NTV Telugu Site icon

TGSRTC : నిరాధారమైన ఆరోపణలను ఖండించిన టీజీఎస్ఆర్టీసీ

Tgsrtc

Tgsrtc

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ)లో ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టం (ఏఎఫ్‌సీఎస్‌) అమలు విషయంలో చేస్తోన్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు. ఉన్నతస్థాయి కమిటీ సిఫారసు మేరకు బోర్డు అనుమతితోనే ఈ వ్యవస్థను సంస్థ అమలు చేయడం జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారించిందని చేస్తోన్న నిరాధారమైన ఆరోపణలను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం  ఖండిస్తోంది. నియమ నిబంధనలకు లోబడి బోర్డు అనుమతితోనే సంస్థలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేస్తోంది.

అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుని ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టంను అమలు చేయాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం 2022లోనే నిర్ణయించింది. బస్సుల్లో యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డులతో కూడిన డిజిటల్ పేమెంట్స్, స్మార్ట్ కార్డ్స్, మొబైల్ టికెట్స్, మొబైల్ బస్ పాస్ ల  సౌకర్యం కల్పిస్తూ.. సేవలను మరింతగా సులభతరం చేయడమే ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం. ఈ వ్యవస్థ వల్ల రియల్ టైం సమాచారం ఎప్పటికప్పుడు క్షణాల వ్యవధిలో సంస్థకు తెలుస్తుంది. ఈ సమాచారంతో ప్రయాణికుల డిమాండ్ మేరకు రద్దీని బట్టి సర్వీసులను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రస్తుత టికెటింగ్ వ్యవస్థ కంటే ఇది ఎంతో మెరుగైనది.

డిజిటల్ టికెటింగ్ కు సంబంధించిన టెండర్ ప్రకటనను 02-11-2022 టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం విడుదల చేసింది. అప్పుడు ఈ టెండర్ ప్రక్రియలో ఆరు కంపెనీలు పాల్గొన్నాయి. టెండర్ లో ఇంటలిజెంట్ టికెటింగ్ మిషన్ల సప్లై, డిజిటల్ టికెటింగ్, సాప్ట్ వేర్ డెవలప్ మెంట్, రోజువారి నిర్వహణకు కావాల్సిన సర్వర్లు, సాంకేతికత, మ్యాన్ పవర్, తదితర సర్వీసులు ఉన్నాయి.

ఆన్ లైన్ టికెట్ రిజర్వేషన్ కు సంబంధించిన సర్వీస్ ప్రొవైడర్ గడువు ముగుస్తుండటంతో.. ఆన్ లైన్ రిజర్వేషన్ తో పాటు డిజిటల్ టికెటింగ్ సౌకర్యం ఒకటే సర్వీస్ ప్రొవైడర్ దగ్గరుంటే నిర్వహణ సులువుగా ఉంటుందని యాజమాన్యం భావించింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ రోడ్డు రవాణా, రహదారుల శాఖ… ప్రజా రవాణా వ్యవస్థలో సాంకేతికత అమలుకు రూ.20.97 కోట్లు నిధులను సంస్థకు మంజూరు చేసింది. ఆ నిధులతో ఐటిమ్స్ ను సొంతంగా కొనుగోలు చేయాలని సంస్థ నిర్ణయించింది. పై రెండు కారణాల వల్ల ఆ టెండర్ ను 03.07.2023న రద్దు చేయడం జరిగింది.

ఏఎఫ్‌సీఎస్‌ ను వీలైనంత త్వరగా అమలు చేయాలనే ఉద్దేశంతో మరో టెండర్ ప్రకటనను 11.01.2024న సంస్థ విడుదల చేసింది. డిజిటల్ టికెటింగ్ సాప్ట్ వేర్ తో పాటు ఆన్ లైన్ రిజర్వేషన్ ను కలిపి.. ఐటిమ్స్ కొనుగోలు,  సాప్ట్ వేర్ డెవలప్ మెంట్, నిర్వహణ అంశాలను వేర్వేరుగా పేర్కొంటూ ధరలను సూచించాల్సిందిగా ఆ టెండర్ ను జారీ చేసింది. ఈ టెండర్ లో మూడు కంపెనీలు పాల్గొన్నాయి.

ఆయా కంపెనీల డాక్యుమెంట్స్ తో పాటు సాంకేతిక నిర్వహణ సామర్థ్యంపై ప్రజంటేషన్స్ ను కమిటీ పరిశీలించింది. ఏ కంపెనీకి కూడా టెండర్ లో పేర్కొన్న అన్ని సేవలను సంతృప్తి కరంగా అందించే సామర్థ్యం లేనందున.. కమర్షియల్ బిడ్ ను ఓపెన్ చేయకుండానే ఈ టెండర్ ను 29.02.2024న సంస్థ రద్దు చేసింది.

ప్రస్తుతం సంస్థ వాడుతున్న సాధారణ టిమ్ లు కాలపరిమితి పూర్తవుతుండటం, ఆన్ లైన్ టికెట్ రిజర్వేషన్ సర్వీస్ ప్రొవైడర్ గడువు ముగుస్తుండటం, కేంద్ర నిధులు నిరుపయోగంగా ఉండటంతో ఏఎఫ్‌సీఎస్‌ త్వరగా అమలు చేసేందుకు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. గత టెండర్లలో పాల్గొన్న కంపెనీల అనుభవం, పనితీరును ఆ కమిటీ మరోకసారి పరిశీలించింది.

సదురు కంపెనీల సాంకేతిక నిర్వహణ సామర్థ్యం, పూర్వ అనుభవం, తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని.. సంస్థకు అవసరమైన అన్ని సేవలను త్వరితగతిన స్థిరంగా అందించగలిగిన కంపెనీని ఎంపిక చేయాలని కమిటీ నిర్ణయించింది.

ఈ నేపథ్యంలోనే ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టం పనితీరు, అందిస్తోన్న సేవలపై సమగ్రంగా అధ్యయనం చేసేందుకు టీజీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారుల బృందం దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటించింది. అక్కడి ఉన్నతాధికారులను సంప్రదించి.. వారి అభిప్రాయాలను సేకరించింది. ఈ వ్యవస్థ అమలుకు సాంకేతిక నిర్వహణ సామర్థ్యం, నాణ్యత ప్రమాణాలు, మెరుగైన పనితీరు, ఆర్థిక, తదితర అంశాలను ఇతర కంపెనీలతో బేరిజు వేసుకుని ఛలో మొబిలిటీకి ఈ సేవలను అందించే బాధ్యతను అప్పగించాలని ఉన్నతస్థాయి కమిటీ ప్రతిపాదించింది.

ఛలో మొబిలిటీ సంస్థకు క్యూఆర్ బేస్డ్ మొబైల్ టికెటింగ్, క్లోజ్డ్ లూప్ స్మార్ట్ కార్డ్స్, మొబైల్ పాసెస్, ఎన్ సీ ఎంసీ కార్డుల జారీలో మంచి అనుభవముంది. ఈ కంపెనీ బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్ పోర్ట్ అండర్ టేకింగ్ (బెస్ట్)లో 3500 బస్సుల్లో పై సేవలను సమర్థవంతంగా అందిస్తోంది.  బెస్ట్ తో పాటు ఈ కంపెనీ బిహార్, అసోం, తదితర రవాణా సంస్థలతో పాటు ఇండోర్, జబల్ పూర్ నగరాల్లో 10 వేలకు పైగా ఐటిమ్స్ ద్వారా నాణ్యమైన సేవలను అందిస్తోంది. ప్రజలకు మెరుగైన ప్రయాణ అనుభూతిని కల్పించడం కోసం.. అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. డిజిటలైజేషన్ లో వస్తోన్న పోకడలపైన ప్రత్యేక దృష్టి పెట్టి.. ముంబైలో దాదాపు 11 లక్షల స్మార్ట్ కార్డులను జారీ చేసిన అనుభవం ఈ కంపెనీకి ఉంది.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న మహాలక్ష్మి – మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు స్మార్ట్ కార్డులు జారీ  చేయాలని భావిస్తున్నందున.. ఛలో మొబిలిటీ అనుభవం ఉపయోగపడుతుందని గుర్తించింది. సంస్థకు సాంకేతికపరమైన భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ కంపెనీ సరైనదని కమిటీ నిర్ధారించింది.  పలు దఫాలుగా ఛలో మొబిలిటీతో చర్చించింది. ఇతర రాష్ట్రాల రేట్ల ను పరిశీలించింది. తక్కువ ధరకు ఇక్కడ ఏఎఫ్‌సీఎస్‌ అమలుకు అంగీకరించడంతో.. ఆ కంపెనీతో ఒప్పందం చేసుకోవాలని సూత్రప్రాయంగా సంస్థ నిర్ణయించి.. బోర్డుకు సిఫారసు చేసింది. ఉన్నతస్థాయి కమిటీ నివేదిక ఆధారంగా బోర్డు అనుమతితో 15.03.2024 నాడు చలో మొబిలిటీకి లెటర్ ఆఫ్ ఇంటెంట్(ఎల్ఓఐ) ఇవ్వడం జరిగింది.

ప్రస్తుతం ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టం అమలుకు సంబంధించిన కసరత్తును ఛలో మొబిలిటీ ప్రారంభించింది. త్వరలోనే కొన్ని డిపోల్లో ఫైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనుంది. పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి మూడు నెలల సమయం పడుతుంది.

ఒప్పందం ప్రకారం ఐటిమ్స్ సాప్ట్ వేర్  నిర్వహణ కు నెలకోసారి సర్వీస్ ప్రొవైడర్ కు నగదు చెల్లించడం జరుగుతుంది. ప్రయాణికుల సంఖ్యను బట్టి కాకుండా.. టికెట్ సంఖ్యను పరిగణలోకి తీసుకుని చెల్లింపులను చేస్తుంది. ఉదాహరణకు ఒకటి కంటే ఎక్కువ మంది ప్రయాణికులు కలిసి ఒకే టికెట్ తీసుకుంటే.. అది ఒక టికెట్ గా పరిగణించబడుతుంది. ఆ కంపెనీకి నగదు చెల్లింపులకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో అవలంభిస్తోన్న విధానాన్నే సంస్థ ఇక్కడ కూడా అమలు చేస్తోంది.

కంపెనీల పూర్వ అనుభవం, నిర్వహణ సామర్థ్యం, నాణ్యత ప్రమాణాలు, సాంకేతిక నైపుణ్యత, తదితర అంశాలపై తలెత్తిన సందేహాలను నివృత్తి చేయని సందర్భంలో టెండర్ ప్రక్రియను ఏ దశలోనైనా నిలిపి వేసే సంపూర్ణ అధికారం టెండర్ కమిటీకి ఉంటుంది. ప్రతి టెండర్ నోటిఫికేషన్ లోనూ ఈ విషయాన్ని స్పష్టంగా సంస్థ పేర్కొంటుంది.

టీజీఎస్ఆర్టీసీలో టెండర్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుంది. బిడ్స్ స్వీకరణకు ముందు ఆశవాహ కంపెనీలతో ప్రీ బిడ్ సమావేశాన్ని సంస్థ ఏర్పాటు చేస్తుంది. వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తుంది. నిబంధనలకు లోబడి ఉండే సాధ్యమైన సలహాలు, సూచనలను సంస్థ అంగీకరిస్తుంది. అందుకు సంబంధించిన సవరణ (అమెండ్ మెంట్) డాక్యుమెంట్లను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతుంది. ఇది ప్రతి టెండర్ లోనూ సాధారణంగా జరిగే ప్రక్రియ.

టీజీఎస్ఆర్టీసీలో సాంకేతిక అంశాలకు సంబంధించిన ఏ టెండర్ ప్రక్రియ అయినా ఆఫ్ లైన్ పద్దతిలోనే జరుగుతుంది. నోటిఫికేషన్, సంబంధిత సవరణలతో కూడిన డాక్యుమెంట్లను సంస్థ అధికారిక, ప్రభుత్వ వెబ్ సైట్లలో పొందుపరుచడం జరుగుతుంది. ప్రతి టెండర్ నోటిఫికేషన్ ప్రకటనలు మాత్రమే ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయి. బిడ్ ల స్వీకరణ స్వయంగా వచ్చి దాఖలు చేయాలి. టెండర్లను గోప్యంగా ఉంచుతున్నారని ఆరోపించడంలో నిజం లేదు. ఇది పూర్తి అవాస్తవం.

నిబంధనలకు విరుద్ధంగా ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టం అమలు జరుగుతుందనే ఆరోపణల్లో వాస్తవం లేదు. సంస్థ నియమ నిబంధనలకు లోబడి బోర్డు అనుమతితోనే సర్వీస్ ప్రొవైడర్ ఎంపిక జరిగింది. సంస్థకు సంబంధించిన టెండర్, ఒప్పందాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి గానీ, రవాణా మంత్రిత్వ శాఖకు గానీ ఎలాంటి ప్రమేయం ఉండదు. పూర్తిగా బోర్డు అనుమతి మేరకే సంస్థలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.

ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ సౌకర్యవంతమైన, వేగవంతమైన సేవలందిస్తూ.. ప్రజా  రవాణా వ్యవస్థను ప్రజలకు మరింతగా చేరువ చేసేందుకు రెండున్నరేళ్లుగా ఎన్నో కార్యక్రమాలను సంస్థ అమలు చేస్తూ వస్తోంది. అనేక సంస్కరణలను చేసి విప్లవాత్మక మార్పులను సంస్థలో తీసుకురావడం జరిగింది. బోర్డు పారదర్శకంగా నిర్ణయాలు తీసుకుని.. వాటిని సమర్థవంతంగా అమలు చేయడం వల్లే దేశంలోనే అత్యుత్తమ ప్రజా రవాణా సంస్థగా నేడు టీజీఎస్ఆర్టీసీ నిలిచింది. టీజీఎస్ఆర్టీసీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా కొందరు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేయడం ఏమాత్రం సమంజసం కాదు.