Site icon NTV Telugu

Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ల పూర్తి డేటా అప్‌లోడ్ చేసిన ఈసీ

Sbe

Sbe

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించిన ఎలక్టోరల్ బాండ్ల డేటాను భారత ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఎన్నికల బాండ్ల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేయడంతో భారతీయ స్టేట్ బ్యాంక్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సీరియల్‌ నంబర్లతో సహా బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి గురువారం అందజేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కూడా అఫిడవిట్ దాఖలు చేసింది.

సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను ఎలక్షన్‌ కమిషన్‌కు గురువారం అందజేసింది. భద్రతా కారణాల దృష్ట్యా బ్యాంకు ఖాతాల నంబర్లు, కేవైసీ వివరాలను మాత్రం బహిర్గతం చేయలేదని ఎస్‌బీఐ పేర్కొంది.

ఎన్నికల బాండ్లను రద్దు చేస్తూ ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గత ఐదేళ్లలో జారీ చేసిన బాండ్ల వివరాలను ఈసీకి అందించాలని ఎస్‌బీఐని ఆదేశించింది. ఆ సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన బ్యాంకు.. బాండ్ల ఆల్ఫా న్యూమరిక్‌ నంబర్లను మాత్రం బయటపెట్టలేదు. ఏ వ్యక్తి/సంస్థ బాండ్లను ఏ పార్టీకి విరాళంగా ఇచ్చారని తెలిపే ఈ నంబర్లు లేకపోవడంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం బ్యాంకు తీరుపై అసహనం వ్యక్తంచేసింది. ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలను ఈసీకి ఇచ్చేశామని చెబుతూ మార్చి 21 సాయంత్రం 5 గంటల్లోగా సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఎస్‌బీఐ ఛైర్మన్‌ను ధర్మాసనం ఆదేశించింది. ఈ క్రమంలోనే బ్యాంకు వివరాలన్నీ ఈసీకి సమర్పించింది. ప్రస్తుతం అన్ని వివరాలను ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది.

ఇది కూడా చదవండి: Naslen Gafoor: మహేష్ బాబు,ప్రభాస్ సరసన మలయాళ కుర్ర హీరో..

Exit mobile version