Medak Ddistrict: మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఎర్ర బ్యానర్‌తో ఉన్న ఓ లేఖ కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు మున్సిపల్ ప్రధాన గేటుకు APTH అలెగ్జాండర్ పేరుతో ఉన్న ఈ హెచ్చరిక లేఖను అంటించారు. ఇటీవల పదిమంది విప్లవ యోధులకు ఉరిశిక్ష విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన సమయంలో తాము మొదటి లేఖ విడుదల చేశామని, ఇప్పుడు ఇది రెండవ లేఖ అని వెల్లడించారు. ప్రజా ఉద్యమాలను అణిచివేయడానికి ప్రస్తుత ప్రభుత్వం న్యాయవ్యవస్థను ఒక ఆయుధంగా వాడుకుంటోందని అందులో తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజా పోరాటాలను ఎంతగా అణిచివేయాలని చూస్తే, పోరాటం అంతే తీవ్రమవుతుందని లేఖ ద్వారా హెచ్చరించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర అస్వస్థత, ఆందోళన వాతావరణం నెలకొంది.
10 మందిని నక్సలైట్స్‌కు ఉరిశిక్ష..
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా జగదల్‌పూర్‌లో ఉన్న ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు 2013 నాటి సంచలనాత్మక ఝిరమ్ వ్యాలీ నక్సలైట్ దాడి కేసులో ఇటీవల చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. మొత్తం 29 మంది ప్రాణాలు తీసిన ఈ దాడి కేసులో దోషులుగా తేలిన 10 మందికి ప్రత్యేక న్యాయమూర్తి అభయ్ సింగ్ రాజ్‌పుత్ మరణశిక్ష ఖరారు చేశారు. సెప్టెంబర్ 16న వెలువడిన ఈ తీర్పులో ఇద్దరు మహిళలు సహా 10 మందిని దోషులుగా నిర్ధారించినట్లు డిఫెన్స్ లాయర్ అరవింద్ చౌదరి తెలిపారు. విచారణ సమయంలో కోర్టు మొత్తం 101 మంది సాక్షులను విచారించింది. మరణశిక్ష పడిన దోషుల్లో ప్రమీలా మోడియం, చైతు లేకమ్ అలియాస్ మున్నా, సుమిత అలియాస్ పూనెం మోడియం, ముక్కా మాండ్వి, కోసా కవాసి అలియాస్ కొసారం, అయితా మార్కం, మడ్కామి దేవా, జోగా మద్కామి, బంజమి సన్నా అలియాస్ చమ్రు, మహదేవ్ నాగ్‌లు ఉన్నారు. ఈ కేసులో ఉన్న 11వ నిందితుడు విచారణ సాగుతుండగానే మరణించాడు.
దేశంలోనే అత్యంత ఘోరమైన వామపక్ష తీవ్రవాద దాడులలో ఒకటిగా నిలిచిన ఈ ఘటన 2013 మే 25న చోటుచేసుకుంది. బస్తర్ జిల్లా దర్భా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఝిరామ్ లోయ వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘పరివర్తన్ ర్యాలీ’ కాన్వాయ్‌పై నక్సలైట్లు మెరుపుదాడి చేశారు. కాన్వాయ్‌లో ఉన్న ఎర్రటి బొలెరో వాహనం కింద ల్యాండ్‌మైన్‌ను పేల్చడంతో అక్కడ 5 అడుగుల లోతైన గొయ్యి ఏర్పడింది. అలాగే ట్రక్కును అడ్డంగా పెట్టి రహదారిని మూసివేసి, దాదాపు రెండు గంటల పాటు 20 వాహనాల కాన్వాయ్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ గ్రెనేడ్లు విసిరారు. ఈ దుర్ఘటనలో కాంగ్రెస్ నాయకులు, భద్రతా సిబ్బంది, పౌరులు కలిపి 20 మంది మరణించగా, 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి ఆ సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ అగ్ర నాయకత్వాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. మరణించిన వారిలో అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నంద్ కుమార్ పటేల్, ఆయన కుమారుడు దినేష్, అసెంబ్లీ మాజీ ప్రతిపక్ష నాయకుడు మహేంద్ర కర్మా, మాజీ కేంద్ర మంత్రి విద్యా చరణ్ శుక్లా, మాజీ ఎమ్మెల్యే ఉదయ్ ముద్లియార్ వంటి ప్రముఖులు ఉన్నారు. దశాబ్దానికి పైగా సాగిన న్యాయ విచారణ అనంతరం 10 మందికి ఉరిశిక్ష ఖరారైనప్పటికీ, దోషుల తరఫు న్యాయవాదులు ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేయనున్నట్లు తెలిపారు.

