NTV Telugu Site icon

జీఎస్టీలో ఇకపై మూడు శ్లాబులు !

GST

GST

జీఎస్టీ రేట్లను రేషనలైజ్‌ చేయాలంటూ చాలా రోజులుగా ప్రజలను నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. వ్యాపారవర్గాలు కూడా ఈ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరుతూనే ఉన్నాయి. అలాంటివారందరికీ కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ తీపి కబురు చెప్పారు. ప్రభుత్వ అజెండాలో జీఎస్టీ రేట్ల రేషనలైజేషన్‌ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఐదు శ్లాబ్స్‌లో ఉన్న జీఎస్టీ రేట్లను మూడు స్లాబ్స్‌కు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. జీఎస్టీలో మూడు రేట్ల వ్యవస్థ చాలా ముఖ్యం.

ప్రస్తుతం జీఎస్టీలో 0.25 శాతం, 5 శాతం, 12 శాతం, 1 శాతం, 28 శాతం స్లాబ్స్‌ ఉన్నాయి. వీటిని మూడు స్లాబులుగా తీసుకొచ్చే ప్రతిపాదన ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఎక్సైజ్‌ పన్ను, సేవా పన్ను, వ్యాట్‌ లాంటి పదికిపైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ట్యాక్స్‌లను కలిపి.. జీఎస్టీగా 2017 జులైలో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అయితే అప్పటి నుంచే స్లాబ్స్‌ మార్పు గురించి చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా సుబ్రమణియన్‌ వ్యాఖ్యలతో దీనిపై కేంద్రం ఆలోచన చేస్తోందనే విషయం బయటపడింది. త్వరలో జీఎస్టీ మూడు స్లాబుల విధానంపై కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటన చేయనుంది. దీనికి సంబంధించి విధి విధానాలు రూపొందించనుంది.