Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ..

  • తెలంగాణ వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ..
  • మార్చి 18 లేదా 19 తర్వాత భారీ వర్షాలు..
  • అప్పటి వరకు తప్పని భానుడి భగభగలు
Telangana Rains

Telangana Rains

తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో వాతావరణం అనూహ్యంగా మారనుంది. మార్చి మధ్య వరకు భానుడి భగభగలు కొనసాగనుండగా.. ఆ తర్వాత అకాల వర్షాలు పలకరించనున్నాయని వాతావరణ శాఖ (IMD) , వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎండలు ముదిరిపోతున్నాయి. మార్చి 18వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట వంటి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకు చేరవచ్చు. హైదరాబాద్ నగరంలో పగటి ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల నుంచి 37 డిగ్రీల మధ్య నమోదు కానున్నాయి.  మధ్యాహ్నం 12 నుండి 4 గంటల మధ్య ప్రజలు అనవసరంగా బయటకు రాకూడదని.. ముఖ్యంగా వృద్ధులు , చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగిస్తూ మార్చి 18 లేదా 19వ తేదీ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈసారి కురిసే వర్షాలు గత ఫిబ్రవరిలో వచ్చిన వానల కంటే తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ అంచనా వేస్తున్నారు.

Also Read: Exam Anxiety: ఈ చిన్న ట్రిక్‌తో విద్యార్థులకు మార్కులే మార్కులు..ఎగ్జామ్‌ యాంగ్జైటీని ఇలా తరిమికొట్టండి!

ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతో పాటు కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పంట కోత దశలో ఉన్న రైతులు ధాన్యం తడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఈ ఏడాది తెలంగాణలో వాతావరణ మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఫిబ్రవరి రెండో వారం నుంచే వేసవి ఛాయలు మొదలవ్వడం, మళ్ళీ నెలాఖరులో అకాల వర్షాలు ముంచెత్తడం దీనికి నిదర్శనం. ఈ ఏడాది ఎల్-నినో ప్రభావం వల్ల సాధారణం కంటే ఎక్కువ రోజులు వడగాల్పులు వీచే అవకాశం ఉందని IMD పేర్కొంది. ఉష్ణోగ్రతల పెరుగుదల దృష్ట్యా రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లను జారీ చేశారు. ఎండల వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా నిమ్మరసం, కొబ్బరి నీళ్లు వంటి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.