IMD Issues Orange Alert for Telangana Today: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. గత వారం రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జోరు వానలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నేడు కూడా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Also Read: Rajagopal Reddy: పదవులు, పైసలూ మీకేనా.. సీఎంను ప్రశ్నించిన మునుగోడు ఎమ్మెల్యే!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. భారీ ఉరుములతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షం పడుతోంది. కరీంనగర్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ములుగు, మహబూబాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ ఎలర్ట్ జారీ చేసింది. ఆదివారం కూడా ఈ తొమ్మిది జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయి.
