Tilak Varma: న్యూజిలాండ్‌తో క్రైస్ట్ చర్చ్ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత యువ బ్యాటర్ తిలక్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కివీస్ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్య ఛేదనలో ఒక దశలో టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో జట్టును ఆదుకున్న తిలక్ వర్మ.. కోచ్ గౌతమ్ గంభీర్ తనతో చెప్పిన మాటలే తన ఇన్నింగ్స్‌ను పూర్తిగా మార్చేశాయని మ్యాచ్ అనంతరం భావోద్వేగంతో పంచుకున్నాడు.
మ్యాచ్‌కు ముందు డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్ గౌతమ్ గంభీర్, కోటక్ తనతో మాట్లాడుతూ “మొత్తం దేశం, మేమందరం నీపై పూర్తి నమ్మకం ఉంచాం. నువ్వు క్రీజులో చివరి వరకు నిలబడితే మ్యాచ్ గెలిపించి వస్తావు” అని భరోసా కల్పించారని తిలక్ గుర్తు చేసుకున్నాడు. ఆ మాటలే తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, మ్యాచ్‌ను ఆఖరి వరకు తీసుకెళ్లేలా చేశాయని తెలిపాడు. పిచ్ నెమ్మదిగా ఉండటంతో నమన్ ధీర్‌తో కలిసి స్పిన్నర్లపై బౌండరీలు బాదడంతో పాటు, వీలైనన్ని ఎక్కువ డబుల్స్ తీయాలని ప్లాన్ చేసినట్లు చెప్పాడు. వీరిద్దరూ కలిసి నాలుగు, ఐదుసార్లు రెండు పరుగులు తీయడం జట్టు విజయానికి ఎంతో దోహదపడింది. చివర్లో నితీష్ కుమార్ రెడ్డితో కలిసి ఇన్నింగ్స్‌ను విజయవంతంగా ముగించిన తిలక్, మైదానంలో హైదరాబాద్ కుర్రాళ్ల జోరు సాగిందని సరదాగా నవ్వుతూ చెప్పాడు. కష్ట సమయాల్లో కోచ్ అందించిన నైతిక స్థైర్యం, ప్రణాళికాబద్ధమైన బ్యాటింగ్‌తో తిలక్ వర్మ భారత్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు.

