Conductor Pravallika: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక (24) మృతి చెందారు. విధి నిర్వహణలో భాగంగా తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లోని సాయి సంజీవని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. కొద్ది రోజుల క్రితం బస్సులో ప్రయాణికురాలితో టికెట్ విషయంలో వివాదం జరిగింది. ఈ సమయంలో ఓ ప్రయాణికులు కండక్టర్ ప్రవళికను తోసేసింది. ప్రమాదవశాత్తు ప్రవళిక కాలుజారి బస్సు టైర్ల కింద పడిపోయింది. దీంతో ఆమె కాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యం మెరుగుపడుతుందని అంతా భావించారు.
కానీ వైద్యుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. ప్రయాణికురాలి నిర్వాకంతో చిన్న వయసులోనే ప్రవళిక చెందడంతో మణుగూరు డిపోతో పాటు ఆర్టీసీ ఉద్యోగులందరిలోనూ శోకసంద్రం అలుముకుంది. ఈ సంఘటనపై స్పందించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం, ఆర్టీసీ తరఫున రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు, ఆమె తల్లికి ఉద్యోగం, కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రవళిక కుటుంబాన్ని సంపూర్ణంగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

