Tollywood: లాస్ట్ వీక్ దసరా సందర్భంగా శుక్రవారం కాకుండా మన తెలుగు సినిమాలు మూడూ (”గాడ్ ఫాదర్, ది ఘోస్ట్, స్వాతిముత్యం”) బుధవారం రోజునే విడుదలై పోయాయి. పండగ సీజన్ కాబట్టి ఆ వారం మొత్తం చక్కని కలెక్షన్లు వస్తాయని సదరు నిర్మాతలు భావించారు. కానీ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు సైతం ఆశించిన స్థాయిలో కలెక్షన్లు వసూలు చేయలేకపోయాయి. ఈ నేపథ్యంలో ఈ వీకెండ్ లో విడుదలయ్యే సినిమాలు ఎలాంటి ప్రేక్షకాదరణ పొందుతాయనే సందేహం ప్రతి ఒక్కరిలో నెలకొంది. పైగా ఇవన్నీ మీడియం, స్మాల్ బడ్జెట్ మూవీస్ కావడంతో ఎవరికీ వీటిపై పెద్దంత ఆసక్తి కూడా లేదు.
ఈ శుక్రవారం వస్తున్న సినిమాలలో చెప్పుకోదగ్గది ఆది సాయికుమార్ నటిస్తున్న ‘క్రేజీ ఫెలో’. దిగంగనా సూర్యవంశీ, మర్నా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని ఫణికృష్ణ సిరికి డైరెక్ట్ చేశాడు. అలానే ఎంతోకాలం క్రితమే రావాల్సి ఉన్న హెబ్బా పటేల్ ‘గీత’ మూవీ సైతం ఈ శుక్రవారమే విడుదల అవుతోంది. హెబ్బా పటేల్ మూగ అమ్మాయిగా నటించిన ‘గీత’లో సునీల్ ఓ కీలకమైన పాత్ర పోషించాడు. వినాయక్ శిష్యుడు విశ్వ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
విశ్వాంత్ దుడ్డుంపూడి, మాళవిక సతీశన్ జంటగా నటించిన సినిమా ‘బోయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’. సంతోష్ కంభంపాటి ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ఇప్పటికే రెండు మూడు సినిమాలలో హీరోగా నటించి, తన అదృష్టం పరీక్షించుకున్నాడు. తాజాగా అతను ‘నిన్నే పెళ్ళాడుతా’ అనే సినిమాలోనూ నటించాడు. సిద్ధికా శర్మ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని వైకుంఠ బోస్ డైరెక్ట్ చేశాడు. తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా నటించిన సినిమా ‘నా వెంటపడుతున్న చిన్నవాడెవడమ్మా!’ ఈ సినిమా కూడా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. పలుమార్లు వాయిదా పడుతూ ఈ వారం జనం ముందుకు వస్తోంది. అలానే అభిరామ్ వర్మ, సాత్విక జోడీ కట్టిన ‘నీతో’ మూవీ, ‘రుద్రనేత్ర’ సినిమాలు సైతం శుక్రవారం విడుదల అవుతున్నాయి.
ఇదిలా ఉంటే, ఇటీవల కన్నడలో విడుదలై ఘన విజయం సాధించిన రిషభ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతారా’ సినిమాను అదే పేరుతో తెలుగులో ఈ నెల 15వ తేదీ గీతా ఆర్ట్స్ సంస్థ తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయబోతోంది. అలానే 14వ తేదీ యశ్ నటించిన కన్నడ అనువాద చిత్రం ‘రారాజు’ రాబోతోంది. వీటితో పాటు ప్రముఖ నిర్మాత నట్టికుమార్, ఆర్జీవీ దర్శకత్వం వహించిన ‘అడవి’ సినిమాను, ప్రభాస్ నటించిన ‘రెబల్’ మూవీని 14, 15 తేదీలలో రీ-రిలీజ్ చేయబోతున్నాడు. ఆ రకంగా పదికి పైగా సినిమాలు ఈ వీకెండ్ లో థియేటర్లలో ప్రత్యక్షం కాబోతున్నాయి. మరి వీటిల్లో వేటికి ప్రేక్షకులు పట్టం కడతారో చూడాలి.