Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్‌లైన్.. డిసెంబర్‌లోనే రెడీ.!

  • డిసెంబర్‌లో స్కూళ్లు సిద్ధం
  • నిధుల సమస్యలకు చెక్
  • ఫర్నిచర్ ఏర్పాట్లు షురూ
  • పనుల నాణ్యతపై ఫోకస్
Tg

Tg

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ పైలట్ ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు విద్యాకమీషన్ చర్యలు తీవ్రతరం చేసింది. దీనిలో భాగంగా మంచాల, వంగూరు, పోల్కంపల్లి పబ్లిక్ స్కూళ్ల నిర్మాణ పనులను ప్రతి బుధవారం సమీక్షిస్తూ, నిర్దేశిత డిసెంబర్ గడువు నాటికి పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ పాఠశాలల్లో కొనసాగుతున్న నిర్మాణాల పురోగతి, నిధుల విడుదల, మౌలిక వసతులు, ఫర్నిచర్ సమకూర్పుపై స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ గణపతి రెడ్డి, విద్యాకమీషన్ సభ్యులు, సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు (HMలు) , కాంట్రాక్టర్లతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

నిధుల ఆలస్యానికి స్వస్తి.. పనుల్లో నాణ్యతే ప్రామాణికం..

పైలట్ ప్రాజెక్ట్ కింద చేపడుతున్న మూడు పాఠశాలల్లో నాణ్యతా ప్రమాణాలకు పెద్దపీట వేస్తూ పనులను వేగవంతం చేయాలని అధికారులను నవీన్ నికోలస్ ఆదేశించారు. కొన్ని పనులకు నిధుల విడుదలలో జరుగుతున్న ఆలస్యంపై సమీక్షలో సుదీర్ఘంగా చర్చించారు. నిధుల కొరత కారణంగా ఏ ఒక్క పని కూడా ఆగిపోకుండా సంబంధిత శాఖలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు. డిసెంబర్ నాటికి పనులు పూర్తిచేసి విద్యార్థులకు ఆధునిక, మెరుగైన విద్యా వాతావరణాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

జైళ్ల శాఖ నుంచి ఫర్నిచర్.. హెచ్‌ఎంలకు నికోలస్ ఆదేశాలు

పాఠశాల భవనాల నిర్మాణాలు పూర్తయ్యే సమయానికి అవసరమైన ఫర్నిచర్‌ను సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం చర్లపల్లి, చంచల్‌గూడ జైళ్లలోని ఖైదీలు తయారుచేసే నాణ్యమైన ఫర్నిచర్‌ను వినియోగించుకోవాలని నిర్ణయించారు. విద్యార్థుల సంఖ్య , తరగతి గదుల అవసరాలకు తగ్గట్టు బెంచీలు, డెస్క్‌లు, టేబుళ్లు, కుర్చీల వివరాలతో కూడిన పూర్తి ఇండెంట్‌ను తక్షణమే సిద్ధం చేయాలని హెచ్‌ఎంలను నవీన్ నికోలస్ ఆదేశించారు.

బిల్లులు, మెజర్‌మెంట్ బుక్స్‌పై ఎండీ గణపతి రెడ్డి స్పష్టత

ఈ మూడు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో పూర్తయిన పనులకు సంబంధించి మెజర్‌మెంట్ బుక్స్ (MB) నమోదు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎండీ గణపతి రెడ్డి తెలిపారు. పనుల కొలతలు, బిల్లుల చెల్లింపులు సమన్వయంతో జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, అధికారులు, హెచ్‌ఎంలు, కాంట్రాక్టర్లు ఐక్యంగా పనిచేసి డిసెంబర్ నాటికి ఈ ప్రతిష్టాత్మక పాఠశాలలను అందుబాటులోకి తేవాలని పిలుపునిచ్చారు.