తీహార్ జైల్లో తోటి ఖైదీని క్రికెట్ బ్యాట్ తో కొట్టి హత్య చేసిన కేసులో నలుగురు అండర్ ట్రయల్ ఖైదీలను ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు శుక్రవారం దోషులుగా నిర్ధారించింది. మూడేళ్ల నాటి ఈ హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారించింది. అప్పట్లో ఈ జైల్లో హత్య ఉదంతం చర్చనీయాంశమైంది. ఈ కేసులో నలుగురు అండర్ ట్రయల్ ఖైదీలు కిషన్ శ్రేష్ఠ, గణపత్ అలియాస్ కునాల్, హన్నీ, అరుణ్ అలియాస్ మాండ్వాలను దోషులుగా తేలుస్తూ.. ఢిల్లీలోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి శుక్రవారం తీర్పు వెలువరించారు. నలుగురు నిందితులను కోర్టు దోషులుగా నిర్ధారించిందని సీబీఐ ప్రతినిధి తెలిపారు. జూన్ 5, 2024న శిక్షను ప్రకటించాలని కోర్టు నిర్ణయించింది.
READ MORE: Karnataka : ఆపరేషన్ చేసి గర్భాశయంలో మూడడుగుల బట్ట మర్చిపోయిన డాక్టర్
కాగా.. ఈ కేసు అప్పట్లో దుమారం రేపింది. జైలులో మరణించిన ఖైదీ పేరు శ్రీకాంత్ రామ్ స్వామి. తీహార్ జైలు నంబర్ 2లోని బ్యారక్ నంబర్ 4లో అతడిని ఉంచారు. శ్రీకాంత్ అండర్ ట్రయల్ ఖైదీ, అతనిపై హత్య, దోపిడీ వంటి అనేక తీవ్రమైన కేసులు ఉన్నాయి. కాగా.. అదే జైలులో ఉన్న నలుగురు ఖైదీలు శ్రీకాంత్ రామ్ స్వామిపై క్రికెట్ బ్యాట్‌లతో అకస్మాత్తుగా దాడి చేశారు. ఆ దాడిలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం స్థానిక సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో బాధితుడిని చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. శ్రీకాంత్ రామ్‌స్వామి సోదరి సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ఐదు నెలల్లోనే 2021 డిసెంబర్ 22న సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేసింది.