Indian Origin Vaibhav Taneja Named As Tesla New CFO: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’ కొత్త ఛీప్ ఫైనాన్సియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో)గా భారత సంతతి వ్యక్తి వైభవ్ తనేజా నియమితులయ్యారు. టెస్లా సీఎఫ్‌వోగా నాలుగేళ్ల పాటు కొనసాగిన జాచరీ కిర్కోర్న్.. తాజాగా ఆ పదవికి రాజీనామా చేశారు. దాంతో అకౌంటింగ్ హెడ్‌గా ఉన్న వైభవ్ తనేజా.. కిర్కోర్న్ స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎఫ్ఓ రాజీనామా న్యూస్ బయటకు రావడంతో.. టెస్లా షేర్లు సోమవారం (ఆగష్టు 7) మూడు శాతం నష్టపోయాయి.
టెస్లా కంపెనీలో కీలకంగా వ్యవహరిస్తూ ‘మాస్టర్ ఆఫ్ కాయిన్’గా ఉన్న జాచరీ కిర్కోర్న్ ఉన్నఫళంగా రాజీనామా చేయడానికి గల కారణాలను సంస్థ వెల్లడించలేదు. టెస్లా కంపెనీలో జాచరీ 13 సంవత్సరాలుగా పని చేస్తున్నారు. జాచరీ రాజీనామా చేసినా.. కంపెనీ కార్యకలాపాలు సజావుగా సాగడంలో సహాయపడటానికి డిసెంబర్ వరకు కంపెనీలోనే కొనసాగనున్నారు. టెస్లా కంపెనీలో భాగస్వామిని కావడం తనకు ఒక ప్రత్యేక అనుభవం అని జాచరి పేర్కొన్నారు.
‘టెస్లా కంపెనీలో భాగం కావడం ఓ ప్రత్యేక అనుభవం. నేను 13 ఏళ్ల క్రితం చేరినప్పటి నుంచి ఇప్పటివరకు అందరితో కలిసి పని చేసినందుకు చాలా గర్వపడుతున్నా’ అని జాచరీ కిర్కోర్న్ తన లింక్డ్ ఇన్ పోస్టులో పేర్కొన్నారు. టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ 2019లో జాచరిని సీఎఫ్ఓగా ప్రకటించారు. జాచరీ పదవీ కాలంలో టెస్లా మాస్ మార్కెట్ మోడల్ 3 కాంపాక్ట్ సెడాన్ అమ్మకాలను ఆరంబించింది. మొదటి త్రైమాసికంలో గణనీయమైన లాభాలు వచ్చాయి.
Also Read: Sherfane Rutherford: ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా అర ఎకరం భూమి.. అది కూడా అమెరికాలో!
మరోవైపు వైభవ్ తనేజా ఢిల్లీ యూనివర్సిటీలో కామర్స్‌లో పట్టా అందుకున్నారు. వైభవ్‌కు అకౌంటింగ్‌లో 20 ఏళ్ల అనుభవం ఉంది. టెస్లా కంపెనీలో చేరకముందు టెక్నాలజీ, ఫైనాన్స్, రిటైల్, టెలికం రంగ కంపెనీల్లో పని చేశారు. 2016లో సోలార్ సిటీని టెస్లా కొనుగోలు చేసిన అనంతరం తనేజా జాయిన్ అయ్యారు. 2021లో టెస్లా భారతీయ విభాగానికి ఆయన డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఇప్పుడు సీఎఫ్‌వోగా నియమితులయ్యారు.