TGSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ ధమాకా ఆఫర్.. సరికొత్త పథకానికి శ్రీకారం.. కేవలం రూ.600లకే..

Tgsrtc

Tgsrtc

హైదరాబాద్ నగరవాసులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) తీపి కబురు అందించింది. ప్రయాణికులకు ప్రయాణాన్ని మరింత సులభతరం, బడ్జెట్ ఫ్రెండ్లీగా మార్చేందుకు ఒక సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. నగరం పరిధిలో రాకపోకలు సాగించే వారి కోసం ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేకంగా వీక్లీ పాస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈ నూతన ఆఫర్ ప్రకారం.. కేవలం రూ. 600లకే వారం రోజుల పాటు నగరంలోని క్యూర్ పరిధిలో అపరిమితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. సాధారణ సిటీ బస్సులతో పాటు ఏసీ బస్సులలో కూడా ఈ పాస్‌తో ప్రయాణించవచ్చని ఆర్టీసీ ప్రకటించింది. ప్రతిరోజు ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర పనుల నిమిత్తం నగరంలో వివిధ ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఈ వీక్లీ పాస్ ఎంతో ఆర్థిక ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. రోజువారీ ఛార్జీల భారం తగ్గడమే కాకుండా, పదే పదే టికెట్లు తీసుకునే పనిలేకుండా ప్రయాణం ఎంతో సులభతరం అవుతుంది.

ఈ వీక్లీ పాసులు నగరంలోని అన్ని సిటీ బస్ పాస్ కౌంటర్లలో అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు తమకు సమీపంలో ఉన్న బస్ పాస్ కౌంటర్లకు వెళ్లి ఈ పాస్‌ను సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఆర్టీసీ తీసుకొచ్చిన ఈ ధమాకా ఆఫర్‌ పట్ల నగర ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులందరూ సద్వినియోగం చేసుకోవాలని టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం కోరింది.