మొన్న జరిగిన తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ పని చేసిందనే కొందరు అంటున్నారు. పని చేస్తే మరి పవన్ కళ్యాణ్ మద్దతు పలికిన బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు డిపాజిట్ కూడా ఎందుకని దక్కలేదు అని ప్రశ్నించవచ్చు. అయితే ఇక్కడే ఉంది అసలు సంగతి. 2019 లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీఎస్పీ పార్టీతో పొత్తు పెట్టుకొని తన జనసేనతో ఎన్నికల బరిలోకి దిగారు. అప్పడు బీఎస్పీ పార్టీకి తిరుపతి లోక్ సభ సీటు పొత్తులో భాగంగా ఇచ్చారు. కానీ, అప్పట్లో పవన్ మద్దతు పలికిన బీఎస్పీకి కేవలం 20, 971 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో బీజేపీకి 16,125 మాత్రమే లభించాయి. అంటే పవన్ కళ్యాణ్ కారణంగానే బీజేపీ కంటే బీఎస్పీకి ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పుకున్నారు.
మొన్న ఏప్రిల్ 17న జరిగిన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 57,080 ఓట్లు పోగయ్యాయి. లెక్క చూస్తే 2019లో బీఎస్పీకి, బీజేపీకి కలిపి వచ్చిన ఓట్ల మొత్తం 37,096 మాత్రమే. అయితే ఇప్పుడు పవన్ ప్రచారం చేయగా, బీజేపీకి 57,080 ఓట్లు లభించాయి. అంటే పవన్ ఇమేజ్ పనిచేసినట్టే కదా! అంటున్నారు అక్కడి ఓటేసిన జనం. పైగా అప్పుడు బీఎస్పీ, బీజేపీ కంటే నోటాకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఇప్పుడు పవన్ కారణంగానే బీజేపీకి 5.17 శాతం ఓట్లు వచ్చాయని అభిమానుల మాట! మరి నిజమే కదా!
పవన్ ఇమేజ్… నిజమే కదా!
