NTV Telugu Site icon

IND vs NZ: భారత్‌పై విజయం డబ్ల్యూటీసీ ఫైనల్‌ కంటే ఎక్కువ.. సౌథీ ఆసక్తికర వ్యాఖ్యలు!

Tim Southee

Tim Southee

భారత గడ్డపై టీమిండియాపై విజయంను తాము డబ్ల్యూటీసీ ఫైనల్‌లో సాధించిన గెలుపు కంటే ఎక్కువని భావిస్తున్నాం అని న్యూజిలాండ్ స్టార్‌ పేసర్ టిమ్ సౌథీ తెలిపాడు. బెంగళూరు టెస్టులో టాస్‌తో అదృష్టం కలిసొచ్చిందని, ఒకవేళ భారత్ మొదట బౌలింగ్‌ తీసుకొని ఉంటే తమకు కష్టాలు ఉండేవే అని చెప్పాడు. రెండో టెస్టులో మాత్రం తాము అనుకున్నట్లుగానే ఆడి ఫలితం రాబట్టాం అని సౌథీ చెప్పుకొచ్చాడు. భారత్‌తో మూడు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్ ఉండగానే.. న్యూజిలాండ్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మూడో టెస్ట్ మ్యాచ్‌ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సౌథీ మీడియాతో మాట్లాడాడు.

‘భారత్‌ సొంతగడ్డపై గత 12 ఏళ్ల నుంచి వరుసగా 18 సిరీస్‌లు గెలిచింది. ఏ జట్టుకైనా భారత్‌లో ఆడటం చాలా కష్టం. నేను ఇక్కడ చాలా మ్యాచ్‌లు ఆడాను. ఆస్ట్రేలియాలో కూడా ఆడటం కూడా చాలా కష్టమే. అక్కడి పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి. ఇరు ప్రత్యర్థులు కూడా నాణ్యమైన క్రికెట్ ఆడతారు. అందుకే విదేశీ జట్లకు గెలుపు అంత తేలిక కాదు. భారత్‌లో మేం విజేతగా నిలిచాం. చాలా సంతోషంగా ఉన్నాం. ఈ విజయం మేం డబ్ల్యూటీసీ ఫైనల్‌లో సాధించిన గెలుపు కంటే ఎక్కువని భావిస్తున్నాం’ అని టిమ్ సౌథీ చెప్పాడు.

Also Read: Ola Boss Offer: 72 గంటల రష్‌ సేల్.. ఓలా ఎస్1 పోర్ట్‌ఫోలియోపై 25 వేల తగ్గింపు!

‘బెంగళూరు టెస్టులో మాకు టాస్‌ ద్వారా అదృష్టం కలిసొచ్చింది. ఒకవేళ టీమిండియా మొదట బౌలింగ్‌ తీసుకొని ఉంటే.. మాకు కష్టాలు తప్పక పోవచ్చు. బెంగళూరు వికెట్ అలా స్పందిస్తుందని ఎవరూ ఊహించరు. పరిస్థితులను ఉపయోగించుకుని.. మేం పైచేయి సాధించాం. పూణే టెస్టులో మాత్రం ప్రణాళికల ప్రకారం ఆడి విజయం సాధించాం. ఏ మ్యాచ్‌కైనా మరీ ఎక్కువగా ప్రీప్లాన్ చేయకూడదు. మేం అలా ఎప్పుడూ చేయం. అదే మా బలం అని నేను అనుకుంటున్నా. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటం వలనే మెరుగ్గా రాణిస్తున్నాం’ అని సౌథీ పేర్కొన్నాడు. 12 ఏళ్ల కిందట చివరిసారిగా స్వదేశంలో భారత్ ఓడింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ జట్లు కూడా ఇక్కడ టెస్ట్ సిరీస్‌ను సాధించలేకపోయాయి. చివరకు కివీస్ టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుంది.