NTV Telugu Site icon

Today (15-02-23) Business Headlines: రూ.29 వేల కోట్ల రుణాల రద్దు. మరిన్ని వార్తలు

Today (15 02 23) Business Headlines

Today (15 02 23) Business Headlines

Today (15-02-23) Business Headlines:

షార్ట్‌ సెల్లింగ్‌ని నిషేధించం

ఈక్విటీ మార్కెట్‌లో షార్ట్‌ సెల్లింగ్‌ను నిషేధించే ఉద్దేశం లేదని సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా.. సెబీ.. సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. షార్ట్‌ సెల్లింగ్‌ అనేది అవసరమేనని, దానివల్ల షేర్ల అసలు విలువను కనిపెట్టొచ్చని అభిప్రాయపడింది. 2020వ సంవత్సరం మార్చి నెలలో.. అంటే.. కరోనా ప్రారంభ సమయంలో.. 13 రోజుల్లోనే నిఫ్టీ విలువ 26 శాతం పతనమైనప్పటికీ షార్ట్‌ సెల్లింగ్‌పై నిషేధం విధించలేదని గుర్తుచేసింది. హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ నేపథ్యంలో అదానీ గ్రూప్‌పై ప్రజాప్రయోజన వ్యా్జ్యాలు దాఖలు కాగా సుప్రీంకోర్టు సెబీతోపాటు కేంద్ర ప్రభుత్వ వివరణ కోరిన సంగతి తెలిసిందే. దీంతో సెబీ స్పందించింది.

29 వేల కోట్ల రుణాల రద్దు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని 3వ త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు 29 వేల కోట్ల రూపాయల విలువైన రుణాలను సాంకేతికంగా రద్దు చేశాయి. క్లీనప్‌ ఎక్సర్‌సైజ్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. గత ఆర్థిక ఆర్థిక సంవత్సరంలోని ఇదే సమయంతో పోల్చితే రైటాఫ్‌ అయిన బ్యాడ్‌ లోన్ల విలువ 6 వేల కోట్ల రూపాయలు ఎక్కువ కావటం గమనించాల్సిన విషయం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు రద్దయిన మొత్తం రుణాల విలువ 81 వేల కోట్ల రూపాయలు కాగా పోయిన ఆర్థిక సంవత్సరం కన్నా ఇది 8 వేల కోట్ల రూపాయలు అధికమని రేటింగ్‌ ఏజెన్సీ కేర్‌ రేటింగ్స్‌ పేర్కొంది.

2.40 కోట్ల మంది దూరం

కొవిడ్‌ వల్ల ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ దాదాపు 2 కోట్ల 40 లక్షల మంది ప్రేక్షకులను కోల్పోయింది. ఈ విషయాన్ని మీడియా అనలిటిక్స్‌ సంస్థ ఆర్మాక్స్‌ మీడియా సైజింగ్‌ ద సినిమా 2023 రిపోర్ట్‌ వెల్లడించింది. 2020వ సంవత్సరంలోని జనవరి, మార్చి మధ్య కాలంలో మొత్తం 146 మిలియన్ల మంది థియేటర్లలో సినిమాలు చూడగా ఆ సంఖ్య ఇప్పుడు 122 మిలియన్లకు తగ్గినట్లు పేర్కొంది. గడచిన 12 నెలల కాలంలో కనీసం ఒక్కసారైనా థియేటర్‌కి వెళ్లి సినిమా చూసినవారి సంఖ్య ఆధారంగా ఈ అంచనా వేసింది. ఈ మేరకు జనవరిలో అర్బన్‌ అండ్‌ రూరల్‌ ఇండియాలో సుమారు 15 వేల మంది ఆడియెన్స్‌ అభిప్రాయాలు తెలుసుకుంది.

1.46 లక్షల కోట్లకు ఖర్చు

ఈ సంవత్సరం అడ్వర్టైజ్‌మెంట్‌లపై చేయనున్న ఖర్చు 15 పాయింట్‌ 5 శాతం పెరగనుంది. తద్వారా 1 పాయింట్‌ నాలుగు ఆరు లక్షల కోట్ల రూపాయలకు చేరనుంది. గ్రూప్‌-ఎం అనే మీడియా ఏజెన్సీ ఈ అంచనాలను రూపొందించింది. 2021తో పోల్చితే 2022లో కూడా ప్రకటనల వ్యయం దాదాపు ఇదే స్థాయిలో వృద్ధి చెందటాన్ని ప్రస్తావించింది. ఈసారి వచ్చే అడ్వర్టైజ్‌మెంట్లలో అధిక వాటా డిజిటల్‌ విభాగానిదేనని స్పష్టం చేసింది. అదే సమయంలో టీవీల్లో వచ్చే ప్రకటనల ఖర్చు 31 శాతం నుంచి 30 శాతానికి పడిపోతుందని పేర్కొంది. ప్రింట్‌ మీడియాకి కూడా యాడ్స్‌ ఒక శాతం తగ్గొచ్చని తెలిపింది.

బీడీఎల్‌, థేల్స్‌ సంస్థ టైఅప్‌

హైదరాబాద్‌లోని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌.. బీడీఎల్‌ మరియు ఫ్రాన్స్‌లోని థేల్స్‌ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ అవగాహన ఒప్పందం ప్రకారం లేజర్‌ గైడెడ్‌ రాకెట్ల తయారీ ప్లాంట్లను ఏర్పాటుచేయనున్నాయి. తద్వారా ఈ రాకెట్ల గ్లోబల్‌ సప్లైలో బీడీఎల్‌ సైతం పార్ట్నర్‌ కానుంది. ఇండియాలో రూపొందించే స్పేర్‌ పార్ట్స్‌ను ఇప్పుడు మరియు భవిష్యత్తులో ఎక్స్‌పోర్ట్‌ చేసుకునే అవకాశం అందుబాటులోకి వస్తుంది. గైడెడ్‌ వెపన్స్‌ తయారీలో బీడీఎల్‌కి ఎంతో అనుభవం ఉందని, దీంతో ఈ రంగంలో సరికొత్త శిఖరాలకు చేరుకుంటామని సంస్థ సీఎండీ సిద్ధార్థ మిశ్రా ధీమా వ్యక్తం చేశారు.

2వ ఖరీదైన సిటీగా లండన్‌

డ్రైవింగ్‌ విషయానికొస్తే.. లండన్‌ సిటీ.. ప్రపంచంలోనే 2వ అత్యంత ఖరీదైన నగరంగా నిలిచింది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ రాజధాని అయిన లండన్‌లో రహదారులు చాలా ఇరుకుగా ఉంటాయి. అందువల్ల ఒక పెట్రోల్‌ కారును నడపటానికి 2 వేల 512 పౌండ్లు ఖర్చవుతోంది. 2021వ సంవత్సరంతో పోల్చితే 2022వ సంవత్సరంలో ఇది 550 పౌండ్లు అధికం కావటం ఆశ్చర్యకరం. ఈ విషయాన్ని లొకేషన్‌ టెక్నాలజీ బిజినెస్‌ సంస్థ టామ్‌టామ్‌ పేర్కొంది. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల పెట్రోల్‌ రేట్లు పెరగటం మరొక కారణమని తెలిపింది. డ్రైవింగ్‌కు సంబంధించి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మొదటి నగరంగా హాంకాంగ్‌ పేరొందింది.