The Paradise Collections: నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ది పారడైస్’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. విడుదలకు ముందే నాని డిఫరెంట్ లుక్, యాక్షన్ ఎపిసోడ్లు, ఇంతకుముందెన్నడూ చూడని నేపథ్యం సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. వీటికి తోడు అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం, మోహన్ బాబు పోషించిన క్రూరమైన విలన్ పాత్ర సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చాయి.
అయితే ప్రీమియర్స్ అనంతరం ఈ సినిమాపై ఊహించని స్థాయిలో నెగిటివ్ ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలోనూ సినిమాకు వ్యతిరేకంగా పలు పోస్టులు వైరల్ అయ్యాయి. తొలి రోజు డిజాస్టర్ టాక్ వచ్చిందంటూ ప్రచారం జరిగినప్పటికీ.. ఈ ప్రభావం బాక్సాఫీస్ వసూళ్లపై పెద్దగా కనిపించలేదు. ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టడంతో కలెక్షన్లు భారీగా నమోదయ్యాయి.
ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచేలా ‘ది పారడైస్’ వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం ఒకవైపు కొనసాగుతున్నప్పటికీ, థియేటర్లలో ప్రేక్షకుల స్పందన మరోలా ఉండటం విశేషంగా మారింది. బాక్సాఫీస్ వద్ద సినిమా జోరు చూస్తుంటే నెగిటివ్ టాక్‌ను వసూళ్లతోనే తిప్పికొడుతున్నట్లు కనిపిస్తోంది. విడుదలైన కేవలం 11 రోజుల్లోనే ‘ది పారడైస్’ ప్రపంచవ్యాప్తంగా రూ.186 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర బృందం పేర్కొంది. అంతేకాకుండా ఇప్పటికే 97% వరల్డ్‌వైడ్ రికవరీని పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఇదే జోరు కొనసాగితే సినిమా త్వరలోనే రూ.200 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.
మొత్తంగా చూస్తే విమర్శలు, నెగిటివ్ ప్రచారాన్ని పక్కనపెట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. ఈ విజయంతో నాని మరోసారి తన బాక్సాఫీస్ స్టామినాను నిరూపించుకున్నారని అభిమానులు, ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

