Site icon NTV Telugu

పండుగ రద్దీ.. TGSRTC 5,375 స్పెషల్ బస్సులు..!

Tgsrtc

Tgsrtc

TGSRTC: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC) ప్రత్యేక రవాణా ఏర్పాట్లతో సేవల్ని అందిస్తోంది. పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో ప్రత్యేక బస్సులను నడుపుతూ, వారిని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరవేస్తోంది.

ఈ నెల 9వ తేదీ నుంచి పండుగ రద్దీకనుగుణంగా ప్రత్యేక బస్సుల సేవలను ప్రారంభించిన ఆర్టీసీ.. 13వ తేదీ వరకు మొత్తం 5,375 స్పెషల్ బస్సులను ఆపరేట్ చేసింది. గత నాలుగు రోజులుగా ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ తెలిపింది. ఇంకా రవాణా సేవలపై అధికారులు, సూపర్వైజర్లు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

Siriలోకి Gemini పవర్.. Googleతో Apple భారీ AI ఒప్పందం.!

రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక సిబ్బందిని నియమించి, బస్సుల రాకపోకలపై ప్రయాణికులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రధాన రద్దీ కేంద్రాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్‌బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను టీజీఎస్‌ఆర్టీసీ నడుపుతోంది. రోజువారీగా ఆపరేట్ చేసిన స్పెషల్ బస్సుల వివరాలను సంస్థ వెల్లడించింది.

ఈ నెల 9 వ తేదిన 721, 10వ తారీఖున 1645, 11వ తారీఖున 1180, 12వ తారీఖున 1109, 13వ తారీఖున (6 గం.ల వరకు) 720 ప్రత్యేక బస్సుల ద్వారా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు తెలిపింది. ప్రధానంగా జేబీఎస్ నుంచి 1,484, ఎంజీబీఎస్ నుంచి 1,170, ఉప్పల్ నుంచి 807, కేపీహెచ్‌బీ నుంచి 916, ఎల్‌బీనగర్ నుంచి 715, ఆరాంఘర్ నుంచి 283 స్పెషల్ బస్సులు నడిపినట్లు పేర్కొంది.

Love Insurance: లవ్‌ ఇన్సూరెన్స్‌ గురించి విన్నారా..? ప్రపోజ్‌ చేసింది.. పాలసీ కొనుగోలు చేసింది.. పెళ్లికి ఎంత డబ్బు వచ్చిందంటే..?

సంక్రాంతి పండుగ అనంతరం తిరుగు ప్రయాణంలో కూడా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ నెల 18, 19 తేదీల్లో ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. ఈ ప్రత్యేక రవాణా సేవల నిర్వహణలో సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్నారని సంస్థ పేర్కొంది. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా అవసరమైన సమాచారాన్ని ముందుగానే అందిస్తున్నామని అధికారులు తెలిపారు. సుదూర ప్రయాణాలు చేసే వారు ముందస్తు రిజర్వేషన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుని టీజీఎస్‌ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని కోరారు.

Exit mobile version