Tilak Varma: ఎలాంటి మాటల్లేవ్.. నేను చూసిన ‘ది బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే’..! వైభవ్ పై కెప్టెన్ ప్రశంసలు..

Tilak Varma

Tilak Varma

Tilak Varma: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ విధ్వంసంపై భారత్-A కెప్టెన్ తిలక్ వర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడి ఇన్నింగ్స్‌ను వర్ణించడానికి తన దగ్గర మాటలు లేవని, అక్షరాలా విధ్వంసం సృష్టించాడని కొనియాడాడు. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ ఆడిన తీరు అద్భుతమని, తాను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల్లో ఇదొకటని పేర్కొన్నాడు.

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నీలో భాగంగా మంగళవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ (53 బంతుల్లో 204; 7 ఫోర్లు, 28 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతడి విధ్వంసకర బ్యాటింగ్‌తో 250 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్-A కేవలం 14.2 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ క్రమంలో వైభవ్ 28 బంతుల్లోనే సెంచరీ, 52 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేసి రికార్డులు సృష్టించాడు.

మ్యాచ్ అనంతరం వైభవ్ ఇన్నింగ్స్‌పై స్పందించిన తిలక్ వర్మ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘వైభవ్ గురించి చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. అతను అక్షరాలా విధ్వంసం సృష్టించాడు. అతడి బ్యాటింగ్ చూస్తుంటే తొలి ఐదు ఓవర్లలోనే మ్యాచ్ ఫలితం తేలిపోయినట్లు అనిపించింది. ఐదు ఓవర్లలోనే మేము 100 పరుగులు చేశాం. ఆ తర్వాత కూడా అతను అదే జోరును కొనసాగించడం అద్భుతం’ అని తెలిపాడు. డగౌట్‌లో ఉన్న ఆటగాళ్లంతా వైభవ్ బ్యాటింగ్‌ను ఎంతో ఆస్వాదించారని తిలక్ వెల్లడించాడు. ‘అతను ఎంత బలంగా సిక్సర్లు కొట్టగలడో మాకు తెలుసు. అందుకే అతను భారీ షాట్లు ఆడుతున్నప్పుడు అందరం మారో.. మారో.. సిక్స్ కొట్టు అంటూ అరుస్తూ ఎంజాయ్ చేశాం. బంతి ఫోర్ వెళ్లినా పెద్దగా పట్టించుకోలేదు. సిక్స్ కొట్టాడా? లేదా? అని మాత్రమే అడిగేవాళ్లం. డగౌట్‌లో అలాంటి వాతావరణం నెలకొంది. చూడటానికి ఎంతో అద్భుతమైన ఇన్నింగ్స్ అది’ అని ప్రశంసించాడు.

ఇక తన తొలి మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు తీసిన అర్షద్ ఖాన్‌ను కూడా తిలక్ అభినందించాడు. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై బౌన్సర్లను సమర్థంగా ఉపయోగించుకుంటూ.. లైన్ అండ్ లెంగ్త్ మార్చి బౌలింగ్ చేయడం ఆకట్టుకుందని చెప్పాడు. అర్షద్ ప్రదర్శన రాబోయే మ్యాచ్‌ల్లో జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని, అతడి ఆత్మవిశ్వాసం పెరగడానికి ఈ మ్యాచ్ దోహదపడుతుందని పేర్కొన్నాడు. మరోవైపు తన స్థానంలో రింకూ సింగ్‌ను ముందుగా బ్యాటింగ్‌కు పంపడానికి గల కారణాన్ని కూడా తిలక్ వివరించాడు. తన ఎడమవైపు కండరాలు పట్టేయడంతో సెమీఫైనల్‌కు ముందు ఎలాంటి రిస్క్ తీసుకోవాలనుకోలేదని చెప్పాడు. అంతేకాకుండా గత కొన్ని మ్యాచ్‌లుగా రింకూకు బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోవడంతో అతడికి ప్రాక్టీస్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.

అలాగే సెమీఫైనల్ పోరుకు తాము సిద్ధంగా ఉన్నామని తిలక్ వర్మ స్పష్టం చేశాడు. యూఏఈపై సాధించిన భారీ విజయం బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టుకు మంచి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందన్నాడు. సెమీఫైనల్‌లోనూ ఇదే జోరు కొనసాగించి విజయం సాధించడమే తమ లక్ష్యమని పేర్కొన్నాడు.