Chardham Yatra 2024: భూ వైకుంఠంలో వెలసిన విష్ణుమూర్తి నివాసమైన బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరవబడ్డాయి. ఈరోజు ఉదయం 6 గంటలకు ఆర్మీ బ్యాండ్ మేళవింపుల నడుమ సంపూర్ణ ఆచారాలు, వేద మంత్రోచ్ఛారణలు, బద్రీ విశాల్ లాల్ కీ జై అనే నినాదాలతో భక్తుల కోసం బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరవబడ్డాయి. దీంతో చార్‌ధామ్ యాత్ర పూర్తి రూపం సంతరించుకుంది. బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి ఆలయాన్ని 15 క్వింటాళ్ల పూలతో ఘనంగా అలంకరించింది.
చేరుకున్న 5వేల మంది యాత్రికులు
శనివారం సాయంత్రం నాటికి ఐదు వేల మందికి పైగా యాత్రికులు బద్రీనాథ్ ధామ్‌కు చేరుకున్నారు, అయితే 15 వేలకు పైగా యాత్రికులు వివిధ స్టాప్‌లలో ఉన్నారు. గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్ ధామ్‌ల తలుపులు శుక్రవారం తెరుచుకున్నాయి. శనివారం తెల్లవారుజామున భగవాన్ బద్రీ నారాయణ్ ప్రతినిధి ఉద్ధవ్‌జీ, దేవుని కోశాధికారి కుబేర్‌జీ, గరుడ మహారాజుల పల్లకీతో పాటు ఆదిశంకరాచార్యుల గడ్డి, గడు ఘర (నూనె కలశం) యాత్ర పాండుకేశ్వర్‌లోని యోగా ధ్యాన్ బద్రీ ఆలయం నుంచి బద్రీనాథ్ ధామ్‌కు చేరుకుంది.సంప్రదాయం ప్రకారం ఉదయం ఐదు గంటలకు ఆలయ ప్రధాన అర్చకులు రావల్ ఈశ్వర్ ప్రసాద్ నంబూద్రి, ధర్మాధికారి, వేదపతి పూజ చేసి ఆలయ తలుపులు తెరిచారు. ప్రధాన అర్చకుడు ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించి, అక్కడ ఉన్న లక్ష్మీ దేవి విగ్రహాన్ని పరిక్రమ స్థలంలో ఉన్న లక్ష్మీ ఆలయంలో ఉంచుతారు. అనంతరం బద్రీ నారాయణుడిని అలంకరించి పూజలు నిర్వహించారు.
Read Also: Rain Alert: ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
సాంప్రదాయం ప్రకారం, జోషిమత్ నుండి 25 కి.మీ దూరంలో ఉన్న తపోవన్‌లో ఉన్న భవిష్య బద్రీ ధామ్, ఉర్గామ్ లోయలో ఉన్న బన్షీ నారాయణ్ తలుపులు కూడా బద్రీనాథ్ ధామ్‌తో పాటు తెరుచుకున్నాయి. దీనితో పాటు బద్రీనాథ్ ధామ్ ఆలయంలో ఉన్న గణేష్, ఘంటాకర్ణాజీ, ఆది కేదారేశ్వర్, ఆది గురు శంకరాచార్య ఆలయం, మాతా మూర్తి ఆలయాల తలుపులు కూడా తెరుచుకున్నాయి.
చలికాలంలో పూజ్యమైన బద్రీనాథ్ ధామ్ మూసి ఉంటుంది. చమోలి జిల్లాలో ఉన్న బద్రీనాథ్ ఆలయం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్‌లతో పాటు చార్-ధామ్ అని పిలువబడే నాలుగు పురాతన పుణ్యక్షేత్రాలలో బద్రీనాథ్ ఒకటి. ఆరు నెలల పాటు భక్తుల కోసం తెరిచి ఉంచుతారు. సముద్రమట్టానికి మూడు వేల 133 మీటర్ల ఎత్తులో భద్రీనాథ్ ఆలయం ఉంది. ఇక్కడ తీర్ధయాత్ర సాధారణంగా ఏప్రిల్ చివరలో లేదా మే నెల ప్రారంభంలో మొదలవుతుంది. నవంబర్ వరకు కొనసాగుతుంది. ఇప్పటికే చార్‌ధామ్ యాత్ర ప్రారంభం అయ్యింది. రెండు రోజుల క్రితం కేదార్ నాథ్, గంగోత్రి, యమునోత్రి సహా మూడు ధామ్‌లు సందడిగా మారాయి.
