Site icon NTV Telugu

Thappad Gang: చీకట్లో బైక్‌పై వస్తారు.. చెంప పగులగొట్టి పోతారు.. “చెంపదెబ్బల ముఠా” హల్‌చల్ (వీడియో)

Up

Up

Thappad Gang: దోపిడీలు, దొంగతనాల ముఠాలను చూసే ఉంటాం. కానీ.. ఉత్తరప్రదేశ్‌లో ఓ గమ్మత్తు ముఠా హల్‌చల్ చేస్తోంది. వీళ్లు దోపిడీలు చెయ్యరు. చోరీలకు పాల్పడరు. రాత్రి పూట వచ్చి చెంపపగుల గొట్టి వెళ్లిపోతారు. ముజఫర్‌నగర్ జిల్లాలో ప్రస్తుతం ఈ చెంపదెబ్బల ముఠా (థప్పడ్ గ్యాంగ్) భయం వ్యాపిస్తోంది. ఈ ‘తప్పడ్ గ్యాంగ్’ పేరుతో కొంతమంది యువకులు అమాయక బాటసారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. రాత్రి చీకట్లో బైక్‌లపై వెనుక నుంచి వెంబడిస్తున్నారు. పాదచారులను చెంపదెబ్బ కొట్టి లేదా ఇతరత్రా దాడి చేసి పారిపోతున్నారు.

READ MORE: HIV Injection Case: పెళ్లికి నిరాకరించిన ప్రియురాలికి HIV ఇంజెక్షన్‌ ఇచ్చిన ప్రియుడు.. అవమానంతో యువతి..

ఏప్రిల్ 7వ తేదీ సాయంత్రం నగర్ కొత్వాలీ పరిధిలోని గౌశాల మొహల్లాలో ఇటువంటి ఘటనే వెలుగుచూసింది. ఇందుకు సంబంధించి తాజాగా ఓ సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చింది. రెండు రోజుల క్రితం మోటార్ సైకిల్‌పై వచ్చిన కొంతమంది యువకులు వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న దీపక్ అనే యువకుడిని చెంపదెబ్బ కొట్టారు. ఈ ఘటన అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోగా, సమీపంలోని ఒక ఇంట్లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో ఈ ఘటన రికార్డయింది. దీపక్ అనే యువకుడికి దెబ్బ ఎంత గట్టిగా తగిలిందంటే.. ఆ దెబ్బ తీవ్రతకు పాపం ఆ యువకుడి ముక్కు నుంచి రక్తం కారింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, ఇది ఒక్క దీపక్ విషయంలోనే జరిగిన తొలి ఘటన కాదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ పలువురిని ఈ విధంగానే కొట్టడం, బెల్టులతో దాడి చేయడం వంటివి జరిగాయని, ఈ గ్యాంగ్ ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని వాపోతున్నారు. సరదా కోసం చేస్తున్నారో లేక మరేదైనా కారణమో తెలీదు కానీ, ఈ ‘తప్పడ్ గ్యాంగ్’ ముజఫర్‌నగర్ వాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.

Exit mobile version