NTV Telugu Site icon

Today (05-01-23) Business Headlines: ‘‘ఆకాశవాణి.. వార్తలు చదువుతోంది..’’. మరిన్ని న్యూస్

Today (05 01 23) Business Headlines

Today (05 01 23) Business Headlines

Today (05-01-23) Business Headlines

డార్విన్‌ బాక్స్‌కి రూ.40.5 కోట్లు

మానవ వనరుల సేవలు అందించే హైదరాబాద్‌ స్టార్టప్‌ డార్విన్‌ బాక్స్‌ తాజాగా దాదాపు 40 కోట్ల రూపాయలకు పైగా నిధులను సమీకరించింది. సిరీస్‌ డీ ఫండ్‌ రైజ్‌లో భాగంగా వీటిని సేకరించింది. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ ఫండ్స్‌ను సమకూర్చింది. ఏడేళ్ల కిందట స్థాపించిన డార్విన్‌ బాక్స్‌ ఇటీవలే యూనికార్న్‌ హోదా పొందిన సంగతి తెలిసిందే. ఈ కంపెనీ ఇప్పుడు 90 దేశాలకు చెందిన 700లకు పైగా సంస్థలతో కలిసి పనిచేస్తోంది. 20 లక్షల మంది యూజర్లను కలిగి ఉంది.

డీమార్ట్‌ ఆదాయం 11304 కోట్లు

డీమార్ట్ ఆదాయం గతేడాది 3వ త్రైమాసికంతో పోల్చితే ఈసారి దాదాపు 25 శాతం పెరిగింది. 2022లో.. అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌.. 3 నెలల్లో కలిపి 11 వేల 304 కోట్ల రూపాయలకు పైగా రెవెన్యూని సాధించింది. పోయినేడాది ఇదే సమయంలో 9 వేల 65 కోట్లకు పైగా రాబడిని నమోదు చేసింది. డీమార్ట్‌ పేరెంట్‌ కంపెనీ అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ లిమిటెడ్‌ ఈ వివరాలను వెల్లడించింది. రిటైల్ సూపర్ మార్కెట్లను నిర్వహిస్తున్న ఈ కంపెనీ ఇన్‌కం పెరిగినప్పటికీ వృద్ధి వేగం తగ్గింది. కిందటేడాది సెప్టెంబర్‌ త్రైమాసికం కన్నా ఈసారి సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 36 శాతం వృద్ధి నెలకొనగా అది డిసెంబర్‌ త్రైమాసికంలో పడిపోయింది.

ఫార్మెక్సిల్‌ చైర్మన్‌గా వీరమణి!

ఫార్మాస్యుటికల్స్ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా వైస్‌ చైర్మన్‌ ఎస్వీ వీరమణి చైర్మన్‌గా పదోన్నతి పొందినట్లు తెలుస్తోంది. చైర్మన్‌గా ఆయన బాధ్యతలు కూడా స్వీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఫార్మెక్సిల్‌ కమిటీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఈ మేరకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని సమాచారం. ఎస్వీ వీరమణి ఈ పదవిలో రెండేళ్ల పాటు ఉంటారు. సంస్థ రాజ్యాంగం ప్రకారం వైస్‌ చైర్మన్‌గా రెండేళ్ల పదవీ కాలాన్ని పూర్తిచేసిన వ్యక్తి ఆటోమేటిగ్గా చైర్మన్‌ అవుతారు. 2022 డిసెంబర్‌ 31 నాటికే ఎస్వీ వీరమణి ఈ అర్హత సాధించారు. 2024 డిసెంబర్‌ 31 వరకు ఫార్మెక్సిల్‌ చైర్మన్‌గా కొనసాగుతారు.

నష్టాల నుంచి లాభాల్లోకి పీఎస్‌బీలు

ఐదేళ్ల కిందట భారీ నష్టాల్లో కూరుకుపోయి అష్టకష్టాలు పడ్డ ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పుడు రికార్డు స్థాయి లాభాలను ఆర్జిస్తుండటం విశేషం. గత ఆర్థిక సంవత్సరంలో 66 వేల 539 కోట్ల రూపాయల ప్రాఫిట్స్‌ను సొంతం చేసుకున్న పీఎస్‌బీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా లక్ష కోట్ల రూపాయల లాభాలను కళ్లచూడనున్నాయనే అంచనాలు నెలకొన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు 2017-18 ఆర్థిక సంవత్సరంలో 85 వేల 390 కోట్ల రూపాయల నష్టాల్లో కొట్టుమిట్టాడాయి. అప్పట్లో 21 పీఎస్‌బీలకు గాను 11 పీఎస్‌బీల్లో ఆర్బీఐ సత్వర దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో దివాలా తీసే దశ నుంచి ఇప్పుడు మంచి పనితీరు కనబరుస్తున్నాయి.

ఆకాశవాణి, దూరదర్శన్‌లకు నిధులు

ఆకాశవాణి మరియు దూరదర్శన్‌ సేవలు మరింత విస్తరించనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం 2 వేల 539 కోట్ల రూపాయలకు పైగా నిధులను మంజూరు చేయనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి వీటిని ఖర్చుపెట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మారుమూల ప్రాంతాల వారికి 8 లక్షల డీడీ డీటీహెచ్‌ సెట్‌టాప్‌ బాక్స్‌లను ఫ్రీగా పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం దూరదర్శన్‌ పరిధిలో 36 టీవీ ఛానళ్లు, ఆలిండియా రేడియో పరిధిలో 500లకు పైగా ప్రసార కేంద్రాలు ఉన్నాయి. తాజాగా ప్రకటించిన ఫండ్స్‌తో దేశంలో 66 శాతం ఏరియాలకు, 80 శాతం ప్రజలకు ఈ ప్రభుత్వ రంగ ప్రసార మాధ్యమాల సేవలు అందుతాయి.

పన్ను బకాయిల వసూలుకు ఐటీ రెడీ

ఆదాయపు పన్ను బకాయిలు ఉన్నవారు తస్మాత్‌ జాగ్రత్త. ట్యాక్స్ అరియర్స్ వసూలుకు ఐటీ డిపార్ట్‌మెంట్‌ సమాయత్తమవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 19 పాయింట్‌ మూడు ఐదు ట్రిలియన్‌ రూపాయల బకాయిలు ఉండగా అందులో సుమారు 40 శాతం.. అంటే.. 7 పాయింట్‌ 7 ట్రిలియన్‌ రూపాయలకు పైగా కలెక్ట్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బ్యాక్‌లాగ్‌ను క్లియర్‌ చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ డిసెంబర్‌ 21న జరిగిన మీటింగ్‌లో చర్చించింది. 2 ట్రిలియన్‌ రూపాయలకు పైగా పన్నులను నగదు రూపంలో వసూలు చేయటంపై ఫోకస్‌ పెట్టాలని సూచించింది.