నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) జలమండలి (హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు)లో మేనేజర్ (ఇంజనీరింగ్) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మల్టీ జోన్-2 పరిధిలోని ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 130 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇందులో 80 శాతం పోస్టులు సివిల్ ఇంజనీరింగ్, 15 శాతం పోస్టులు ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్, 5 శాతం పోస్టులు సీఎస్‌ఈ/ఐటీ/ఈసీఈ ఇంజనీరింగ్ అభ్యర్థులకు కేటాయించబడ్డాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు జూలై 1, 2026 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ట వయస్సులో 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయస్సు సడలింపు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 54,220 నుండి రూ. 1,33,630 వరకు వేతనం లభిస్తుంది.
దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 23, 2026 నుంచి ప్రారంభమై, అక్టోబర్ 17, 2026 సాయంత్రం 5:00 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువుగా ఉంది. అభ్యర్థులు TGPSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ముందుగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) చేసుకొని, ఆన్‌లైన్ దరఖాస్తును పూర్తి చేయాలి.
ఓసీ , బీసీ అభ్యర్థులకు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ. 1000 ఉండగా.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 500గా నిర్ణయించారు. అలాగే నిరుద్యోగులందరికీ పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం పరీక్ష ఫీజు చెల్లించాలి.
రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) కంప్యూటర్ ఆధారిత రిక్రూట్మెంట్ టెస్ట్ (CBRT) లేదా ఓఎంఆర్ (OMR) విధానంలో డిసెంబర్ 2026లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో పేపర్-1 కింద జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ (150 మార్కులు).. పేపర్-2 కింద సంబంధిత ఇంజనీరింగ్ సబ్జెక్ట్ (300 మార్కులు) ఉంటాయి. ఈ రాత పరీక్షలో సాధించిన మార్కులు, స్థానికత నిబంధనల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు చివరి తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

