Today (20-02-23) Stock Market Roundup ఇండియన్ ఈక్విటీ మార్కెట్ ఈ వారాన్ని శుభారంభం చేసినప్పటికీ ఆ పాజిటివ్ ట్రెండ్‌ని కొనసాగించలేకపోయాయి. ఇవాళ సోమవారం ఉదయం రెండు కీలక సూచీలు లాభాలతో ప్రారంభమైనా.. కొద్దిసేపటికే ఫ్లాట్‌గా ట్రేడ్ అవటం ప్రారంభించాయి. మధ్యాహ్నం జరిగిన లావాదేవీలతో నష్టాలు పెరిగాయి. స్టేట్ బ్యాంక్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయెన్స్ ఇండస్ట్రీస్ షేర్లపై అమ్మకాల ఒత్తిడి పెరగటం వల్ల ఇండెక్స్‌లు కోలుకోలేకపోయాయి.
ఇంట్రాడేలో ఒకానొక దశలో సెన్సెక్స్ 61 వేల 290 పాయింట్లకు చేరింది. నిఫ్టీ సైతం 18 వందల బెంచ్ మార్క్‌ను దాటేసింది. కానీ.. తర్వాత రెండూ సూచీలూ నేలచూపులు చూశాయి. చివరికి.. సెన్సెక్స్.. 311 పాయింట్లు కోల్పోయి 60 వేల 691 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ.. 99 పాయింట్లు తగ్గి 17 వేల 844 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
read more: Companies Names-Full Forms: మనకు తెలియని 40 ఆసక్తికరమైన అంశాలు
సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 12 కంపెనీలు లాభాల బాటలో నడవగా 18 సంస్థలు నష్టాలను మూటగట్టుకున్నాయి. బీఎస్‌ఈలో సుమిటోమో కెమికల్స్, సొనాటా, స్టార్ హెల్త్ సంస్థలు బాగా రాణించగా శిల్పా మెడికేర్, సిప్లా, అదానీ గ్రూప్ కంపెనీలు ఘోరంగా దెబ్బతిన్నాయి. నిఫ్టీ ఫిఫ్టీలో దివిస్ ల్యాబ్, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహింద్రా మెరవగా.. అదానీ ఎంటర్‌ప్రైజెస్, సిప్లా కంపెనీల స్టాక్స్ 6 శాతానికి పైగా నష్టపోయాయి.
రంగాల వారీగా పరిశీలిస్తే.. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ ఒక శాతానికి పైగా పడిపోయింది. తర్వాత.. నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంక్, రియాల్టీ సూచీలు సున్నా పాయింట్ 9 శాతం చొప్పున డౌన్ అయ్యాయి. వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే.. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో.. సిప్లా కంపెనీ షేర్లు 7 శాతం పతమయ్యాయి.
తద్వారా ఒక్కో షేర్ విలువ 956 రూపాయల 20 పైసలకు దిగొచ్చింది. మరోవైపు.. సంవర్ధన మదర్‌సన్ ఇంటర్నేషనల్ షేర్ల విలువ 6 శాతం పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా 45 రూపాయలు పెరిగింది. గరిష్టంగా 56 వేల 302 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు నామమాత్రంగా 94 రూపాయలు ప్లస్సయింది.
అత్యధికంగా 65 వేల 731 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర కూడా స్వల్పంగా 93 రూపాయలు పెరిగి ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 410 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 11 పైసలు బలపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 74 పైసల వద్ద స్థిరపడింది.