NTV Telugu Site icon

Hydrogen Train : మార్చిలో పట్టాలెక్కనున్న నీటితో నడిచే రైలు..

Hydrogen Train

Hydrogen Train

వందేభారత్, అమృత్ భారత్ రైళ్ల తర్వాత భారతీయ రైల్వే మరో ప్రత్యేక రైలును నడపబోతోంది. దీని ప్రత్యేకత ఏమిటంటే దీనికి కరెంట్‌ గానీ, డీజిల్‌ కానీ అవసరం లేదు. వాటికి బదులుగా రైలు ‘నీటి’తో నడుస్తుంది. మొదటి రైలు మార్గాన్ని కూడా పైలట్ ప్రాజెక్ట్‌గా నిర్ణయించారు. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం.. దేశంలో 2025 మార్చిలో హైడ్రోజన్‌ రైళ్లు ప్రజలకు సేవలందించనున్నాయి. భారతీయ రైల్వే దేశంలో హైడ్రోజన్ రైళ్లను నడపబోతోంది. ఒక చక్రానికి 360 కిలోల హైడ్రోజన్ ఇంజిన్‌లో నింపబడుతుంది. హైడ్రోజన్ ప్లాంట్ నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

గరిష్ట వేగం గంటకు 140 కి.మీ..
గంటకు 40 లీటర్ల నీరు దీనికి అవసరమవుతుంది. గరిష్టంగా గంటకు 140 కి.మీ వేగం వరకు ప్రయాణిస్తుంది. తక్కువ శబ్దంతో నడిచే ఈ రైలులో ఒకసారి పూర్తిగా ఇంధనం నింపితే 1,000 కి.మీ దూరం వెళ్తుంది. చెన్నైలోని ఐసీఎఫ్‌లో ఇప్పటివరకు 175 రకాల 600 డిజైన్‌లలో రైలు బోగీలను విజయవంతంగా తయారు చేశారు. దీని గురించి ఐసీఎఫ్‌ అధికారులు మాట్లాడుతూ.. “డీజిల్‌, విద్యుత్తు తర్వాత మొదటిసారిగా హైడ్రోజన్‌ రైలును దేశంలో తమారు చేస్తున్నారు. హైడ్రోజన్‌ ఇంధనంగా ఉపయోగించి నడుపుతున్న ఈ రైలు ఇంజిన్‌ నుంచి నీటి ఆవిరి మాత్రమే బయటికి వస్తుంది. అందువల్ల వీటితో పర్యావరణానికి ఇబ్బంది ఉండదు. మొదట్లో తయారీ ఖర్చు కొంచెం ఎక్కువైనా డీజిల్, విద్యుత్తు రైళ్లతో పోల్చితే హైడ్రోజన్‌ రైళ్లను నడపడానికి ఖర్చు తక్కువే.” అని తెలిపారు.

2030 నాటికి జీరో కార్బన్‌ దిశ అడుగులు..
భారతీయ రైల్వేలు 2030 నాటికి జీరో కార్బన్‌ దిశగా పని చేస్తున్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ దిలీప్ కుమార్ ఇటీవల తెలిపారు. హైడ్రోజన్ ఇంధనంగా ఉపయోగించబడుతుంది. ప్రాజెక్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్, మౌలిక సదుపాయాల పనులు పైలట్ ప్రాజెక్ట్‌గా జరుగుతున్నాయి. దీని పరీక్ష విజయవంతమైంది. సెల్, హైడ్రోజన్ ప్లాంట్ రూపకల్పన ఆమోదించబడింది. హైడ్రోజన్ భద్రతకు సంబంధించి గ్లోబల్ ఏజెన్సీలు ఆమోదం తెలిపాయి. భారతీయ రైల్వేలు హైడ్రోజన్ ఇంధనం కోసం ఇప్పటికే ఉన్న డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ల (DEMU) రెట్రో ఫిట్‌మెంట్ పనిని ప్రదానం చేసింది. ఐసీఎఫ్ చెన్నైలో ప్రోటోటైప్ రైలును తయారు చేయడానికి ప్రణాళిక సిద్ధంగా ఉంది.