NTV Telugu Site icon

Telangana BJP: రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు!.. బరిలో ఈ ముగ్గురు..!

Telangana Bjp

Telangana Bjp

Telangana BJP: రాష్ట్ర బీజేపీకి త్వరలో కొత్త నాయకుడు వస్తారా? ఈ ప్రశ్నకు పార్టీల నుంచి అవుననే సమాధానం వస్తోంది. బండి సంజయ్ స్థానంలో ప్రస్తుత అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డిని నియమించినప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు మాత్రమే ఈ బాధ్యతలు నిర్వహిస్తానని జాతీయ నాయకత్వానికి స్పష్టం చేసినట్లు సమాచారం. జాతీయ నాయకత్వం కూడా సానుకూలంగా స్పందించిందని చెబుతున్నారు. అయితే అధిష్టానం ఒత్తిడితో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి ఇటీవలి ఎన్నికల ఫలితాల దృష్ట్యా కూడా లోక్ సభ ఎన్నికల వరకు కొనసాగేందుకు సుముఖంగా లేరని అంటున్నారు. ప్రస్తుతం, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లకు సీఎంలను నియమించే పనిలో బీజేపీ అగ్ర నాయకత్వం ఉంది. దీంతో పాటు పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నందున తెలంగాణలో బీజేపీ సాధించిన ఫలితాలు, ఇతర పరిణామాలను జాతీయ నాయకత్వం పెద్దగా పట్టించుకోవడం లేదని అంటున్నారు. అయితే ఆ మూడు రాష్ట్రాలకు సీఎంల ఎంపికపై స్పష్టత వచ్చి ప్రమాణ స్వీకారం చేయగానే రాష్ట్ర అధ్యక్ష పదవికి కిషన్ రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ముందుగా రాజీనామా సమర్పించాలని, ఆ తర్వాత ముందుకు వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

Read also: Bigg Boss 7 Telugu: తారుమారైన ఓటింగ్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనా?

జాతీయ పార్టీకి లోక్‌సభ ఎన్నికలు కీలకం కావడం, ఈ ఎన్నికల్లో తెలంగాణ నుంచి గతంలో గెలిచిన నాలుగు సీట్ల కంటే ఎక్కువ సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవడంతో ప్రస్తుతం రాష్ట్ర నాయకత్వ మార్పు సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లోక్ సభ ఎన్నికలు ముగిసే వరకు కిషన్ రెడ్డి కొనసాగే అవకాశం ఉందని కొందరు నేతలు చెబుతున్నారు. అయితే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలై కేవలం 8 స్థానాలకే పరిమితం కావడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆ పార్టీ ముఖ్య నేతలకు ఊరట లభించిందని అంటున్నారు. మరోవైపు తన సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్కటి కూడా బీజేపీ గెలవకపోవడంతో.. ముందుగా తన నియోజకవర్గంలో పరిస్థితిని చక్కదిద్దాలని కిషన్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగేందుకు ఆయన అంగీకరించకపోవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే కిషన్ రెడ్డి రాజీనామా అనంతరం ఆ పదవిలో మళ్లీ బండి సంజయ్‌ లేదా ఈటల లేదా అర్వింద్‌ నిర్వహించే ఆలోచనలో బీజేపీ అధిషానం వున్నట్లు సమాచారం. అయితే బండి సంజయ్ కే ఎక్కువ అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నారు.
Bigg Boss 7 Telugu: తారుమారైన ఓటింగ్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనా?

Show comments