NTV Telugu Site icon

Indian ICC Presidents: ఇప్పటి వరకు ఎంతమంది భారతీయులు ICC ప్రెసిడెంట్ అయ్యారంటే..

Icc Presidents India

Icc Presidents India

Indian ICC Presidents: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రెసిడెంట్ గ్రెగ్ బార్క్లే స్థానంలో జే షాను నియమించవచ్చు అనే వార్తలు ప్రస్తుతం మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కూడా అతనికి మద్దతుగా నిలిచాయని సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే ఐసీసీ చరిత్రలో భారత్ నుంచి షా 5వ వ్యక్తిగా ఐసీసీ ప్రెసిడెంట్ అవుతారు. ప్రస్తుతం అతను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ పరిస్థితిలో, ఐసీసీ చరిత్రలో భారత అధ్యక్షుల గురించి ఒకసారి చూద్దాం.

జగ్మోహన్ దాల్మియా (1997–2000) :

భారతదేశం నుండి మొదటి ఐసీసీ అధ్యక్షుడుగా జగ్మోహన్ దాల్మియా చరిత్ర సృష్టించారు. ఆయన ఈ పదవిలో 1997 నుండి 2000 వరకు కొనసాగారు. దీని తర్వాత 2001లో దాల్మియా ఏసీ ముత్తయ్యను ఓడించి బీసీసీఐ అధ్యక్షుడయ్యారు. దాల్మియా కారణంగానే 1987లో రిలయన్స్ ప్రపంచకప్‌ ను, 1996లో విల్స్ ప్రపంచకప్‌ను భారత్ సహ ఆతిథ్యమిచ్చింది. బీసీసీఐని ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా మార్చడంలో అతనిది పెద్ద పాత్ర. బెంగాల్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు.

శరద్ పవార్ (2010-2012) :

2010లో భారత రాజకీయ నాయకుడు శరద్ పవార్ ఐసీసీ అధ్యక్షుడయ్యాడు. అతను ఇంగ్లండ్‌ కు చెందిన డేవిడ్ మోర్గాన్ స్థానంలో ఎన్నికయ్యారు. అతను 2 సంవత్సరాలు ఈ పదవిలో కొనసాగాడు. ఆ సమయంలో ఆయన భారత ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. పవార్ 2008 నుంచి ఐసీసీ వైస్ ప్రెసిడెంట్‌ గా కూడా ఉన్నారు. పవార్ 2005 నుంచి 2008 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. 2004 నుంచి 2005 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న రణబీర్ సింగ్ మహేంద్ర స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.

ఎన్. శ్రీనివాసన్ (2014–2015) :

ఈ జాబితాలో ఎన్. శ్రీనివాసన్ మూడో స్థానంలో నిలిచారు. అతని పదవీకాలం 2014 నుండి 2015 వరకు ఉంది. అదే సమయంలో చైర్మన్ పదవిని తొలగించి చైర్మన్‌ గా మార్చారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) కి శ్రీనివాసన్ యజమాని కూడా.

శశాంక్ మనోహర్ (2015-2020) :

ఈ జాబితాలో శశాంక్ మనోహర్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఐసీసీలో అతని పదవీకాలం 2015 నుండి 2020 వరకు కొనసాగింది. ఇది ఏ భారతీయుడికైనా సుదీర్ఘమైన పదవీకాలం. ఐసీసీ చైర్మన్ పదవికి శశాంక్ స్వయంగా రాజీనామా చేశారు. 2008 నుంచి 2011 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. బిసిసిఐలో శశాంక్ మొదటి టర్మ్ 2008 నుండి 2011 వరకు, అతని రెండవ టర్మ్ అక్టోబర్ 2015 నుండి మే 2016 వరకు చేసారు.