Vehicle Tax Cancelled: వాహనదారులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. 2 శాతం ట్యాక్స్ రద్దు..

  • రెండో వాహనం కొనుగోలుపై అదనపు భారం నుంచి విముక్తి..
  • 2 శాతం ట్యాక్స్ రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం..
  • మార్చి 23 నుంచి అమలుకు శ్రీకారం..
Vehicle Tax

Vehicle Tax

సొంతంగా వాహనం ఉన్నవారు మరో కొత్త బండి కొనుగోలు చేయాలంటే ఇప్పటివరకు అదనపు భారం పడేది. కానీ ఇకపై ఆ టెన్షన్ అక్కర్లేదు. రెండో వాహనం కొనుగోలుపై ప్రభుత్వం విధిస్తున్న అదనపు 2 శాతం జీవితకాలపు పన్ను (Life Tax)ను రద్దు చేస్తూ తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది.

ఎందుకు ఈ మార్పు..?

రాష్ట్ర రవాణా శాఖలో ఈ నెల 23 నుంచి జాతీయ స్థాయి ‘వాహన్’ (VAHAN) పోర్టల్ అందుబాటులోకి వస్తోంది. దీనితో మన రాష్ట్ర రవాణా వ్యవస్థ అనుసంధానం కాబోతోంది. ఈ పోర్టల్ పనితీరు ప్రకారం.. ఒక వ్యక్తి పేరు మీద ఎన్ని వాహనాలు ఉన్నాయనే దానితో సంబంధం లేకుండా.. అదనపు పన్ను సాఫ్ట్‌వేర్‌లో జనరేట్ కాదు. దీనివల్ల సాంకేతికంగా రెండో వాహనంపై వేసే ఎక్స్‌ట్రా ట్యాక్స్ ఆగిపోనుంది.

Also Read:Iran Attack: హిందూ మహాసముద్రంలోని ‘డియాగో గార్సియా’పై ఇరాన్ దాడి.. రెండు క్షిపణుల ప్రయోగం..

సాధారణంగా ఒక వాహనం ఉన్న వ్యక్తి రెండోది కొంటే.. దాని విలువపై అదనంగా 2 శాతం పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం లేదు. కేవలం రెండో వాహనమే కాదు, ఆ తర్వాత మీరు ఎన్ని వాహనాలు కొన్నా సరే.. అదనపు పన్ను పడదు.

అదనపు పన్ను రద్దయినప్పటికీ.. ప్రతి వాహనానికి విధిగా చెల్లించే సాధారణ జీవితకాలపు పన్ను (Life Tax) మాత్రం యధావిధిగా కట్టాల్సి ఉంటుంది. ప్రతి ఏటా వేల సంఖ్యలో వాహనదారులు రెండో వాహనం కొంటూ ఈ అదనపు భారాన్ని మోస్తున్నారు. తాజా నిర్ణయంతో వారందరికీ ఆర్థికంగా పెద్ద ఉపశమనం లభించినట్లయింది. ఈ నెలాఖరు నుంచి కొత్త బండి కొనే ప్లాన్‌లో ఉన్నవారికి ఇది నిజంగా శుభవార్తే అని చెప్పాలి.