NTV Telugu Site icon

Tilak Varma Century: వరుసగా మూడో సెంచరీ.. తొలి బ్యాటర్‌గా తిలక్ వర్మ రికార్డు!

Tilak Varma Century

Tilak Varma Century

హైదరాబాద్ ఆటగాడు, టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20ల్లో వరుసగా మూడు సెంచరీలు బాదిన తొలి బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ ట్రోఫీ 2024లో భాగంగా ఈరోజు జరిగిన మ్యాచులో మేఘాలయపై తిలక్ సెంచరీ చేశాడు. హైదరాబాద్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన తిలక్.. 67 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో 151 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు.

ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌ల్లో తిలక్ వర్మ సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే. మూడు, నాలుగు టీ20ల్లో వన్‌డౌన్‌లో వచ్చిన తెలుగు కుర్రాడు 107, 120 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. తాజాగా సయ్యద్ ముస్తాక్ ట్రోఫీ 2024లో భాగంగా మేఘాలయపై శతకం బాదాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్‌ అయ్యర్ వ్యక్తిగత స్కోర్‌ను తిలక్ అధిగమించాడు. సయ్యద్ ముస్తాక్ ట్రోఫీ 2019లో శ్రేయస్‌ సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో 55 బంతుల్లో 147 రన్స్ చేశాడు. టీ20ల్లో 150కి పైగా స్కోరు చేసిన తొలి భారత బ్యాటర్‌గానూ నిలిచాడు.

Also Read: Black Friday Sale 2024: ఫ్లిప్‌కార్ట్‌లో ‘బ్లాక్‌ ఫ్రైడే సేల్‌’.. డేట్స్, ఆఫర్స్ ఇవే!

తిలక్‌ వర్మ సెంచరీ బాదడంతో హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 248/4 స్కోరు చేసింది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (55) హాఫ్ సెంచరీ చేయగా.. రాహుల్ బుద్ది (30) ఫర్వాలేదనిపించాడు. లక్ష్య ఛేదనలో మేఘాలయ 69 పరుగులకే ఆలౌట్ అయింది. అనికేత్ రెడ్డి (4/11), తన్మయ్ త్యాగరాజన్ (3/15) నిప్పులు చెరిగారు. హైదరాబాద్‌ 179 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో 38 జట్లు 5 గ్రూప్‌లుగా పాల్గొంటున్నాయి. గ్రూప్‌-ఏలో హైదరాబాద్ టీమ్ ఉంది.