NTV Telugu Site icon

Today (13-01-23) Business Headlines: మరో 43 జిల్లాల్లో హాల్ మార్కింగ్. మరిన్ని వార్తలు

Today (13 01 23) Business Headlines

Today (13 01 23) Business Headlines

Today (13-01-23) Business Headlines:

‘శ్రీరామ్ ఫైనాన్స్’కి టాటా

ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అపాక్స్ పార్ట్నర్.. శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీలోని తన మొత్తం వాటా విక్రయానికి రంగం సిద్ధం చేసింది. ఇవాళ శుక్రవారం బ్లాక్ డీల్స్ ద్వారా ఈ అమ్మకాన్ని నిర్వహించనుంది. లావాదేవీ విలువ 2 వేల 250 కోట్ల రూపాయలని తెలుస్తోంది. ఈ రోజు మార్కెట్ పరిస్థితులను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ‘శ్రీరామ్ ఫైనాన్’లో 3 ముఖ్యమైన నాన్ ప్రమోటర్ షేర్ హోల్డర్ సంస్థలు ఉండగా అందులో అపాక్స్ పార్ట్నర్ ఒకటి. మిగతా రెండు.. పిరమల్ గ్రూప్ మరియు ప్రైవేట్ ఈక్విటీ సంస్థ TPG. ఈ మూడింటికీ కలిపి 15 శాతం షేర్ ఉంది.

మరో 43 జిల్లాల్లో హాల్ మార్కింగ్

ఆభరణాలకు హాల్ మార్క్ ప్రమాణాలను పాటించడాన్ని కేంద్ర ప్రభుత్వం మరో 43 జిల్లాల్లో తప్పనిసరి చేయనుంది. ప్రస్తుతం ఈ నిబంధనలను దేశవ్యాప్తంగా 288 జిల్లాల్లో మాత్రమే అమలుచేస్తున్నారు. ఈ విషయాన్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ వెల్లడించారు. హాల్ మార్క్ ప్రమాణాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. తమ వద్ద రిజిస్టర్ చేసుకున్న ఆపరేటివ్ జ్యూలర్స్ సంఖ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13 వేల 737 పెరిగారని తెలిపారు.

యాపిల్ సీఈఓ ‘పే ప్యాకేజ్’ కట్

యాపిల్ సంస్థ CEO టిమ్ కుక్ ఈ సంవత్సరం అందుకోనున్న ‘‘పే ప్యాకేజ్’’ భారీగా తగ్గిపోనుంది. ఏకంగా 40 శాతం కోత పడనుండటంతో ఆయనకు 49 మిలియన్ డాలర్లు మాత్రమే అందనున్నాయి. టిమ్ కుక్ అభ్యర్థన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఆయన గతంలో ఏడాదికి సుమారు 99 మిలియన్ డాలర్ల ‘‘పే ప్యాకేజీ’’ తీసుకునేవారు. దీనిపై అప్పట్లో కొంత మంది ఇన్వెస్టర్ల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో టిమ్ కుక్ తనకుతానుగా శాలరీ తగ్గించుకున్నారని పేర్కొంటున్నారు. ఈ పరిణామం టెక్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

30, 31 తేదీల్లో ‘బ్యాంక్’ల సమ్మె

బ్యాంకుల ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకు ఈ నెల 30 మరియు 31 తేదీల్లో సమ్మెకు దిగనున్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధికారి ఒకరు చెప్పారు. నిన్న గురువారం ముంబైలో జరిగిన UFBU మీటింగులో తీర్మానం చేసినట్లు తెలిపారు. డిమాండ్ల సాకారం కోరుతూ ఎన్ని లెటర్స్ రాసినా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ నుంచి స్పందన లేకపోవటంతో నిరసన కొనసాగించాలని నిర్ణయించినట్లు వివరించారు.

ఐదేళ్లలో అగ్ర స్థానమే లక్ష్యం

వాహన తయారీ రంగంలో వచ్చే ఐదేళ్లలో ఇండియాని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలపటమే లక్ష్యమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. Auto Expo-2023లో నిన్న గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను సగానికి తగ్గించేందుకు వాహన తయారీ సంస్థలు భద్రతా సౌకర్యాలను పెంచాలని కోరారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్క్రాప్ పాలసీ వల్ల వాహన తయారీ సంస్థలకు ‘రా మెటీరియల్’ ఖర్చు 33 శాతం తగ్గుతుందని, సేల్స్ 10 శాతం పైగా పెరుగుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

79 % తగ్గిన బంగారం దిగుమతి

2022 డిసెంబర్ నెలలో మన దేశంలోకి బంగారం దిగుమతులు భారీగా తగ్గాయి. ఏకంగా 79 శాతం పడిపోయి కేవలం 20 టన్నులకు పరిమితమైంది. పసిడి దిగుమతులు ఇంత తక్కువగా జరగటం రెండు దశాబ్దాల్లో ఇదే తొలిసారని అధికార వర్గాలు తెలిపాయి. 2021 డిసెంబర్ నెలలో 95 టన్నుల పుత్తడి ఇంపోర్ట్ కావటం గమనించాల్సిన విషయం. 2022లో మొత్తమ్మీద 706 టన్నుల గోల్డ్ దిగుమతి అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రేట్లు పెరగటం, డిమాండ్ తగ్గటమే దిగుమతుల పతనానికి కారణమని పేర్కొంటున్నారు.

Show comments