Telangana : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం మంచి వార్తను అందిస్తోంది. రానున్న వర్షాకాలంలో ప్రజలు తిండికి, రేషన్ సరుకులకు ఇబ్బందులు పడకుండేందుకు ముందుగానే పెద్దసెరిగా ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించింది. వర్షాకాలంలో సాధారణంగా భారీ వర్షాలు, వరదలు, రవాణా అంతరాయం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జూన్, జులై, ఆగస్ట్ నెలలకు అవసరమయ్యే రేషన్ సరుకులను ముందుగానే ఒకేసారి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వం చేసిన ప్రణాళిక ప్రకారం, ఈ మూడు నెలల రేషన్ సరుకుల పంపిణీ మే నెల చివరిలో లేదా జూన్ నెల మొదటి వారం నుంచే ప్రారంభం కానుంది. ఈ చర్యల ద్వారా ప్రజలకు రేషన్ కోసం వర్షాల మధ్య తిరగాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. దీనికి అవసరమైన ఏర్పాట్లను పౌర సరఫరా శాఖ ఇప్పటికే ప్రారంభించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 89.96 లక్షల రేషన్ కార్డులు ఉండగా, వీటి ద్వారా దాదాపు 2.81 కోట్ల మందికి సబ్సిడీ రేటుతో రేషన్ సరుకులు అందుతున్నాయి. కాగా, 2024 జనవరి 26 తర్వాత ప్రభుత్వం కొత్తగా 10 లక్షల రేషన్ కార్డులను జారీ చేయడంతో లబ్ధిదారుల సంఖ్య 3.11 కోట్లకు చేరింది.
ఈ భారీ సంఖ్యలోని లబ్ధిదారులకు బియ్యం, పప్పు, నూనె తదితర రేషన్ సరుకులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద స్థాయిలో ధాన్యం సేకరణ చేపట్టింది. ఇప్పటివరకు దాదాపు 24 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించి, మిల్లింగ్ ప్రక్రియ ద్వారా 15-16 లక్షల టన్నుల బియ్యాన్ని సిద్ధం చేశారు. ఇది రాబోయే మూడు నెలల అవసరాలకు సరిపడేలా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రతి జిల్లా కేంద్రంలో స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేయడం, రవాణా వాహనాల ద్వారా సరుకుల సరఫరా నిర్వహణ, బియ్యం నిల్వల నిర్వహణ, మరియు గ్రామ/పట్టణ స్థాయిలో పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తిచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ఉన్న 365 రేషన్ షాపుల ద్వారా ఈ పంపిణీ జరగనుంది. రేషన్ పంపిణీలో పారదర్శకత కోసం ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణను తప్పనిసరి చేశారు. అలాగే నకిలీ రేషన్ కార్డులను గుర్తించి రద్దు చేయడానికి స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టే పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇది రేషన్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కీలకంగా ఉంటుంది.
ఈ సందర్భంగా ప్రభుత్వం కొత్తగా అర్హులైన కుటుంబాలకు కూడా రేషన్ కార్డుల పంపిణీకి అవకాశం కల్పిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.5 లక్షలు మరియు పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు మించని కుటుంబాలు రేషన్ కార్డు కోసం అర్హులు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి పట్టణ ప్రాంతాలకు వలస వచ్చిన పేద కుటుంబాలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
అభ్యర్థులు తమ కార్డు స్టేటస్‌ను అధికారిక వెబ్‌సైట్ https://epds.telangana.gov.in/FoodSecurityAct/ ద్వారా లేదా MeeSeva కేంద్రాల ద్వారా తనిఖీ చేసుకోవచ్చు. కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఆదాయ ధ్రువీకరణ పత్రం లేకుండానే మీసేవ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చు.
Groom Kidnapped: పెళ్లి వేదికపై కలకలం.. పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేసిన డ్యాన్స్ టీమ్..!
