GPO : రాష్ట్రంలోని గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. ఈ దిశగా భూభారతి ఆర్వోఆర్-2025 చట్టంలోని నిబంధనలను అనుసరిస్తూ, గ్రామ పాలన అధికారుల నియామకం (జీపీవో) అవసరమవుతున్న నేపథ్యంలో, సంబంధిత ప్రక్రియను వేగవంతం చేస్తోంది. పూర్వపు వీఆర్వోలు , వీఆర్ఏల ఎంపికకు సంబంధించి పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పరీక్షను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో టీఎస్‌పీఎస్సీ (తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్)కి బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇందుకోసం తగిన భవనాలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
వచ్చే నెల 10వ తేదీన పరీక్ష నిర్వహించే అవకాశమున్నప్పటికీ, ఖచ్చితమైన తేదీ నిర్ణయం టీఎస్‌పీఎస్సీకి వదిలివేయబడ్డది. ఇదిలా ఉంటే, జీపీవో పోస్టులపై ఆసక్తి చూపుతున్న అభ్యర్థుల నుంచి ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించారు. రేపటితో అప్లికేషన్ గడువు ముగియనున్న నేపథ్యంలో, అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గ్రామీణ పరిపాలనలో కీలక పాత్ర పోషించనున్న ఈ నియామక ప్రక్రియతో రెవెన్యూ శాఖలో కొత్త శక్తి ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
