Azharuddin: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఈ నెల 25న హైదరాబాద్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ను కళ్లారా వీక్షించాలని కలలు గన్న హైదరాబాద్ క్రికెట్ ప్రేమికులకు కష్టాలు తప్పలేదు. జింఖానా మైదానంలో టికెట్లు విక్రయం జరుగుతుందనే ఆశతో వచ్చిన అభిమానులకు నిరాశ ఎదురైంది. టికెట్లు దొరకకపోవడంతో పాటు తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటకు కారణం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషనే కారణమని గాయపడిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో అజారుద్దీన్ సహా హెచ్‌సీఏ నిర్వాహకులపై మూడు కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ యాక్ట్ తో పాటు 420, 21,22/76 పలు సెక్షన్ల కిందబేగంపేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. టికెట్ల నిర్వహణతో పాటు వాటిని బ్లాక్‌లో అమ్ముకున్నారని ఆరోపణలతో పాటు.. తొక్కిసలాటకు ప్రధాన కారణం హెచ్‌సీఏ నిర్లక్ష్యం వహించడమే కారణమని చికిత్స పొందుతున్న వారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
HCA President Azharuddin: టికెట్స్ అన్ని అమ్ముడుపోయాయి.. ఆన్‌లైన్‌లో అమ్మడానికి లేవు..
గురువారం ఉదయం 7 గంటల నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయని హెచ్‌సీఏ తొలుత ప్రకటించింది. దీంతో టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు తెల్లవారుజాము నుంచే జింఖానా స్టేడియానికి చేరుకుని పడిగాపులు కాశారు. మూడు వేల టికెట్ల కోసం 30వేల మందికి పైగా అభిమానులు తరలివచ్చారు. మహిళలు కూడా టికెట్స్ కోసం క్యూలైన్లలో నిలబడ్డారు. అయితే అంచనాలకు మించి అభిమానులు తరలిరావడంతో పాటు.. టికెట్ల కోసం ఎగబడటంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. గేటు వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ స్పృహకోల్పోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అలాగే తొక్కిసలాటలో పలువురు అభిమానులు గాయపడగా… పోలీసులు కూడా స్వల్పంగా గాయపడ్డారు. ఈ క్రమంలో పరిస్థితిని అదుపు చేసేందుకు అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పలువురు అభిమానులు గాయపడ్డారు. ఆగ్రహంతో అజారుద్దీన్‌తో పాటు హెచ్‌సీఏ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదులు చేశారు.