TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?

Tgsrtc

Tgsrtc

TGSRTC Union Elections: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఎన్నికలు జరుగుతుండటంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల్లో ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర కార్మిక శాఖ పర్యవేక్షిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ డిపోలలో ఉదయం 5 గంటలకే ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ ప్రక్రియను సాంప్రదాయ బ్యాలెట్ పేపర్ విధానంలో నిర్వహిస్తున్నారు. మొత్తం 36,300 మంది ఆర్టీసీ కార్మికులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ప్రతీ కార్మికుడు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఒకటి రాష్ట్రస్థాయి గుర్తింపు సంఘానికి, మరొకటి రీజియన్ స్థాయి గుర్తింపు సంఘానికి. దూర ప్రాంతాల్లో డిప్యూటేషన్‌పై సర్వీసులో ఉండే ఉద్యోగుల సౌకర్యార్థం ఈ నెల 14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ సదుపాయం కల్పించారు. పోలింగ్ సమయానికి ముందు ఇరు ప్రధాన కూటముల ప్రచారం హోరాహోరీగా సాగింది. EU – TMU – NMU కూటమి ఈ ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తుండగా, TWU – SWU – SWF కూటమి తాము భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నామని ధీమాగా ప్రకటిస్తున్నాయి. పోలింగ్ ముగిసిన అనంతరం, ఈ నెల 17న ఓట్ల లెక్కింపు పూర్తి చేసి కార్మిక శాఖ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనుంది.