Tirumala Vaikunta Dwara Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనుంది. ఇందుకు సంబంధించిన దర్శన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇవాళ ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఎల్లుండి ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనున్నారు.
డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు సర్వదర్శనం టోకెన్ల కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డిసెంబర్ 7వ తేదీన ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో సర్వదర్శనం టోకెన్లను కేటాయించనున్నారు. అలాగే డిసెంబర్ 8వ తేదీ ఉదయం 10 గంటలకు దాతల దర్శన టికెట్లను విడుదల చేయనున్నారు. భక్తులు నిర్ణీత తేదీలు, సమయాలను గమనించి ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. క్యూ లైన్లు వెలుపల శిలాతోరణం వరకు చేరుకున్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. ఇక శ్రీవారిని మొత్తం 63,645 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,029 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా శ్రీవారికి రూ.3.98 కోట్ల ఆదాయం లభించింది. వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో రానున్న రోజుల్లో తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.

