవాళ్టి వార్తల్లో ఇద్దరు
ఇవాళ ఇద్దరు వ్యాపార దిగ్గజాలు ప్రముఖంగా వార్తల్లో నిలిచారు. ఒకరు రతన్ టాటా కాగా మరొకరు ముఖేష్ అంబానీ. టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా నిన్న బుధవారం 85వ ఏట అడుగు పెట్టారు. 1991లో టాటా గ్రూప్ చైర్మన్‌గా పగ్గాలు చేపట్టిన రతన్ టాటా 20 ఏళ్లకు పైగా ఆ పదవిలో కొనసాగారు. సంస్థను సరికొత్త శిఖరాలకు చేర్చారు. మరో వైపు.. ముఖేష్ అంబానీ.. రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కి ఎండీ అండ్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి 20 ఏళ్లు పూర్తయింది. ఆయన సారథ్యంలో రిలయెన్స్ ఆదాయం 17 రెట్లు, లాభం 20 రెట్లు అయ్యాయి. ఇన్వెస్టర్లకు 17 లక్షల కోట్ల రూపాయలకు పైగా సంపదను సృష్టించారు.
నూతన అధ్యాయం
ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ట్రేడింగ్‌కి సంబంధించి ఇవాళ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలు ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీన సంతకాలు చేశాయి. నేటి నుంచి అమల్లోకి వస్తున్న ఈ ఒడంబడిక వల్ల ఇండియా.. ఆస్ట్రేలియాకి ఎగుమతి చేసేవాటిలో 6 వేల వస్తువులకు ట్యాక్సులు వసూలు చేయరు. అంటే.. ఆ దేశంలో ఈ వస్తువులు తక్కువ రేటుకే అందుబాటులోకి వస్తాయి. తద్వారా భారతదేశానికి వర్తక ప్రయోజనం కలుగుతుంది. ఫలితంగా వచ్చే ఐదేళ్లలో 2 దేశాల మధ్య వ్యాపారం రెట్టింపై 45-50 బిలియన్ డాలర్లకు చేరుతుందని సంబంధిత వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.
ఐటీ డిఫాల్టర్ల లిస్టు
తొమ్మిది మంది ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ డిఫాల్టర్స్ లిస్టును సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. ఈ జాబితాలో వ్యక్తులు మరియు సంస్థలు కూడా ఉన్నాయి. ఇందులోని కొంత మంది రెండేళ్లుగా తప్పిపోయారని, మరికొంత మంది 2 వారాలుగా ఆచూకీ లభించట్లేదని పేర్కొంది. సెబీ రికవరీ ఆఫీసర్లు డిఫాల్టర్లకు డిమాండ్ నోటీసులను అందించటానికి వెళ్లినప్పుడు వాళ్లు తమ అడ్రస్‌లలో లేని విషయం వెలుగులోకి వచ్చింది. ఒకటి కాదు.. అర కాదు.. రెండు మూడు చిరునామాల్లో వెతికినా కూడా ప్రయోజనం లేకుండా పోయిందని సెబీ పేర్కొంది. ఈ పరిణామం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఢోకాలేని 20 జాబులు
2023లో ఆర్థిక మాంద్యం తలెత్తినా ఆ ప్రభావం పడని 20 ఉద్యోగాలను పేస్కేల్ అనే సంస్థ వెల్లడించింది. ఆ లిస్టులోని జాబుల పేర్లు.. వెయిటర్ లేదా వెయిట్రెస్, ప్రైవేట్ బ్యాంకర్, మీడియా డైరెక్టర్, పోలీస్, ఫైర్ లేదా అంబులెన్స్ డిస్‌ప్యాచర్, సేల్స్ కన్సల్టెంట్, మైక్రోబయాలజిస్ట్, మార్కెటింగ్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ డైరెక్టర్, డాక్ వర్కర్, ఈకేజీ టెక్నీషియన్, ఇన్‌స్టలేషన్ టెక్నీషియన్, అసెంబ్లీ లైన్ మెషిన్ ఆపరేటర్, బుక్ కీపింగ్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ క్లర్క్, ట్యాంకర్ ట్రక్ డ్రైవర్, జర్నలిస్ట్, గ్రాఫిక్ డిజైనర్, పేస్ట్రీ చెఫ్, డైవర్సిటీ మేనేజర్, ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్, డైరెక్టర్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ సర్వీసెస్, ఆటోమొబైల్ డ్యామేజ్ ఎస్టిమేటర్.
